ఆమె కష్టాన్ని జయించింది | Noujisha has huge hard times faced in life surrounded her | Sakshi
Sakshi News home page

ఆమె కష్టాన్ని జయించింది

Jun 30 2021 5:35 AM | Updated on Jun 30 2021 11:53 AM

Noujisha has huge hard times faced in life surrounded her - Sakshi

నౌజిషా

నౌజిషా వయసు 31. జీవితంలో ఎదురుకాకూడని కష్టాలు ఆమెను చుట్టుముట్టాయి. ఆ కష్టాల కడలిని ఈదింది. ఈ రోజు ఆమె కేరళ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్ష పూర్తి చేసి పోలీస్‌ ఆఫీసర్‌ గా విధులు నిర్వహిస్తోంది. కష్టాన్ని జయించాలి, జీవితాన్ని గెలవాలి. తననే ఆదర్శంగా తీసుకోమని కూడా చెబుతోంది.

నౌజిషాది కేరళలోని కోళికోద్‌. ఆమె జీవితంలో 2016 అత్యంత క్లిష్టమైన సంవత్సరం. అప్పటికి మూడేళ్ల వైవాహిక జీవితంలో అత్తింటి వారి హింస, వేధింపులతో జీవితం మీద విరక్తి చెందిన నౌజిషా బావిలో దూకేయాలనుకుంది. ఆ క్షణంలో కాని ఆమెకు తన కొడుకు గుర్తుకు రాకపోయి ఉంటే జరగరాని ఘోరం జరిగిపోయేది.æబిడ్డతోపాటు తన చదువు, తల్లిదండ్రులు తన మీద పెట్టుకున్న ఆశలు... అన్నీ గుర్తుకువచ్చాయి. అత్తింటి వారి ఆదరణ పొందలేకపోయినంత మాత్రాన జీవితాన్ని బలి తీసుకోవాలా? అనే ఆలోచన ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. వెంటనే భర్తకు విడాకుల నోటీస్‌ పంపించింది. తన చదువును కొనసాగించింది. 

మాట మార్చారు
నౌజిషా పెళ్లి నాటికి బీఎస్సీ మాథ్స్, కంప్యూటర్స్‌లో మాస్టర్స్‌ చేసి ఏడాది పాటు ఓ కాలేజ్‌లో గెస్ట్‌ లెక్చరర్‌గా ఉద్యోగం చేసింది. పెళ్లి చూపుల సందర్భంగా ఆమె వరుడితో తనకు కెరీర్‌ పట్ల ఉన్న ఆకాంక్షను తెలియచేసింది. అప్పుడందరూ అంగీకరించారు. పెళ్లి అయిన తర్వాత మాట మార్చేయడంతో నౌజిషాకి ఏమీ పాలుపోలేదు. పైగా వంటగది తప్ప మరేమీ ఆలోచించకు అని తెగేసి చెప్పేశాడు భర్త. ఎందుకిలా చేస్తున్నారో మొదట అర్థం కాలేదు. తర్వాత తెలిసిందేమిటంటే... భర్తకు ఉన్న వివాహేతర సంబంధం గురించి నౌజిషాకు తెలియనివ్వకుండా ఆమెను అంధకారంలో ఉంచడమే అత్తింటి వారి దురాలోచన అని. నౌజిషా నోరు తెరిచి మాట్లాడితే కొట్టేవరకు వెళ్లింది ఇంట్లో వాతావరణం. ఇవన్నీ గుర్తు చేసుకుంటూ... ‘‘పుట్టింటికి వెళ్తే... కూతురు పుట్టింటికి వచ్చేయడాన్ని మా అమ్మానాన్న అవమానంగా భావిస్తారేమోనని ఆందోళన పడ్డాను. దాంతో ఆత్మహత్య తప్ప మరో మార్గం లేదనిపించింది. అయితే ఏ బంధం ఆపిందో కానీ, నేను ఆ పని చేయలేదు. బిడ్డతో అమ్మ వాళ్లింటికి వెళ్లిపోయాను. పుట్టింటి వాళ్లు నా కష్టాన్ని అర్థం చేసుకుని నన్ను కడుపులో దాచుకున్నారు. ఆ క్షణంలో నేను తెలివిగా వ్యవహరించానని ఆ తర్వాత చాలాసార్లు అనిపించింది’’ అంటోంది నౌజిషా.

ఉద్యోగం... చదువు
నౌజిషా పుట్టింటికి వెళ్లింది కానీ పుట్టింటి వాళ్ల మీద ఆధారపడి బతికేయాలనుకోలేదు. లెక్చరర్‌గా ఉద్యోగంలో చేరింది. పగలు ఉద్యోగం చేస్తూ, సాయంత్రం కేపీఎస్‌సీ కోచింగ్‌ క్లాసులకు హాజరైంది. 2018లో తొలి ప్రయత్నంలో రాత పరీక్ష పూర్తయింది, కానీ ఫిజికల్‌ ఎగ్జామ్‌లో విజయం ఆమెకు దూరంగా ఉండిపోయింది. మరో ప్రయత్నంలో 2020లో విజయం సాధించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ట్రైనీ పోలీస్‌ ఆఫీసర్‌గా విధుల్లో చేరింది. ‘‘భర్త వేధింపుల నుంచి రక్షించమని పోలీసులను ఆశ్రయించిన నేను ఇప్పుడు పోలీస్‌ అధికారినయ్యాను. వేధింపులకు గురవుతున్న మహిళలకు నేను చెప్పేది ఒక్కటే... వేధింపులను మౌనంగా భరించకండి. నోరు తెరవండి. గొంతు పెగల్చండి. మిత్ర హెల్ప్‌లైన్‌కు ఫోన్‌ చేయండి’ అని ధైర్యం చెబుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement