చర్మసౌందర్యానికి మరింత మేలు చేసే విటమిన్ ‘ఎ’ ఆహారం..

పోషకాహారాల విషయంలో శరీర ఆరోగ్యానికి ఇచ్చిన శ్రద్ధ చర్మ ఆరోగ్యానికి ఇవ్వడంలో కొంత నిర్లక్షం వహిస్తామనడంలో సందేహం లేదు. నిజానికి మనం తినేది మన చర్మంపై ప్రతిబింబిస్తుందని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. చికిత్సల కన్నా మనం తీసుకునే ఆహారం చర్మ ఆరోగ్యాన్ని మరింత ప్రభావితం చేస్తుందనేది అక్షరసత్యం. పోషకాలు, విటమిన్లలో ప్రాముఖ్యంగా విటమిన్ ‘ఎ’అధికంగా ఉండే ఆహారం చర్మ ఆరోగ్యానికి ఏ విధంగా మేలు చేస్తుందో తెలుసుకుందాం..
విటమిన్ ‘ఎ’తో ప్రయోజనాలెన్నో..
విటమిన్ ‘ఎ’లో రెటినోల్ ఉంటుంది, ఇది కొత్త చర్మ కణాల ఉత్పత్తికి, పెరుగుదలకు ఉపయోగపడుతుంది. విటమిన్ ఎలో బీటా కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు నిండుగా ఉంటాయి. ఇవి కొల్లాజెన్‌ను విచ్ఛిన్నం చేసే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి, అకాల వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా కాపాడుతుంది. అంతే కాకుండా హానికరమైన సూర్య కిరణాల నుండి కూడా చర్మానికి రక్షణ కల్పిస్తుంది.
టమాటా
విటమిన్ ‘ఎ’ టమాటాల్లో అధికంగా ఉంటుంది. సహజంగానే మనరోజువారీ వంటకాల్లో టమాటా ఉపయోగిస్తాం! వంటలతోపాటు టమాటా సూప్, టమాటా చట్నీ ఇలా కూడా తీసుకుంటే దీనిలోని పోషకాలు శరీరానికి సరిపడా అందుతాయి.
క్యారెట్లు
భారతీయ వంటకాల్లో తరచూ వాడే కూరగాయల్లో క్యారెట్ మరొకటి. ఒక అధ్యయనం ప్రకారం రోజూ కప్పు క్యారెట్ ముక్కలు తింటే రోజువారీ శరీరానికి అవసరమైన విటమన్ ‘ఎ’లో దాదాపుగా 334 శాతం అందుతుందని వెల్లడించింది.
పాలకూర, మెంతులు
పాలకూర, మెంతికూర వంటి ఆకుకూరల్లో కూడా విటమన్ ‘ఎ’ పుష్కలంగా ఉంటుంది. మీ ఆహారంలో వీటిని చేర్చడం ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా అందుతాయి.
ఎరుపురంగు క్యాప్సికమ్
పిజ్జా, పాస్తా, సలాడ్ వంటి స్పెషల్ వంటకాల్లో ప్రత్యేక రుచిని ఇనుమడించే రెడ్ క్యాప్సికమ్‌లో పోషకాలు కూడా అధికంగానే ఉంటాయని నూట్రీషనిస్టులు చెబుతున్నారు.
గుడ్డులోని పచ్చసొన
విటమిన్ ‘డి’ తోపాటు అధికమోతాదులో విటమిన్ ‘ఎ’ కూడా దీనిలో నిండుగా ఉంటుంది. ఇవి రెండు చర్మ ఆరోగ్యానికి చేసే మేలు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతిరోజూ ఒక గుడ్డు తినడం వల్ల చక్కని ఆరోగ్యంతోపాటు చర్మం కూడా మరింత కాంతులీనుతుంది.
గుమ్మడి
కెరోటినాయిడ్, ఆల్ఫా-కెరోటిన్ లు గుమ్మడికాయలో పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో విటమిన్ ‘ఎ’గా రూపాంతరం చెందుతాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నూట్రీషన్ ప్రకారం.. వంద గ్రాముల గుమ్మడి ముక్కలను తింటే.. 2100 మైక్రోగ్రాముల విటమిన్ ‘ఎ’ను శరీరానికి అందిస్తుందని వెల్లడించింది.
బ్రొకోలి క్యాలిఫ్లవర్
విటమిన్ ‘ఎ’తోపాటు వివిధ రకాలైన విటమిన్లు, ఖనిజాలు దీనిలో అధికంగా ఉంటాయి. సలాడ్, పాస్తా, పిజ్జా, భిన్న కూరగాయలతో చేసే వంటకాల్లో బ్రొకోలి క్యాలిఫ్లవర్ ను జోడించడం ద్వారా మీ ఆరోగ్యానికి చేకూరే మేలు అనుభవపూర్వకంగా మీరే తెలుసుకుంటారు.
ఈ ఆహారం ద్వారా విటమిన్ ‘ఎ’ పుష్కలంగా అందుతుందని చర్మ ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
చదవండి: Sirimiri Nutrition Food: ఓ ఇల్లాలి వినూత్న ఆలోచన.. కట్‌చేస్తే.. కోట్లలో లాభం!
సంబంధిత వార్తలు