
జీవితం ఆనందంగా సాగుతుండగా ఊహించని విధంగా తలకిందులైపోతే..తేరుకోవడం అంత ఈజీ కాదు. ఒకవేళ్ల కోలుకున్న నిలదొక్కుకోవడం అంత సులభం కాదు. కళ్లముందు కలలన్నీ కుప్పకూలిపోయి ఏం మిగిలలేదు అన్నట్లుగా ఉన్న పరిస్థితిని అధిగమించడం అంటే మాటలు కాదు. అందుకు ఎందో ధైర్యం కావాలి. అలాంటి సమయంలో స్థైర్యంగా నిలబడటం తోపాటు మనకు మద్ధతిచ్చే మంచి వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందడం మరింత గొప్ప విషయం. అలాంటి అసామాన్యమైన విజయాన్ని అందుకుని అందరికీ స్ఫూర్తిగా నిలిచారు ఈ సోల్జర్. అతడి జీవిత గాథ వింటుంటే..కళ్లు చెమ్మగిల్లుతాయి. మరీ ఆ గాథ ఏంటో చూద్దామా..!.
హ్యూమన్స్ ఆఫ్ బాంబేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత ఆర్మీకి చెందిన సైనికుడు తన కథను పంచుకోవడంతో నెట్టింట వైరల్‌గా మారింది. అఖిల్ బాల్యమంతా చాలా హాయిగా నవ్వుతూ..తుళ్లుతూ గడిచిపోయింది. ఏదో సాహసోపేతమైన కెరీర్‌ని అందుకోవాలనేది అతడి డ్రీమ్. ఆ నేపథ్యంలో నేవీలో చేరేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అన్ని విఫలమై ఏం చేద్దాం అని ఆలోచిస్తుండగా..సరిగ్గా అలాంటి తరుణంలో 2017లో తన గ్రామంలో భారీగా ఆర్మీ రిక్రూట్‌ర్యాలీ జరిగింది.
అతను ఫిజికల్ పరీక్షల్లో 1,600 మీటర్ల ట్రయల్ రన్‌లో గెలుపొంది ఆర్మీలో చోటు దక్కించుకున్నాడు. తొలి పోస్టింగ్ పంజాబ్‌లో వచ్చింది. ఆర్మీ యూనిఫాంలో తల్లిదండ్రులు గర్వపడే స్థాయిలో ఉన్నాడు. అయితే 2021లో, హై-రిస్క్ బాటిల్ అబ్స్టాకిల్ కోర్స్ శిక్షణా సెషన్ అతడి జీవితాన్ని అంధకారంలోకి నెట్టేసింది. సరిగ్గా ఆ శిక్షణలో భాగంగా దూకుతుండగా తాడు తెగిపోయి..కింద పడిపోయాడు.
అంతే ఆ తర్వాత కళ్లు తెరిచి చూసేటప్పటికి ఆస్పత్రి బెడ్‌పై ఉన్నాడు. అప్పుడే తెలిసింది..తాను ఇదివరకటిలా హాయిగా నడవలేనని..అంతే ఒక్కసారిగా అఖిల్‌కి కాలం స్థభించిపోయినట్లుగా అనిపించింది. ఆ ప్రమాదంలో అఖిల్ వెన్నెముకకు తీవ్ర గాయాలు కావడంతో కింద భాగం అంత చచ్చుబడిపోయింది. దీంతో అఖిల్ ఆ విషాద ఘటన నుంచి ఓ పట్టాన కోలుకోలేకపోయాడు.
ఇక ఏముంది జీవితం అంత ముగిసిపోయిందనే నిరాశ నిస్ప్రుహల్లో కొట్టుకుపోతున్నాడు. సరిగ్గా ఆ సమయంలో తన మాదిరిగా అనుకోని ప్రమాదంలో చిక్కుకుని అంగవైకల్యంతో బాధపడిన కొందరు వ్యక్తులు, వారు సాధించిన విజయాల గురించి తెలుసుకున్నాడు. ఇక అప్పటి నుంచి నిరాశకు గుడ్‌బై చెప్పి నూతనోత్సాహంతో బతికే యత్నం చేశాడు. మొదటగా తన వైకల్యాన్ని పూర్తిగా అంగీకరించాడు. అప్పుడే అఖిల్ జీవితం అనుకోని విధంగా మలుపు తిరిగింది.
అఖిల్ లవ్ చిగురించి అప్పుడే..
అనుకోకుండా విధి అఖిల్ జీవితంలోకి ఓ అమ్మాయిని తీసుకొచ్చింది. అతడికి ఫేస్‌బుక్ ద్వారా "సోల్జర్ గర్ల్" అనే ప్రొఫెల్‌తో ఉన్న అఖిల అనే అమ్మాయితో పరిచయం ఏర్పడింది. అయితే ఆమెతో మాట్లాడేందు సంకోచించేవాడు అఖిల్. తన వైకల్యం గుర్తొచ్చి.. మాటలు కలపడానికి అంత ఆసక్తి చూపించేవాడు కాదు.
అయితే ఆమె అతడిలోని వైకల్యాన్ని చూడలేదు. అలా ఇద్దరు మూడేళ్లు డేటింగ్ చేసి..2024 ఏప్రిల్‌లో వివాహం చేసుకున్నారు. ఆ క్షణం నుంచి అఖిల్‌కి అన్నివిధాల సపోర్ట్‌గా ఉన్న స్నేహతురాలు, భాగస్వామి అఖిలానే అయ్యింది. అంతేగాదు పారా-స్విమ్మింగ్ చేయమని అఖిల్‌ని ప్రోత్సహిస్తోంది కూడా.
ఈ సోల్జర్ కథ మళయాళం నటుడు మోహన్‌లాల్ దృష్టిని సైతం ఆకర్షించింది. ఆయన కూడా ఆ సైనికుడు అఖిల్ ప్రేమకథకు ఫిధా అవ్వడమే గాక పూణేలో ఆ జంటకు కలిసి మరీ ప్రశంసించాడు. అంతేగాదు వారితో కలిసి దిగిన ఫోటోని కూడా నెటిజన్లతో షేర్ చేసుకున్నారు కూడా. నెటిజన్లు కూడా అలాంటి భాగస్వామిని పొందడం అఖిల్ అదృష్టం అంటూ ప్రశంసిస్తున్నారు.
(చదవండి: Operation Sindoor: ఇండియన్ ఆర్మీ యూనిఫాం వెనుకున్న ఇంట్రస్టింగ్ స్టోరీ ఇదే..!)