
దేవీ నవరాత్రుల సందర్భంగా అతివలు తమ అలంకరణలో గ్రాండ్‌గా కనిపించే ఆభరణాలను మెడనిండుగా ధరించడాన్ని ఇష్టపడుతుంటారు. కొంత అడవి బిడ్డల ఆత్మీయత.. మరికొంత కోవెల ఆరాధన ఈ రెండింటినీ జత కలిపితే రూపొందిన డిజైన్లే జనపనార హారాలు, చోకర్లు. సంప్రదాయ చీరకట్టుకైనా, వెస్ట్రన్ డ్రెస్‌కైనా ఈ జనపనార ఆభరణం అందంగా ఆకట్టుకుంటుంది.
జనపనారతో తయారు చేసిన దుస్తులు, తాళ్లు.. ఇతరత్రా వస్తువుల గురించి మనకు తెలిసిందే. కొంతవరకు జనపనార గొలుసుల మీదా ఆలోచన ఉండే ఉంటుంది. కానీ, సంప్రదాయ బంగారు పతకాన్ని గొలుసుకట్టుగా ఉండే హారానికి జత చేస్తే ఎంత అందంగా ఉంటుందో ఈ డిజైన్లను చూస్తే అర్థమైపోతుంది. రంగురంగులుగా వేసుకునే దుస్తుల మీదకు, ఈ తరహా ఫ్యూజన్ జ్యువెలరీ మరింత ఆకర్షణీయంగా కళ్లకు కడుతుంది.
విడిగా నార గొలుసులను తీసుకొని వాటికి బంగారం లేదా వన్‌గ్రామ్ గోల్డ్ లేదా సిల్వర్ లేదా కలపతో తయారుచేసిన పెద్ద పెండెంట్‌ను జత చేస్తే చూడముచ్చటైన హారం అలంకరణకు సిద్ధంగా ఉంటుంది. ఈ హారానికి నప్పే చెవి హ్యాంగింగ్స్‌ను విడిగా తీసుకోవచ్చు. తక్కువ ధరలో కావాలో, వేలల్లో ఖర్చుపెట్టి తయారు చేయించుకోవాలో అది మన ఆసక్తిని బట్టి ఉంటుంది. ఎందుకంటే, వందల రూపాయల నుంచి వేల రూపాయల వరకు వీటి ఖరీదు ఉన్నాయి. విడివిడిగా కావల్సినవి సేకరించుకొని, ఇంట్లోనే ఈ హారాలను తయారు చేసుకోవచ్చు. జనపనార పోగులకు రంగులు అద్ది కూడా వీటికి భిన్నమైన డిజైన్లు తీసుకురావచ్చు.
చదవండి: చర్మసౌందర్యానికి మరింత మేలు చేసే విటమిన్ ‘ఎ’ ఆహారం..