మరో పోరాటం.. రాంచీలో తల్లుల ఫుట్‌బాల్‌ ఫైనల్‌

The Matra Shakti Football Tournament Conducted in Jharkhand - Sakshi

కతార్‌ వైపు అందరూ కళ్లప్పగించి చూస్తున్నప్పుడు అక్కడికి 3000 కిలోమీటర్ల దూరంలోని జార్ఖండ్‌లో కూడా అంతే ఉత్కంఠ భరితమైన మ్యాచ్‌లు జరిగాయి. ఆదివారమే అక్కడా ఫైనల్స్‌ జరిగాయి. ఎవరు గెలిచారో తర్వాతి సంగతి. కాని పిల్లల తల్లులైన గిరిజన స్త్రీలు  క్రీడాదుస్తులు ధరించి బాల్‌ కోసం పరిగెత్తడం సామాన్యం కాదు.

ఆదివాసీ స్త్రీల మీద సాగే బాల్య వివాహాలు, గృహ హింస, మంత్రగత్తె అనే అపవాదు, నిర్బంధ నిరక్షరాస్యత వంటి దురన్యాయాలపై చైతన్యం తేవడానికి  ఈ తల్లుల ఫుట్‌బాల్‌ కప్‌ను నిర్వహిస్తున్నారు. ‘మాత్ర శక్తి ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌’  వినూత్నతపై కథనం. 

కతార్‌లో జరిగిన ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లో రోమాంచిత సన్నివేశాలు చూశారు ప్రేక్షకులు. కాని మొన్న రాంచీలో జరిగిన ‘మాత్ర శక్తి ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌’లోని సన్నివేశాలు అంతకు తక్కువేమి కావు.

సన్నివేశం 1: అనితా భేంగరాకు 24 ఏళ్లు. టీమ్‌లో జోరుగా ఫుట్‌బాల్‌ ఆడుతూ హటాత్తుగా ఆగిపోయింది. మేచ్‌ నుంచి బయటికొచ్చేసింది. కారణం? తన చంటి పిల్లాడి ఏడుపు వినిపించడమే. పాలకు వాడు ఏడుస్తుంటే వాడి దగ్గరకు పరిగెత్తింది. ఆమె లేకుండానే ఆట కొనసాగింది. బిడ్డకు పాలు ఇస్తూ తన టీమ్‌ను ఉత్సాహపరుస్తూ కూచుంది అనిత.

సన్నివేశం 2:  ‘నెట్టె హజమ్‌’ (ముందుకొచ్చి కొట్టు), ‘రుడుమ్‌ నెట్టె’ (పక్కకు తిరిగి కొట్టు) అని ముండారి భాషలో అరుస్తున్నాడు సుక్కు ముండా. అతను తోడుగా వచ్చిన టీమ్‌ గ్రౌండ్‌లో ఆడుతూ ఉంది. వారిలో అతని భార్య సునీతా ముండా ఉంది. అసలే అది ఫైనల్‌ మేచ్‌. భర్త ఉత్సాహానికి భార్య రెచ్చి పోయింది. గోల్‌ కొట్టింది. సునీత టీమే ఫైనల్స్‌లో విజేతగా నిలిచింది. సుక్కు ముండా ఉత్సాహానికి అంతే లేదు.

జార్ఖండ్‌లోని రాంచీ, ఖుంతి జిల్లాలోని 23 గ్రామాల నుంచి 32 మహిళా టీములు ‘మాత్ర శక్తి ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ 2022’లో పాల్గొన్నాయి. 360 మంది తల్లులు ఈ టీముల్లో ఉన్నారు. కొందరు ఒక బిడ్డకు తల్లయితే మరొకరు ఇద్దరు పిల్లల తల్లి. వీరి వయసు 21 నుంచి 57 వరకూ ఉంది. ఈ టోర్నమెంట్‌ను 2018లో మొదలెట్టారు. జార్ఖండ్‌లో ఆదివాసీల కోసం పని చేస్తున్న ‘ప్రతిగ్య’ అనే సంస్థ వీటిని నిర్వహిస్తోంది.

ఎందుకు ఈ టోర్నమెంట్‌?
►జార్ఖండ్‌ ఆదివాసీల్లో స్త్రీయే ప్రధాన పోషకురాలు. కుటుంబాన్ని ఆమె నడపాలి. అందువల్ల ఆమెపై కట్టడి జాస్తి.
►సంస్కృతి రీత్యా ఆమె ఒకే రకమైన దుస్తులు ధరించాలి. ఆటలు ఆడరాదు. ఆడేందుకు వేరే రకం దుస్తులు ధరించరాదు. 
►చదువు వీరికి దూరం. బాల్య వివాహాలు, లైంగిక దాష్టీకాలు, మంత్రగత్తెలని చంపడం... ఇవి సర్వసాధారణం.
►ఆరోగ్య స్పృహ, వ్యక్తిగత శుభ్రత లోపం.
వీటిపై పోరాడడానికి, చైతన్యం తేవడానికి, స్త్రీలలో ఐకమత్యం సాధించడానికి, తల్లులను ఇంటి నుంచి కదిలేలా చేస్తే వారి ద్వారా పిల్లలకు చదువు, ఆటలు అందుతాయనే ఉద్దేశం. వీటన్నింటి కోసం ప్రతిగ్య సంస్థ ఈ టోర్నమెంట్‌ను మొదలుపెట్టింది. నాగపూర్‌లో స్లమ్‌ ఫుట్‌బాల్‌ పుట్టినట్టు ఇది ఆదివాసీ స్త్రీల ఫుట్‌బాల్‌.

ఎన్నో సమస్యలు
అయితే 2018లో టోర్నమెంట్‌ కోసం ప్రతిగ్య వాలంటీర్లు పల్లెలు తిరుగుతుంటే స్త్రీల నుంచే వ్యతిరేకత ఎదురైంది. ‘మేమెందుకు ఆడాలి’ అన్నారు. భర్తలైతే కాళ్లు విరగ్గొడతాం అన్నారు. చివరకు రాంచీ జిల్లాలోని మైనీ కచ్చప్‌ అనే తల్లి (40) మొట్టమొదటి ప్లేయర్‌గా ఆడటానికి అంగీకరించింది. ఆమె నుంచి టీమ్‌ తయారైంది.

2018లో అతి కష్టమ్మీద 6 టీములు పాల్గొన్నాయి. 2019లో 24 టీములు వచ్చాయి. 2022 నాటికి టీముల సంఖ్య 32కు పెరిగింది. వీళ్లెవరికీ సరైన జెర్సీలు లేవు. షూస్‌ లేవు. కోచ్‌లు లేరు. ప్రచారం లేదు. స్పాన్సర్లు లేరు. ప్రైజ్‌ మనీని ఏర్పాటు చేయడం కూడా కష్టమే. అయినా సరే ఎంతో ఉత్సాహంగా టోర్నమెంట్‌లో పాల్గొన్నారు.

కూతురూ తల్లి, అత్తా కోడలు
ఈ టోర్నమెంట్‌లో ఒక పల్లెలో కూతురూ తల్లి (కూతురు కూడా తల్లే) టీమ్‌లో చేరారు. అయితే  వాళ్లిద్దరూ ఆడటం ఊళ్లో మగవారికి ఇష్టం లేదు. వాళ్లను ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్లే గ్రౌండ్‌కు చేర్చడానికి ఎవరూ సహకరించలేదు. దాంతో వాళ్లు నడుస్తూ వచ్చి ఆట ఆడారు. మరో ఊళ్లో అత్తా కోడలు కలిసి టీమ్‌లో చేరారు.

‘ఈ ఆట ఆడక ముందు అత్త నాతో అంటీ ముట్టనట్టు ఉండేది. ఇప్పుడు మేమిద్దరం మంచి స్నేహితులయ్యాము. ఎన్నో మాటలు మాట్లాడుకుంటున్నాము. ఒకరికొకరం తోడయ్యాము’ అంది కోడలు. మొదట చర్రుపర్రుమన్న భర్తలు గ్రౌండ్‌లో తమ భార్యలు ఆడుతుంటే మురిసి ప్రోత్సహించడం మొదలెట్టారు.

స్త్రీలందరూ ఈ గేమ్‌ వంకతో కలిసి మాట్లాడుకుంటున్నారు. తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. వాటి సాధన కోసం ఏం చేయాలో తెలుసుకుంటున్నారు. వాళ్లు తన్నాలనుకుంటున్న బంతి ఆ సమస్యే. ఇలాంటి టోర్నమెంట్‌లు ఎన్నోచోట్ల మరెన్నో జరిగితే బాగుండు.
చదవండిKajol: 48 ఏళ్ల వయసులోనూ ఆకట్టుకునే రూపం.. ఈ మూడు పాటించడం వల్లే అంటున్న కాజోల్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top