
భారతదేశంలో నూటికి 65 శాతం పైగా ప్రజలు గ్రామీణప్రాంతంలో నివసిస్తున్నారు. భూమిని కలిగి ఉండటం రైతు కుటుంబానికి సామాజిక హోదాను కల్పిస్తుంది. కానీ 78 సంవత్సరాల ‘స్వాతంత్య్రం’ తర్వాత కూడా గ్రామీణ ప్రాంతంలో భూమి లేని నిరుపేదలు అత్యధికంగా ఉన్నారు. గ్రామాల్లోని సుమారు 10 కోట్ల కుటుంబాలకు, అంటే గ్రామాల్లోని దాదాపు 56 శాతం కుటుంబాలకు సాగు భూమి అనేది లేదు.
1970 దశకంలో ప్రజల, ముఖ్యంగా గిరిజన ప్రజల పోరాటం ఫలితంగా భూమి సమస్య ప్రధాన ఎజెండాగా ముందుకు వచ్చింది. రాష్ట్రాల వారీగా భూసంస్కరణల చట్టాలు వచ్చాయి. 1972లో జరి గిన ముఖ్యమంత్రుల సమావేశంలో జాతీయ స్థాయిలో ఒకే సీలింగ్ విధానాన్ని రూపొందించారు. ఈ సీలింగ్ ద్వారా 67 లక్షల ఎకరాల మిగులు తేలింది. శ్రీకాకుళం గిరిజన రైతాంగ పోరాటం ఫలితంగా ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో 1972లో భూ సంస్కరణల చట్టం చేయబడి 1973లో అమల్లోకి వచ్చింది. భూ సంస్కరణల చట్ట ప్రకారం మొదట 18 లక్షల ఎకరాలను మిగులు భూమిగా ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం ప్రక టించింది. సవరణలతో కుదిస్తూ చివరికి 7.9 లక్షల ఎకరాల మిగులు భూమి ప్రకటించి, అందులో 6.47 లక్షల ఎకరాలను స్వాధీనం చేసుకుని, 5.82 లక్షల ఎకరాలను లక్షా 79 వేల మందికి పంపిణీ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. చట్టంలో ఉన్న లొసుగు లను ఉపయోగించుకొని భూస్వాములు, ధనిక రైతులు సీలింగ్‌లోకి రాకుండా తమ భూములను కాపాడుకున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ సుమారు 51 లక్షల ఎకరాలను మాత్రమే 57.8 లక్షల పేద రైతులకు పంపిణీ చేయడం జరిగింది.
భూ సంస్కరణల చట్టాల వల్ల భూ సంబంధాల్లో మౌలికమైన మార్పులు జరగలేదు. కొద్ది మంది వద్దే భూమి ఇంకా కేంద్రీకరించ బడి ఉంది. 2020 జాతీయ శాంపిల్ సర్వే ప్రకారం, 84%గా ఉన్న చిన్న, సన్నకారు రైతులు హెక్టార్ కన్నా తక్కువ భూమిని కలిగి ఉన్నారు. కేవలం 4.9% ఉన్న భూస్వాముల వద్ద 32% సాగు భూమి ఉంది. రాష్ట్రాల వారిగా కూడా భూకేంద్రీకరణలో వ్యత్యాసాలు ఉన్నాయి. పంజాబ్, బిహార్ రాష్ట్రాల్లో 10%గా ఉన్న భూస్వాముల వద్ద 80 శాతం భూమి ఉంది. తెలంగాణ, రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాల్లో 55% భూమి 10%గా ఉన్న భూస్వాముల వద్ద ఉంది. భారతదేశంలో ఒక పెద్ద భూ కామందు ఒక సన్నకారు రైతు కన్నా 45 రెట్లు ఎక్కువ భూమిని కలిగి ఉన్నారు.
దేశంలో భూ సంస్కరణలు అమలు జరిపారనీ, భూస్వామ్య విధానం లేదనీ, దాని అవశేషాలు మాత్రమే ఉన్నాయనీ, పంచ టానికి ఇంకా భూములు లేవనీ కొందరు చేస్తున్న వాదనలు వాస్తవ విరుద్ధం. భూ కామందుల వద్దే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థల వద్ద, మత సంస్థల వద్ద లక్షలాది ఎకరాల భూమి ఉంది. ఆ భూము లను ప్రభుత్వం పంపిణీ చేయగలిగినప్పుడే పేదలందరికీ భూమి లభిస్తుంది. 10 నుండి 12 ఎకరాల సీలింగ్ విధించి భూ సంస్కర ణలు అమలు జరిపితే లక్షల కొద్ది భూములను పేదలకు పంపిణీ చేయవచ్చు. పాలకుల విధానాలకు వ్యతిరేకంగా గ్రామీణ పేదలు భూమి కోసం సంఘటితం కావాలి.
– బొల్లిముంత సాంబశివరావు
రైతు కూలీ సంఘం (ఆం.ప్ర.) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు