విరాళాలు సరిపోవు.. ఊతంగా నిలవాలి: పార్వతి నౌరియాల్‌

Maharashtra: Meet Parvati Nauriyal How She Inspires All - Sakshi

చిన్నచిన్న పదాలు, అంకెలు పలకడం, అర్థం చేసుకోవడం చిన్నారి పార్వతి నౌరియాల్‌కు చాలా కష్టమైంది. ‘‘చిన్నపిల్ల కదా నేర్చుకోవడానికి ఇబ్బంది పడుతుంది అని అనుకోలేదు తల్లిదండ్రులు. బద్దకస్తురాలు... ఏదీ వెంటనే నేర్చుకోదు’’ అని విసుక్కునేవారు. బుడిబుడి అడుగులతో, బుజ్జిమాటలతో ఆకట్టుకునే వయసులో అమ్మానాన్నల నిరాదరణకు గురైన ఆ చిన్నారి నేడు వందల మంది పిల్లలకు చదువు చెప్పడంతోపాటు, ఎంతోమంది సెక్స్‌వర్క్‌ర్లను వేశ్యావృత్తినుంచి బయటకు తీసుకువచ్చి గౌరవంగా బతికేందుకు అవకాశాలు కల్పిస్తోంది. 

మహారాష్ట్రకు చెందిన పార్వతి నౌరియాల్‌కు చిన్నతనంలో డిస్లెక్సియా సమస్య ఉండడంతో మూడేళ్లు వచ్చేంత వరకు పదాలు, అంకెలు కూడా సరిగా పలకలేక పోయేది. స్కూలుకెళ్లి చదువుకోవాల్సి వస్తుందని ఇలా చేస్తుంది అని చిరాకుపడుతుండేవారు తల్లిదండ్రులు. అయితే అదేమీ పట్టించుకోకుండా చదువుకుంటూ అతికష్టం మీద పదోతరగతి పాసయ్యింది పార్వతి. టెంత్‌ తరువాత పార్వతి డిస్లెక్సియాతో బాధపడుతోందని ఆమె తల్లి గుర్తించింది. అప్పటి నుంచి ఆమె వెన్నంటే ఉండి సమస్యను అధిగమించేందుకు సాయం చేసింది.

పార్వతి తల్లి చదువుకోకపోయినప్పటికీ చదువు విలువ తెలియడం వల్ల తన పిల్లలతోపాటు, సమీపంలోని మురికివాడల్లోని అమ్మాయిలను చదివించమని పదేపదే చెబుతుండేది. తల్లి ప్రోత్సాహమే తనను ఇప్పుడు సమాజ సేవకురాలిగా నిలబెట్టిందని చెబుతుంది పార్వతి.

ట్రిప్‌ నుంచి తిరిగి వస్తుండగా.. చక్కగా చదువుకుని విపత్తు నిర్వహణల ఉద్యోగం చేస్తోన్న పార్వతి 2015లో ఒకసారి కర్జత్‌ ట్రిప్‌కు వెళ్లింది. ట్రిప్‌ పూర్తిచేసుకుని అక్కడి నుంచి తిరిగి వస్తుండగా ఆమెకు కొంతమంది బాలకార్మికులు కనిపించారు. బాలలతో పనిచేయించకూడదని చట్టాలు చెబుతున్నప్పటికీ అక్కడ అంతమంది బాలకార్మికులు కనిపించడం విచిత్రంగా అనిపించింది.

ప్రభుత్వ అధికారులు, ఎన్జీవోలు సైతం వారిని చూసీ చూడనట్లు వదిలేయడం తనకు నచ్చలేదు. బాలకార్మికుల కష్టాలను తీర్చేందుకు అధికారులను కలిసి వారి దైన్యస్థితిని గురించి వివరించింది. నెలరోజులు తిరిగాక ఓ వ్యాపార వేత్త .. బాలకార్మికులకు వారాంతాల్లో చదువు చెప్పించడానికి టీచర్లను నియమించాడు. దీంతో కర్జత్‌లోని పిల్లలు చదువుకోవడం ప్రారంభించారు. 139 మంది బాలకార్మికులు బడిబాట పట్టడం ఎంతో సంతోషాన్నిచ్చింది. 

కోవిడ్‌ తర్వాత కామటిపురాకు... వందకుపైగా బాలకార్మికులని విద్యార్థులుగా మార్చిన ఆనందంలో మరింత మందిని చదివించాలని నిర్ణయించుకుంది పార్వతి. అప్పుడే కోవిడ్‌ కారణంగా లాక్‌డౌన్‌ విధించడంతో పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారాయి. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తరువాత ఉద్యోగాలు కోల్పోయిన అనేక మంది కుటుంబాలను కలిసింది.

కుటుంబపోషణకు ఆధారం లేక చావే శరణ్యమంటోన్న అనేకమంది కన్నీటి బాధలు వింటోన్న సమయంలో ఓ నిరుపేద తల్లిదండ్రులు తమ కుమార్తెని పెంచే స్థోమతలేక కామటిపురాకు అమ్మేసినట్లు తెలిసింది. అప్పుడు ఆ అమ్మాయిని ఎలాగైనా రక్షించాలని నిర్ణయించుకుని కామటి పురాలో అడుగుపెట్టింది. అక్కడ ఎంత వెతికినా ఆ అమ్మాయి కనిపించలేదు కానీ, అక్కడ బాగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నలుగురు అమ్మాయిలను చేరదీసి సొంత డబ్బుతో శిక్షణ ఇప్పించి, వేశ్యావృత్తిని వదిలేలా చేసింది. 
ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి వేశ్యావృత్తిలోకి బలవంతంగా వస్తోన్న వారిని బయటకు తీసుకువచ్చి, వారికి వివిధ రకాల వృత్తులలో శిక్షణæఇప్పించి ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. ఇలా ఇప్పటిదాకా వెయ్యిమందిని కామటిపురా నుంచి బయటకు తీసుకువచ్చి సమాజంలో గౌరవంగా బతికేలా చేసింది. వీరిలో ఎక్కువమంది చిన్నవయసు అమ్మాయిలు ఉన్నారు. వీరి పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దుతూ అక్కడి వారికి తన వంతు ఊతం ఇస్తోంది పార్వతి.

విరాళాలు కాదు ప్రేరణగా నిలవాలి
‘‘సమాజానికి ఎంతోకొంత తిరిగిచ్చేయాలని..మన దగ్గర ఉన్న డబ్బును దానాలు, విరాళాలుగా ఇవ్వడం, లేదా ఎన్జీవోలతో కలిసి కొంతకాలం పనిచేస్తే సరిపోదు. మరణించేలోపు మనం కొంతమందికి ప్రేరణగా, సలహాదారుగా, శిక్షకులుగా నిలవాలి. అప్పుడు సమాజంలో చాలామంది మారతారు. 
– పార్వతి నౌరియాల్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top