ఛత్తీస్‌గఢ్ లోని సియోని గ్రామంలో షాకింగ్ ఘటన ఒకటి జరిగింది. తల్లి పొత్తిళ్లలోంచి అకస్మాత్తుగా మృత్యుముఖంలోకి జారిపోయిన 20 రోజుల పాప అద్భుతంగా ప్రాణాపాయం నుంచి బయటపడింది. అసలే వీధికుక్కల బారిని అనేకమంది శిశువులు ప్రాణాలు కోల్పోతున్న తరుణంలో ఈ ఘటన మరింత ఆందోళన రేపింది.
ఛత్తీస్‌గఢ్‌లోని జాంజ్‌గిర్-చంపా జిల్లాలోని సెవ్ని గ్రామంలో బుధవారం ఈ ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. తల్లి చేతుల నుండి 20 రోజుల నవజాత శిశువును లాక్కొన్న కోతి బావిలో పడవేసింది. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయ్యారు. కానీ త్వరితగతిన చర్యలు తీసుకోవడంతో, సకాలంలో నర్సు చికిత్స అందించడంతో శిశువుకు పెద్ద ప్రమాదం తప్పింది.
శిశువు తల్లి సునీతా రాథోడ్ తన నవజాత శిశువుతో తన ఇంటి బయట కూర్చుంది. ఒక కోతి గుంపు సమీపంలోని పైకప్పుల చుట్టూ తిరుగుతూ ఉన్నట్టుండి కిందకు దూకి శిశువును పట్టుకుని టెర్రస్‌పైకి ఎక్కింది. ఈ ఊహించని దాడి భయాందోళనలకు గురిచేసింది. కుటుంబ సభ్యులు , గ్రామస్తులు సహాయం కోసం కేకలు వేసి, జంతువును భయపెట్టే ప్రయత్నంలో పటాకులు పేల్చారు. ఈ శబ్బాలు విని భయపడిపోయిన కోతి ఇంటి సమీపంలోని బహిరంగ బావిలో శిశువును విసిరివేసి అక్కణ్నించి ఉడాయించింది. క్షణాల్లో, గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు తీసుకున్నారు. వెంటనే ఒక బకెట్‌ను బావిలోకి దించి, నిమిషాల్లోనే శిశువును బయటకు తీశారు.
డైపర్ కాపాడింది
అప్పటికే శిశువు కొంత నీటికి తాగేసింది. కానీ అదృష్టవశాత్తూ పూర్తిగా మునిగిపోలేదు. దానికి కారణం ఆమె ధరించిన డైపర్. అది పాపాయిని మునిగి పోకుండా కాపాడింది.
సకాలంలో స్పందించిన నర్సు
అంతేకాదు అక్కడే ఉన్న,సర్గవాన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేసే నర్సు రాజేశ్వరి రాథోడ్, శిశువుకు సీపీఆర్ చేయడంతో అద్భుతం జరిగింది. గందరగోళం విని బిడ్డ ప్రాణాలను రక్షించేందుకు బిడ్డపాలిట దైవంలా సంఘటనా స్థలానికి చేరుకుంది. CPR చేసి, బేబీ బాడీని రుద్దడంతో క్షణాల్లో శ్వాస తీసుకొని ఏడుపు ప్రారంభించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ తరువాత మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి స్థిరంగా ఉందని, మెరుగుపడుతుందని వైద్యులు నిర్ధారించారు.
పవర్ ప్లాంట్‌లో పనిచేస్తున్న శిశువు తండ్రి అరవింద్ రాథోడ్ మాట్లాడుతూ, తన కుమార్తె ప్రాణాలతో బయటపడటం అద్భుతం అని అన్నారు. ఈ సందర్భంగా నర్సుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తన కూతురు ఈరోజు బతికి ఉందంటే, నర్సు, శిశువు ధరించిన డైపర్ కారణమని సంతోసం వ్యక్తం చేశారు.


