
సముద్రపు ఒడ్డున ఏసూన్ ఒంటరిగా నిలబడి ఉంది. పదేళ్ల ఆ అమ్మాయి.. భూమ్యాకాశాలు తాకుతున్నంత మేరా సముద్రం వైపు చూస్తూ పెద్దగా ఏడుస్తోంది. ఏడుస్తూ సముద్రాన్ని ప్రశ్నిస్తోంది. సముద్రంపై గర్జిస్తోంది. సముద్రాన్ని వేడుకుంటోంది. ‘‘... దయచేసి మా అమ్మని ఒంటరిగా వదిలేయ్. నువ్వు మా అమ్మని వదిలే...య్. సముద్ర దేవతా... ఎందుకిలా అమాయకుల ప్రాణాలను పొట్టన పెట్టుకుంటావు? (ఏడుపు) మా అమ్మను అలా చేయకు. మా అమ్మనలా చేయకూ.
మా అమ్మపై కనికరం చూపించూ. జీవితాంతం ఎముకలు అరిగిపోయేలా పని చేసింది. ఒక్కసారి కూడా విమానం ఎక్కలేదు. తనకి ముత్యాలహారం వెయ్యాలి. తనని నేను విమానం ఎక్కించాలి. నేను మా అమ్మ కోసం ఎన్నో చేయాలి. వదిలేయ్... (ఏడుపు)... వదిలేయ్ (ఏడుపు)... వదిలేయ్.. (ఏడుపు) ఏసూన్ తల్లి ప్రతిరోజూ సముద్రం పైకి వేటకు వెళుతుంది. నత్తగుల్లల్ని వలపట్టి తెస్తుంది. ఆ నత్తగుల్లలే ఆ కుటుంబానికి జీవనాధారం. వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతోనే పూట గడిచినా, రోజు గడిచినా!
కానీ ఏసూన్‌కి భయం, సముద్రంపైకి వేటకు వెళ్లినప్పుడు తన తల్లికి ఏమైనా జరిగి చనిపోతుందేమోనని. వెళ్లొద్దని తల్లికి చెబితే వినలేదని, రానివ్వొద్దని సముద్ర దేవతకు మొరపెట్టుకుంటుంది ఆ చిన్నారి. ‘వెన్ లైఫ్ గివ్స్ యు టాంజరీజ్స్’ (జీవితం నీకు నిమ్మకాయలు ఇస్తే..) అనే ఇటీవలి సౌత్ కొరియన్ వెబ్ సీరీస్‌లో.. మనసును కదిలించే ఒక సన్నివేశం ఇది.
కష్టాల్లో ఉన్నప్పుడు దైవానికి మనం ఎన్నో చెప్పుకుంటాం. దైవాన్ని మనం ఎన్నో అడుగుతుంటాం. చిన్నారి ఏసూన్ కూడా అలాగే చెప్పుకుంది. అలాగే అడిగింది. కానీ, సముద్ర దేవత నుంచి బదులు లేదు. అలల హోరు తప్ప ఆ దేవత అలకించిన చప్పుడే లేదు. కానీ , ఈ దేవత అలా కాదు!మలేషియాలోని మజూ సముద్ర దేవత... పిలిస్తే పలుకుతుంది! భక్తుల కష్టసుఖాలను వింటుంది. వెంటనే బదులిస్తుంది! ఆ దేవత కోసం సముద్రపు ఒడ్డుకు వెళ్లనవసరం లేదు.
అక్కడి జొహోర్ పట్టణంలోని తియాన్హూ ఆలయం ప్రాంగణంలో వెలసిన చైనా సముద్ర దేవత మజూ సందర్శిస్తే చాలు. ఆ దేవత తన భక్తులతో నవ్వుతూ మాట్లాడుతుంది. కరుణా కటాక్ష వీక్షణాలను రువ్వుతుంది. దేవత దర్శనం గుడి ఆవరణలోని తెరమీద. ఆ తెరకు ఎదురుగా నిలబడి భక్తులు ఆ సముద్ర దేవతతో సంభాషించవచ్చు! ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌తో ఇదంతా సాధ్యం అవుతోంది.
ప్రాచీన ఆధ్యాత్మిక ఆచారాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాల కలబోతగా సంప్రదాయ చైనా దుస్తులతో ‘అవతరించి’ దర్శనభాగ్యం కలిగిస్తున్న ఈ సముద్ర దేవతను వ్యక్తిగత విషయాలు అడవచ్చు. భవష్యత్తు ఎలా ఉండబోతోందో అడిగి తెలుసుకోవచ్చు. ఇంకా.. ఆరోగ్యం, ఉద్యోగం, కుటుంబ సంబంధాలు.. ఒకటేమిటి, ప్రతి విషయాన్నీ నివేదించవచ్చు.
అప్పటికప్పుడు సమాధానాలు తెలుసుకుని ఊరట పొందవచ్చు. సంతృప్తి చెందవచ్చు. ఈ ఏఐ దేవత నెమ్మదిగా, ప్రశాంతంగా బదులిస్తుంది. సలహాలు, సూచనలు అందచేస్తుంది. ధైర్యం చెబుతుంది.
టూరిస్టులకు కొత్త ఆకర్షణ
మలేషియాలోని టెక్ కంపెనీ ‘ఏఐ మాజిన్’ ఇటీవలే ఈ ఏఐ సముద్ర దేవతను సృష్టించింది. నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ టెక్నాలజీతో ఈ దేవత చైనావారి మాండరిన్ తో పాటుగా అనేక భాషల్లో మాట్లాడుతుంది. మత బోధనలు, చారిత్రక విషయాలు, జానపద కథలను ఫీడ్ చేసి, ఈ దేవతకు శిక్షణ కూడా ఇచ్చారు.
ఏఐ మాజిక్ కంపెనీ వ్యవస్థాపకురాలు షిన్ కాంగ్ తన అనూహ్య భవిష్యత్తు గురించి అడిగినప్పుడు.. ‘‘నువ్వు ఇంట్లో ఉంటే అనూహ్య భవిష్యత్తు విషయంలో అంతా మంచే జరుగుతుంది’’ అని దేవత మృదువుగా సలహా ఇచ్చింది. మరొకరు తనకు నిద్ర పట్టటం లేదని వాపోతే, ‘‘పడక మీదకు ఉపక్రమించే ముందు కాస్త గోరువెచ్చటి నీరు తాగు..’’ అని సూచించింది.
అందుకే ఆమెను ‘విన్నపాల అలల దేవత’ అని కూడా అంటున్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటిదైన ఈ ‘ఏఐ మజూ దేవత’ విగ్రహం సోషల్ మీడియాలో వైరల్ అవటంతో పాటుగా, మలేషియా వెళ్లే టూరిస్టులు ఇప్పుడు ప్రధాన ఆకర్షణగా మారింది.
(చదవండి: కోత తక్కువ.. కరిగించే కొవ్వు ఎక్కువ)