
గండ శిలతో చెక్కిన శిల్పాలను చూస్తాం.పూరీ చెక్కుకున్న దారు శిల్పాలను చూస్తాం.చంద్రభాగలో సైకత శిల్పాలను కూడా చూస్తాం. అశోకుడి తొలి బౌద్ధచిహ్నం ధవళగిరి స్థూపం...దేశంలో పెద్ద ఉప్పునీటి సరస్సు చిలకాలేక్.శిల్పరాజాలు కందగిరి... ఉదయగిరి గుహలు. వీటన్నింటినీ ఒకే ప్యాకేజ్ టూర్‌లో చూస్తాం. అది కోణార్క్ సాండ్ ఆర్ట్ ఫెస్టివల్ టూర్. ఫెస్టివల్ ఎప్పుడు జరుగుతుంది?
డిసెంబర్ 1 నుంచి 5 వరకు...టూర్‌కి టికెట్ బుక్ చేసుకుందాం.
ఇంటర్నేషనల్ సాండ్ ఆర్ట్ ఫెస్టివల్ 2025. ఇది 15వ ఇంటర్నేషనల్ సాండ్ ఆర్ట్ ఫెస్టివల్. ఈవేడుకలకు వేదిక ఒడిశా రాష్ట్రం, కోణార్క్‌లోని చంద్రభాగ బీచ్.
1వ రోజు..
హైదరాబాద్ నుంచి బయలుదేరి భువనేశ్వర్‌కు చేరాలి. భువనేశ్వర్‌లోని బిజూ పట్నాయక్ ఎయిర్‌పోర్ట్‌లో టూర్ ఆపరేటర్‌లు రిసీవ్ చేసుకుంటారు. అక్కడి నుంచి పూరీకి ప్రయాణం. దారిలో ధౌలి స్థూప వీక్షణం. పూరికి చేరిన తర్వాత హోటల్ గదిలో చెక్ అవడం, రాత్రి బస.
ధవళ గిరి స్థూపం
కొండ మీద తెల్లటి స్థూపం. భువనేశ్వర్ నుంచి ఏడు కిలోమీటర్ల దూరాన పూరీకి వెళ్లే దారిలో ఉంటుంది. అశోక చక్రవర్తి బౌద్ధాన్ని స్వీకరించిన తర్వాత నిర్మించిన తొలి స్థూపం ఇది. కళింగ యుద్ధంలో జరిగిన రక్తపాతంతో మనసు కకావికలమైన అశోకుడు బౌద్ధం వైపు మరిలిన సంగతి తెలిసిందే. అశోకుడు శాంతి మార్గంలో జీవించడానికి నిర్ణయించుకున్న తర్వాత ఏర్పాటు చేసిన స్థూపం కావడంతో దీనికి శాంతి స్థూపం అని పేరు. బౌద్ధ సన్యాసులు ఈ స్థూపాన్ని సభక్తిగా దర్శించుకుంటారు.
2వ రోజు
తెల్లవారు జామున బయలుదేరి జగన్నాథుని దర్శనానికి వెళ్లాలి. ఇది ప్యాకేజ్‌లో వర్తించదు. పర్యాటకులు తమకు తాముగా వెళ్లి రావాలి. దర్శనం తర్వాత హోటల్‌కు వచ్చి బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత టూర్ సత్పద వైపు సాగిపోతుంది. చిలకా సరస్సు వీక్షణం తర్వాత తిరిగి పూరీకి చేరాలి. రాత్రి బస పూరీలోనే.
జగన్నాథపురి
పూరీ అని పిలిచే పట్టణానికి ఆ పేరు రావడానికి జగన్నాథుని ఆలయమే ప్రధానం. జగన్నాథపురి అనే పేరు నుంచి పురి అనే పేరు వ్యవహారంలో పూరీగా మారిపోయింది. ఈ ఆలయంలో బలభద్ర, సుభద్ర, జగన్నాథులు పూజలందుకునే దైవాలు. బలరాముడు, శ్రీకృష్ణుడు, వారి చెల్లెలు సుభద్ర విగ్రహాలు దారుశిల్పాలు.
విగ్రహాల రూపం అసంపూర్తి రూపాలతో విచిత్రంగా ఉంటుంది. ఏటా జరిగే జగన్నాథుని రథయాత్ర ప్రసిద్ధి. ఇక్కడ భగవంతుడికి నివేదన చేసే వంటకాలు తయారు చేసే గది ‘రోసాఘర’ను కూడా చూడాలి. 56 రకాల పదార్థాలను వండుతారు. వంటకాల్లో ఉల్లి, వెల్లుల్లి వాడరు.
సముద్రమంత సరస్సు
చిలకా సరస్సు 11 వందల చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది. మనదేశంలో తీర్ర΄ాంతంలో విస్తరించిన పెద్ద తీర సరస్సు ఇది. దయా నది, భార్గవి నది, మకర, మాలగుని, లునా నదుల నీరు బంగాళాఖాతం సముద్రంలో కలిసే చోట ఆటు΄ోట్లకు సముద్రపు నీరు వెనక్కు తోసుకు రావడంతో ఏర్పడిన ఉప్పు నీటి సరస్సు ఇది.
మన తెలుగు రాష్ట్రంలో పులికాట్ సరస్సు కూడా అలాంటిదే. పులికాట్ సరస్సుకు వచ్చినట్లే ఖండాంతరాల నుంచి పక్షులు ఇక్కడికి కూడా ఏటా వలస వస్తాయి. గుడ్లు పెట్టి, పిల్లల్ని పొదిగి వాటికి రెక్కలు వచ్చిన తర్వాత తమతో తీసుకెళ్లిపోతాయి. చిలకా సరస్సు మరో ప్రత్యేకత ఏమిటంటే క్రీస్తుపూర్వం మూడవ శతాబ్దం నుంచి విదేశీ వర్తక వాణిజ్యాలు జరిగిన ప్రదేశం ఇది.
యునెస్కో సంస్థ చిలకా సరస్సును వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తించింది. సత్పద అనే ప్రదేశంలో సరస్సు మీద కొంత దూరం వెళ్ల్లడానికి ఒక ఫ్లాట్‌ఫామ్ ఉంటుంది. నీటి మీద విహారాన్ని ఆస్వాదించవచ్చు.

3వ రోజు
బ్రేక్‌ఫాస్ట్, హోటల్ గది చెక్ అవుట్ చేసిన తర్వాత కోణార్క్‌కు ప్రయాణం. కోణార్క్ సూర్యదేవాలయ వీక్షణం, సాండ్ ఆర్ట్ ఫెస్టివల్‌ను ఆస్వాదించడం. సాయంత్రం భువనేశ్వర్‌కు ప్రయాణం. హోటల్ చెక్ ఇన్. రాత్రి బస భువనేశ్వర్‌లో.
రథచక్రాలయం
కోణార్క్‌ని వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తించింది యునెస్కో. సూర్యదేవాలయాన్ని చూడడం అంటే ఖగోళశాస్త్రాన్ని శిల్పాల రూపంలో తెలుసుకోవడం. ఆలయం ప్రాంగణంలోని సన్‌టెంపుల్ మ్యూజియాన్ని చూడడం మర్చి΄ోవద్దు. కోణార్క్ డాన్స్ ఫెస్టివల్ ఏటా అలరించేది. ఇప్పుడు సైకత శిల్ప కళల వేడుక కూడా తోడవడంతో కోణార్క్ పర్యాటకధామంగా మారింది.
ఇసుక బొమ్మల కొలువు
కోణార్క్‌లోని చంద్రభాగ బీచ్‌లో సాండ్ ఆర్ట్ కొలువు దీరి ఉంటుంది. ఈ ఏడాది డిసెంబర్ ఒకటి నుంచి ఐదవ తేదీ వరకు జరిగే ఈ ఫెస్టివల్‌కు దేశ విదేశాల సాండ్ ఆర్టిస్టులు పాల్గొంటారు. ప్రపంచ శాంతి, ప్రకృతి పరిరక్షణ వంటి థీమ్‌లతో ఒక్కొక్క ఆర్ట్ ఒక్కో సందేశాన్నిస్తుంది. సుదర్శన్ పట్నాయక్ సరదాగా మొదలు పెట్టిన సైకత శిల్పకళకు చక్కటి ఆదరణ లభించింది.
ఎంతగా అంటే... ముఖ్యమైన సందర్భాలు, సామాజిక సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు ఆ అంశాన్ని పట్నాయక్ ఎలా రూపొందించాడో చూడడానికి టెలివిజన్ వార్తలను ఫాలో అయ్యేంతగా. ఇప్పుడు సుదర్శన పట్నాయక్ సాండ్ ఆర్ట్‌కి బ్రాండ్ అంబాసిడర్ అయ్యాడు. అతడి బాటలో ఈ తరం యువతీయువకులు సాండ్ ఆర్ట్‌లో శిక్షణ పొంది, ఒకరిని మించి మరొకరు చక్కటి సైకత శిల్పాలకు రూపమిస్తున్నారు.
4వరోజు
బ్రేక్‌ఫాస్ట్ తర్వాత జాజ్‌పూర్‌కు ప్రయాణం. బిరజాదేవి శక్తిపీఠాన్ని దర్శించుకున్న తర్వాత రత్నగిరి బౌద్ధక్షేత్ర వీక్షణం. తిరిగి భువనేశ్వర్‌కు చేరాలి. రాత్రి బస భువనేశ్వర్‌లోనే.
బిరజాదేవి ఆలయం
ఒడిశాలో బిరజ అనే పదానికి అసలు ఉచ్చారణ విరజ. గిరిజాదేవినే ఒడియా వాళ్లు బిరజాదేవి అంటారు. ఇది దుర్గాదేవి శక్తిపీఠం. విరజ క్షేత్రం అని కూడా అంటారు. ఇప్పుడు మనం చూసే ఆలయం 13వ శతాబ్దం నాటిది. రత్నగిరి బౌద్ధక్షేత్రం ఒక పురాతత్వగని. తవ్వేకొద్దీ విషయాలను వెల్లడిస్తోంది.
రత్నగిరి బౌద్ధ క్షేత్రమే కాని ఇక్కడ హిందూ పౌరాణిక పాత్రల శిల్పాలు అనేకం ఉంటాయి. ఈ బౌద్ధక్షేత్రంలోని నిర్మాణాలు ఐదవ శతాబ్దం నుంచి మొదలై పదవ శతాబ్దం వరకు కొనసాగినట్లు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తవ్వకాల్లో నిర్ధారణ అయింది. 16వ శతాబ్దంలో వరదల్లో కప్పబడి పోవడంతో ఇక్కడ ఇంత గొప్ప నిర్మాణాలున్నాయనే విషయాన్ని కూడా మర్చిపోయారు. తవ్వకాల్లో దొరికిన శిల్పాలతో ఈ ప్రాంగణంలో మ్యూజియం ఉంది. రత్నగిరి, లలిత్‌గిరి, ఉదయగిరి గుహలను కలిపి డైమండ్ ట్రయాంగిల్‌గా పిలుస్తారు.
5వరోజు
బ్రేక్‌ఫాస్ట్, గది చెక్ అవుట్ చేసిన తర్వాత లింగరాజ ఆలయానికి ప్రయాణం. ఆ తర్వాత ముక్తేశ్వర్ టెంపుల్, రాజారాణి టెంపుల్ వీక్షణం. మధ్యాహ్నం తర్వాత కందగిరి గుహలు, ఉదయగిరి గుహల్లో విహారం తర్వాత రాత్రి ఎనిమిది గంటలకు టూర్ నిర్వహకులు పర్యాటకులను భువనేశ్వర్‌లో ఎయిర్‌పోర్ట్‌లో డ్రాప్ చేస్తారు.
ఆలయాల భువనం
భువనేశ్వర్‌లో ఏమి చూడాలని అడిగితే లింగరాజ ఆలయం, ముక్తేశ్వర్, రాజారాణి ఆలయాలు అని ఒక్కమాటలో చెప్పవచ్చు. భువనేశ్వర్ గొప్పశిల్ప నిలయం. లింగరాజ ఆలయాన్ని దర్శించిన వాళ్లు, ఆలయం గురించి వివరించేటప్పుడు మొదటి మాటగా నిర్వహణ లోపాన్ని ప్రస్తావిస్తారు. చాలా మురికిగా ఉంటుందని ఆవేదన చెందుతారు. భారీ నిర్మాణం. ఆలయ నిర్మాణకౌశలం ప్రత్యేకంగా ఉంటుంది. మన దక్షిణాది నిర్మాణాలు, ఉత్తరాది నిర్మాణాలకు భిన్నమైన కళింగ నిర్మాణశైలి ఇది.
ముక్తేశ్వర్ ఆలయంలో ఏకరాతి శిలాతోరణ ద్వారం గొప్ప శిల్పచాతుర్యమనే చె΄్పాలి. భువనేశ్వర్‌లోని రాజారాణి ఆలయం కూడా పుణ్యక్షేత్రమే. ఈ ఆలయ నిర్మాణం అంతా పసుపు, ఎరుపు సాండ్‌స్టోన్‌ల కలయిక. ఈ రెండు రంగుల రాళ్లను రాజారాణి రాళ్లుగా పిలుస్తారు. అందుకే ఇది శివాలయమే అయినా రాజారాణి ఆలయంగా వ్యవహారంలోకి వచ్చింది.
కందగిరి ఉదయగిరి గుహలుకొండలను గుహలుగా తొలచడమే ఒక అద్భుతం అనుకుంటే గుహల్లోపల గోడల నిండుగా రకరకాల థీమ్‌లతో శిల్పాలుంటాయి. స్థూలంగా చూసినప్పుడు శిల్పాలన్నీ ఒకేరీతిలో ఉన్నట్లు అనిపిస్తాయి. కానీ నిశితంగా పరిశీలిస్తే పౌరాణిక కథల సన్నివేశాలు కళ్లకు కడుతాయి. చేతికందే ఎత్తులో ఉన్న శిల్పాలు యుద్ధానంతర దాడుల్లో ధ్వంసమైన వైనం కూడా అవగతమవుతుంది.
ఉదయగిరి గుహల్లో గణేశ గుహను గమనించడం మర్చిపోవద్దు. పదడుగుల ఎత్తున్న కొండను తొలిచి వరండాలాగ మలిచారు. ఎదురుగా చెరుకు తింటున్న ఏనుగులు, ద్వార΄ాలకుల్లాగ సైనికులు, వరండా పైకప్పుకి స్తంభాల్లాగ చెక్కిన రాతిని కలుపుతూ నమస్కార ముద్రలో ఉన్న సాలభంజికలు... చూడ చక్కగా ఉంటాయి.
టూర్ వివరాలివి
ఐఆర్‌సీటీసీ నిర్వహిస్తున్న ఈ టూర్ పేరు ‘కోణార్క్ సాండ్ ఆర్ట్ ఫెస్టివల్’.
ప్యాకేజ్ కోడ్ : ఎస్‌హెచ్‌ఏ42. ఇది ఐదు రోజుల టూర్. హైదరాబాద్ నుంచి మొదలై హైదరాబాద్‌కు చేరడంతో పూర్తవుతుంది. ఈ టూర్‌లో చిలకా లేక్, కోణార్క్ టెంపుల్, బిరజాదేవి ఆలయం, భువనేశ్వర్ ప్రదేశాలకు కవర్ అవుతాయి.
నవంబర్ 30వ తేదీ 12.35 గంటలకు ‘6ఈ 6911’ ఫ్లైట్ హైదరాబాద్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 14.10 గంటలకు భువనేశ్వర్‌కు చేరుతుంది.
డిసెంబర్ 4వ తేదీ రాత్రి ‘6ఈ 631’ ఫ్లైట్ 22.10 గంటలకు భువనేశ్వర్ నుంచి బయలుదేరి రాత్రి 23.55 గంటలకు హైదరాబాద్‌కు చేరుతుంది.
టికెట్ ధరలిలాగ:
సింగిల్ ఆక్యుపెన్సీలో 43,950 రూపాయలు.
డబుల్ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి 34,800 రూపాయలు,
ట్రిపుల్ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి 32,650 రూపాయలు.
బుకింగ్ ఎలా:
సంప్రదించాల్సిన చిరునామా:
ఐఆర్‌సీటీసీ, సౌత్‌సెంట్రల్ జోన్,
ఐఆర్‌సీటీసీ 9–1–129/1/302, థర్డ్ ఫ్లోర్, ఆక్స్‌ఫర్డ్ ప్లాజా,
ఎస్‌డీ రోడ్, సికింద్రాబాద్, తెలంగాణ.
ఫోన్ నంబరు: 040– 27702407
– వాకా మంజులారెడ్డి,
సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
(చదవండి: Man Name Makes Record: 'పేరు'తో ప్రపంచ రికార్డు..! ఏకంగా చట్టంలోనే మార్పులు చేసి..)