మళ్లీ వణికిస్తున్న నిఫా...

Nipah Virus Infection India - Sakshi

మన దేశంలో మొదటిసారి 2001 ప్రాంతాల్లో బెంగాల్‌లోని సిలిగురిలో ‘నిపా’ వెలుగు చూసింది. కానీ దానికి అప్పుడంత ప్రాచుర్యం లభించలేదు. మళ్లీ ఆ తర్వాత 2007లో కేరళలో కనిపించిన నిపా... ఇప్పుడు తాజాగా మరోసారి అక్కడ వ్యాపిస్తోంది. వారం కిందట అక్కడి ఓ చిన్నారిని కబళించింది. ఓ వైపు కరోనా.. మరో వైపు నిపా అక్కడ విలయం సృష్టిస్తున్నాయి. కరోనా సోకితే మరణావకాశాలు కేవలం 2% నుంచి 5% శాతమే. కానీ నిపాతో అది 40% –70%. అయితే కరోనా కంటే దాని వ్యాప్తి ఒకింత తక్కువగా కనిపిస్తున్నందున అంతగా ఆందోళన అక్కర్లేదు. కానీ అవగాహన కలిగి ఉండటం తప్పనిసరి.

నిర్ధారణ: ప్రస్తుతం నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (పుణే)లో నిర్వహించే అలైజా పరీక్ష ద్వారా దీని నిర్ధారణ చేస్తున్నారు.

లక్షణాలు
నిపా ప్రధానంగా మెదడుకు ఇన్ఫెక్షన్‌ కలిగించి, మెదడువాపునకు (ఎన్‌సెఫలోపతి) కారణమవుతుంది. అందుకే తొలుత దీన్ని ఒకరకం మెదడువాపుగా భావించారు. ఒకసారి ఈ వైరస్‌ ఒంట్లోకి ప్రవేశించాక సాధారణంగా సగటున తొమ్మిది రోజుల్లో లేదా మరీ నిర్దిష్టంగా చెప్పాలంటే... 5 నుంచి 14 రోజుల్లో లక్షణాలు కనిపిస్తాయి. మెదడువాపు కారణంగా తలనొప్పి రావచ్చు. ఈ తీవ్రమైన తలనొప్పి కొందరిలో 24 – 48 గంటల్లో కోమాకి దారితీయవచ్చు.

ఇది సోకినవారిలో... అన్ని వైరల్‌ ఇన్ఫెక్షన్‌లోలాగానే... జ్వరం, ఒళ్లునొప్పులు, వికారం, వాంతులు కనిపించవచ్చు. దేహంలో దీర్ఘకాలికంగా వైరస్‌ ఉంటే మూర్ఛ (కన్వల్షన్స్‌), ప్రవర్తనలో మార్పులు (పర్సనాలిటీ ఛేంజెస్‌) కనిపించవచ్చు. మెడ బిగుసుకుపోవడం, వెలుగు చూడలేకపోవడం వంటి లక్షణాలూ కనిపించవచ్చు. ఇక కొందరిలో అక్యూట్‌ రెస్పిరేటరీ డిస్ట్రెస్‌ సిండ్రోమ్‌ (ఏఆర్‌డీఎస్‌)లోలా ఊపిరి అందకపోవచ్చు. గుండె కండరానికి ఇన్‌ఫ్లమేషన్‌ (వాపు, మంట) వచ్చేలా ‘మయోకార్డయిటిస్‌’కు దారితీయవచ్చు.  అరుదుగా కొందరిలో లక్షణాలేవీ కనిపించకుండానే అకస్మాత్తుగా  మరణం కూడా సంభవించవచ్చు. అయితే ఇది అరుదు. 

నిపా వైరస్‌ను సంక్షిప్తంగా ‘ఎన్‌ఐవీ’ అంటుంటారు. ఇదో రకం ‘ఆర్‌ఎన్‌ఏ వైరస్‌’. మలేషియాలోని  ‘కాంపంగ్‌ షుంగై నిపా’ అనేచోట 1998లో వ్యాపించడంతో ఆ ప్రదేశం పేరిట దీన్ని ‘నిపా’ అంటున్నారు. ఆరేళ్ల తర్వాత బంగ్లాదేశ్‌లో కనిపించింది. అప్పట్నుంచి ఇది అప్పుడప్పుడూ భారత్, బంగ్లాదేశ్‌లో కనిపించడం మొదలుపెట్టింది. మన దేశంలోని కేరళలో 2018 మే నెలలో ఒకసారి... ఆ తర్వాత మళ్లీ తాజాగా  ఇప్పుడూ అక్కడే కనిపిస్తూ బెంబేలెత్తిస్తోంది. 

వ్యాప్తి ఇలా...
ఇది ప్రధానంగా జంతువుల నుంచి వ్యాపించే వైరస్‌. తాటి జాతికి చెంది డేట్‌పామ్‌ చెట్ల పండ్లపై ఆధారపడే ఒక రకం గబ్బిలాలు (ఫ్రూట్‌ బ్యాట్స్‌) తో ఈ వైరస్‌ వ్యాపిస్తోంది. ఇవి తాటిపండ్లతో పాటు ఇతర పండ్లనూ తింటుంటాయి. జామ వంటి పండ్లు సగం కొరికి ఉన్నప్పుడు దాన్ని చిలక కొట్టిన పండు అనీ, తియ్యగా ఉంటుందని కొందరు అపోహ పడుతుంటారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి చిలక్కొట్టినట్టు ఉండే ఏ పండ్లనూ తినకూడదు. పందుల పెంపకం రంగంలో ఉన్నవారిలో ఈ వైరస్‌ ఎక్కువగా కనిపించినందున, అలాంటి వృత్తుల్లో ఉండేవారూ అప్రమత్తంగా ఉండాలి.

‘నిపా’ ఫ్రూట్‌ బ్యాట్‌ రకానికి చెందిన గబ్బిలాల నుంచి, పందుల నుంచి, అలాగే... ఇన్ఫెక్షన్‌ సోకిన వ్యక్తుల నుంచి ఇతరులకు వ్యాపిస్తుంది. ఇక నిపా సోకిన వ్యక్తులు పీల్చి వదిలే గాలి (ఏరోసాల్స్‌) వల్ల కాకుండా... వారి నుంచి వచ్చే తుంపర్లు (డ్రాప్‌లెట్స్‌) వల్లనే దీని వ్యాప్తి జరుగుతుందని గుర్తించారు. అయితే ఇప్పటికే కరోనా కారణంగా మనం ధరించే మాస్కులతో దీని నివారణ కూడా జరుగుతుంది కాబట్టి... మాస్క్‌ అదనపు / రెట్టింపు ప్రయోజనాలను ఇస్తోందని గ్రహించి, వాటిని తప్పనిసరిగా ధరించడం మంచిది.  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top