లీనా నాయర్‌: సమానంగా చూడండి చాలు | Leena Nair managed to make Unilever a gender-balanced company across its management globally | Sakshi
Sakshi News home page

లీనా నాయర్‌: సమానంగా చూడండి చాలు

Dec 14 2022 12:45 AM | Updated on Dec 14 2022 12:45 AM

Leena Nair managed to make Unilever a gender-balanced company across its management globally - Sakshi

లీనా నాయర్‌

ఆమె మహిళ అనో .. సపోర్ట్‌ లేదనో.. పని మెల్లిగా నేర్చుకుంటుందో... మైనారిటీ వర్గమనో.. సానుభూతి చూపారంటే.. దానినే సవాల్‌గా తీసుకొని మరింత శక్తిమంతంగా ఎదగాలని తన జీవితాన్ని ఉదాహరణగా చూపుతుంది లీనా నాయర్‌.


    లీనా నాయర్‌ బ్రిటిష్‌ ఇండియన్‌ బిజినెస్‌ ఎగ్జిక్యూటివ్‌గా అంచెలంచెలుగా ఎదిగిన శక్తి. 30 సంవత్సరాల పాటు ఉద్యోగ నిర్వహణలో ఎన్నో క్రియాశీలక పదవులను చేపట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యునిలీవర్‌ కంపెనీని జెండర్‌ బ్యాలెన్స్‌డ్‌ కంపెనీగా నిలబెట్టింది. వరల్డ్‌ వైడ్‌ లగ్జరీ బ్రాండ్‌ చానెల్‌ సీఈవోగా ఉన్న లీనా పుట్టి పెరిగింది మహారాష్ట్రలో. ఇప్పుడు వందకుపైగా దేశాల్లో లక్షలాది మంది ఉద్యోగుల బాధ్యతను సమర్థవంతంగా నడిపిస్తూ మహిళాశక్తిని ఈ తరానికి చాటుతోంది.

► జెండర్‌ బ్యాలెన్స్‌..
ఫ్రెంచ్‌ లగ్జరీ హౌజ్‌ కోకో చానెల్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌గా ఈ ఏడాది జనవరి నుంచి దిగ్విజయంగా విధులను నిర్వర్తిస్తోంది లీనా నాయర్‌. అంతకుముందు యూనిలీవర్‌కు నాయకత్వం వహించారు. వందకు పైగా దేశాలలో సుమారు లక్షా యాభై వేల మంది బాధ్యత ఆమె మీద ఉంది.

1990 మొదట్లో నాయర్‌ జంషెడ్‌పూర్‌లోని హిందూస్థాన్‌ యూనిలీవర్‌లో మేనేజ్‌మెంట్‌ ట్రైనీగా చేరినప్పుడు, ఆ కంపెనీ ఉద్యోగుల్లో కేవలం రెండు శాతం మాత్రమే మహిళలు ఉన్నారు. ఆమె కిందటేడాది బయటకు వచ్చినప్పుడు ప్రపంచవ్యాప్త కంపెనీ నిర్వహణలో లింగ సమతుల్యత ఉందని ప్రకటించింది. అంటే, నాయర్‌ తనదైన ముద్ర ఏ స్థాయిలో ఆ కంపెనీలో వేసిందనేది స్పష్టం అవుతుంది.

► లగ్జరీ మార్కెట్‌..
ఫ్యాషన్‌ దిగ్గజంగా కోకో చానెల్‌ కంపెనీకి 112 ఏళ్ల ఘన చరిత్ర ఉంది. లగ్జరీ కన్జ్యూమర్‌ గూడ్స్‌ మార్కెటోకి దూసుకెళ్లేలా చేసిన మొదటి వ్యక్తి నాయర్‌ ఏమీ కాదు. అంతకుముందు అనుభవజ్ఞుడైన ఆంటోనియా బెల్లోని ఉన్నాడు. ఇప్పుడు అతను మేనేజింగ్‌ డైరెక్టర్‌గా కొనసాగుతున్నాడు. అతనితో పాటు మరికొంత నిష్ణాతులైన వ్యక్తులు ఈ నిచ్చెన మీద ఇప్పటికే ఉన్నారు. అంటే, వారందరి మధ్య నాయర్‌కి ఆ పదవిని కట్టపెట్టారంటే ఆమె శక్తి సామాన్యమైనది కాదనేది స్పష్టం అవుతుంది. అంతేకాదు, ఆ పదవి ఆమెకు మరింత సవాల్‌తో కూడుకున్నదన్నమాటే. 53 ఏళ్ల వయసులో ఆమె ఈ ఘనత వహించిన కంపెనీని మరింత ముందుకు తీసుకువెళ్లడానికి సర్వసిద్ధంగా ఉందన్నమాట.

ఆమెకు ఇదేమీ కొత్తగాకాదు. ప్రపంచవ్యాప్త యునిలీవర్‌లో 30 సంవత్సరాలు పనిచేసిన మొదటి ఆసియా, మొదటి మహిళ, అతి పిన్న వయస్కురాలు.. అనే రికార్డు ఆమె ఖాతాలో ఉంది. ఆంగ్లో–డచ్‌ కన్జ్యూమర్‌ గూడ్స్‌ కంపెనీలో ఫ్యాక్టరీ ఫ్లోర్‌ లెవెల్‌ మేనేజర్‌గా అంతస్తులో పనిచేసిన మొదటి మహిళ, నైట్‌ షిఫ్ట్‌లో పనిచేసిన మొదటి మహిళగానూ నాయర్‌కు పేరుంది.

► ప్రతిరోజూ సవాల్‌..
‘లీనా తను ఏ పని చేసినా దానికో గొప్ప విలువ ఇస్తుంది. ఏ పాత్ర పోషించినా అందుకు తగిన శక్తి సామర్థ్యాలను చూపడంలో దిట్ట. అందుకే ఆమెకు అంతటా అత్యంత గౌరవం. ఆమె తన కొత్త పాత్రలో రాణిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు’ అని కోకో చానెల్‌కు ఎంపికైన సందర్భంలో యునిలీవర్‌ మాజీ చైర్మన్‌ దాడి సేత్‌ ఆమె గురించి గొప్పగా చెప్పారు. కిందటేడాది డిసెంబర్‌లో నాయర్‌ను సీఇవోగా నియమించాలని చానెల్‌ తన నిర్ణయాన్ని ప్రకటించినప్పుడు, ఇది పరిశ్రమకే వైవిధ్యమైన మైలురాయిగా అంతా ప్రశంసించారు.

‘నా కెరీర్‌ ప్రారంభ రోజుల్లో కాలేజీల్లోనూ, కంపెనీల్లోనూ ఒక మహిళగా నా స్థానం ఉండేది. ఉన్నతస్థాయిని సాధించడానికి ప్రతిరోజూ సవాల్‌గా ఉండేది. నామీద ఎవరికైనా సానుభూతి ఉంది అంటే నాకు నేనే అట్టడుగున ఉన్నట్టు అనిపించేది. దానిని నేను చాలా వ్యక్తిగతంగా తీసుకునేదాన్ని. అందుకే, నన్ను నేను ఉన్నతంగా మలుచుకోవడానికి ఇప్పటికీ ప్రతిరోజూ ప్రయత్నిస్తుంటాను’ అని సవినయంగా చెబుతారు నాయర్‌. బహుశా అందుకే ఆమె ఎదుగుదల ఈ రీతిలో సాధ్యమైందేమో!
 
► చిన్న పట్టణం నుంచి ...
మహారాష్ట్రలోని చిన్న పట్టణమైన కొల్హాపూర్‌లో జన్మించిన నాయర్, ఎలక్ట్రానిక్స్, టెలి కమ్యూనికేషన్‌ లో ఇంజినీరింగ్‌ చేసింది. కాలేజీ పూర్తయిన రోజుల్లో ఒక రోజు కాలేజీ ప్రొఫెసర్‌ ఆమెను కూర్చోబెట్టి ‘నీవు ఇప్పటికి ఒక అందమైన ఇంజినీర్‌వే. కానీ, విధి నిర్వహణలో సత్తా చూపగల నైపుణ్యం కలిగి ఉన్నావని భావిస్తున్నాను’ అని చెప్పారట. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో వివరిస్తుంది నాయర్‌. ఆ తర్వాత పట్టుదలతో ఎంబీయేలో గోల్డ్‌మెడల్‌ సాధించింది. హిందూస్థాన్‌ యూనిలీవర్‌ ఎంపిక చేసుకున్న 15 వేల మంది మగవారిలో అతి కొద్దిమంది స్త్రీలలో ఒకరిగా నాయర్‌ ట్రైనీగా చేరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement