Lara Wies: చెత్తబుట్టలో పడేసే సీసాలతో అందమైన షాండ్లియర్‌

Lara Wies From Colorado Makes chandelier From Covid Vaccine Bottles - Sakshi

వ్యాక్సిన్‌ షాండ్లియర్‌ 

కొలరాడోకు చెందిన లారా వీస్‌ బౌల్డర్‌లో హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి రిటైర్‌ అయిన ఒక నర్సు. కరోనా విజృంభించడంతో ఉద్యోగ విరమణ చేసిన వారిని సైతం విధుల్లోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే లారాను కూడా కోవిడ్‌–19 వ్యాక్సిన్‌లు వేయడంలో సహాయం చేయడానికి మళ్లీ విధులకు ఆహ్వనించారు. దీంతో గత ఏడు నెలలుగా లారా తన సహోద్యోగులతో కలిసి వేలమందికి వ్యాక్సిన్‌లు వేస్తున్నారు. అందరూ కలిసికట్టుగా ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్న సందర్భంగా అందరిని గౌరవించేలా ఆమె ఏదైనా చేయాలనుకున్నారు.

ఈ క్రమంలో వ్యాక్సిన్‌ వేశాక చెత్తబుట్టలో పడేసే సీసాలతో అందమైన షాండ్లియర్‌ తయారు చేశారు. అలా తయారు చేసిన వ్యాక్సిన్‌ బాటిళ్ల షాండ్లియర్‌ను ‘లైట్‌ ఆఫ్‌ అప్రిసియేషన్‌’ పేరున హెల్త్‌ కమ్యూనిటీలో షేర్‌ చేసింది. అది చూసిన హెల్త్‌ కమ్యూనిటీ వారు ఎంతో సంతోషంతో ‘‘ఈ ఫోటోను మా ప్రతిభావంతులైన పబ్లిక్‌ హెల్త్‌ నర్సుల కోసం మా సిబ్బందిలో ఒకరైన లారావీస్, ఈ అందమైన కళాకృతిని సృష్టించారు. ఆమెకు మా అందరి తరపున కృతజ్ఞతలు’’ అంటూ బౌల్డర్‌ కౌంటీ పబ్లిక్‌ హెల్త్‌ తన అధికారిక ఫేస్‌బుక్‌ పేజీలో పోస్ట్‌ చేశారు. దాంతో ఈ షాండ్లియర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.  

వ్యాక్సిన్‌లు వేశాక వేల సంఖ్యలో ఖాళీ బాటిళ్లు ఉత్పత్తి అవుతున్నాయి. వాటిని ఏం చేస్తారో ఇప్పటిదాకా సరైన ప్రణాళిక లేకపోవడంతో ఆ బాటిల్స్‌తో ఏదైనా చేయాలనుకుంది. బాటిల్స్‌ను శుభ్రంగా కడిగి, చిన్నచిన్న రంధ్రాలు చేసి క్రిస్టల్స్‌ అతికించి అందమైన షాండ్లియర్‌గా మార్చేసింది. ఈ షాండ్లియర్‌ కోసం దాదాపు 300ల మోడ్రనా వ్యాక్సీన్‌ సీసాలు, అడుగు భాగంలో అందంగా అలంకరించేందుకు పది జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ బాటిల్స్‌ వాడింది. ఈ షాండ్లియర్‌ను చూసిన వారంతా ఆమె ఆరోగ్య కార్యకర్తలకు ఇచ్చే గౌరవ మర్యాదలను, వ్యాక్సిన్‌ బాటిళ్లు వృథా కాకుండా కళాఖండాన్ని రూపొందించడాన్నీ అభినందిస్తున్నారు. 

‘‘కోవిడ్‌ విజృంభణ నుంచి ఆరోగ్య కార్యకర్తలు తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వైద్యం అందించడం, టీకాలు వేయడంలో తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ దీర్ఘకాల మహా యజ్ఞంలో అలుపూ సలుపూ లేకుండా కృషి చేస్తోన్న వారిని గౌరవించడంతోపాటు వినూత్న రీతిలో ప్రశంసించాలనుకున్నాను. ఈ క్రమంలోనే ఒక కళాకృతి చేయాలనుకున్నాను. కరోనా గతేడాది అంతా చీకటిలో గడిచింది. అందుకే వెలుగులోకి తీసుకు వచ్చే ఐడియాతో... టీకా సీసాలు వృథా కాకుండా వాటితో షాండ్లియర్‌ రూపొందించాను. బంధాల పరంగా, ఆర్థికంగా, మానసికంగా, భౌతికంగా ఎంతో కోల్పోయినప్పటికీ భవిష్యత్తును కాంతిమంతంగా మార్చేందుకు ‘లైట్‌ ఆఫ్‌ అప్రిసియేషన్‌’గా  దీని రూపొందించాను’’ అని లారా చెప్పింది.  

చదవండి: Maitri Patel: ఇండియాలోనే అతిపిన్న తొలి కమర్షియల్‌ పైలట్‌.. ఇంకా  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top