
నేటి నుంచి ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్–2025
నగరానికి చేరుకున్న 111 దేశాల సుందరీమణులు
పోటీలకు సన్నద్ధం, బిజీ బిజీగా రిహార్సల్స్
హైదరాబాద్ వైపు ఆసక్తిగా చూస్తున్న ప్రపంచ దేశాలు
ఈ నెల 31న మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే
చరిత్రలో మరో అద్భుత మైలురాయికి నేడు భాగ్యనగర నాంది పలుకనుంది. నగరంలో ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ 2025 పోటీలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటి వరకూ పలు అంతర్జాతీయ క్రీడా పోటీలు, విదేశాంగ సమావేశాలు, అంతర్జాతీయ శాస్త్ర–సాంకేతిక సమావేశాల వంటివి జరిగాయి. కానీ ఫ్యాషన్ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ పోటీలు జరుగుతుండటం ఇదే ప్రథమం. గతేడాది 71వ మిస్ వరల్డ్ పోటీలు ముంబై వేదికగా నిర్వహించగా, వెనువెంటనే దేశంలో మరోసారి నిర్వహించడం.. దీనికి భాగ్యనగరం ప్రాతినిథ్యం వహించడం విశేషం. ఇప్పటికే నగరానికి ప్రపంచవ్యాప్తంగా 111 దేశాలకు చెందిన మిస్ వరల్డ్ పోటీదారులు చేరుకోగా నేడు మరో ఇద్దరు, ముగ్గురు వచ్చే అవకాశముంది. ఈ మిస్ వరల్డ్ నేపథ్యంలో హైదరాబాద్ నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన విషయం విధితమే.
నేడు ప్రారంభం కానున్న 72వ మిస్ వరల్డ్ పోటీలు ఈ నెల 31వ తేదీ వరకూ కొనసాగనున్నాయి. ఈ పోటీలను తెలంగాణ ప్రత్యేకతలను ప్రపంచానికి తెలిపేలా, అంతర్జాతీయంగా తెలంగాణకు బ్రాండ్ ఇమేజ్ పెంచేలా కార్యాచరణ సిద్ధం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ సందర్భంగా తెలంగాణ సంస్కృతి, చరిత్ర, పర్యాటక ఆకర్షణలు, మెడికల్, సేఫ్టీ టూరిజం, తెలంగాణ గ్రోత్ స్టోరీ ఇతర ప్రత్యేకతలు ప్రపంచానికి పరిచయం చేయడానికి ప్రత్యేక థీమ్స్, టూరిస్ట్ సర్క్యూట్లు రూపొందించారు. ఇందులో భాగంగా హైదరాబాద్ హెరిటేజ్ వాక్, మెడికల్ టూరిజం ఈవెంట్, సేఫ్టీ టూరిజం ఇనీషియేటివ్, తెలంగాణ ఆర్ట్స్, క్రాఫ్టŠస్ వర్క్ షాప్ వంటి విభిన్న కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
జూన్ 2 వరకూ..
ఈ సారి మిస్ వరల్డ్‌లో భారత్‌తో పాటు అమెరికా, కెనడా, వెనిజులా, థాయ్‌లాండ్, దక్షిణాఫ్రికా, వంటి దేశాలతో పాటు గ్వాడలూప్, గిబ్రాల్టర్, మారి్టనిక్, క్యురాకావ్ వంటి చిన్న దేశాల నుంచి అభ్యర్థులు పాల్గొంటున్నారు. ఈ నెల 31న మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే జరుగుతుంది. జూన్ 2న ప్రతిషష్టాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల వరకూ విజేతగా నిలిచిన మిస్ వరల్డ్ నగరంలో ఉంటుందని నిర్వాహకులు పేర్కొన్నారు.