కేశిరాజు విజయ కుమారి: 19 X 7 = ? | kesiraju vijayakumari donates table books distribution | Sakshi
Sakshi News home page

కేశిరాజు విజయ కుమారి: 19 X 7 = ?

Apr 12 2023 6:02 AM | Updated on Apr 12 2023 6:02 AM

kesiraju vijayakumari donates table books distribution - Sakshi

‘‘డిజిటల్‌ యుగంలో లెక్కలు చేయడం సులువైంది. స్మార్ట్‌ ఫోన్‌ ఉంటే చేతిలో కంప్యూటర్‌ ఉన్నట్లే. ఈ విజ్ఞాన పరిణామం ఎటు దారి తీసిందో తెలుసా? ఏడెనిమిదులు ఎంతో చెప్పలేకపోతున్న తరం తయారైంది. అవన్నీ గుర్తు పెట్టుకోవడం తన పని కాదనుకుంటోంది మెదడు. కాలిక్యులేటర్‌ ఉండగా తనకెందుకు శ్రమ అని విశ్రాంతిలోకి వెళ్తోంది. కాలిక్యులేటర్‌ ఉండాల్సింది చేతిలో కాదు... తలలో. నిజమే! కాలిక్యులేటర్‌ బుర్రలో ఉండాలి... ఎక్కాలు నాలుక మీద నాట్యం చేయాలి.’’ అని... పిల్లలకు ఎక్కాలు నేర్పించడానికి ముందుకొచ్చారు కేశిరాజు విజయ కుమారి.

పశ్చిమగోదావరి జిల్లాలో ఓ చిన్న గ్రామం కవిటం. థింక్‌ బిగ్‌ అని ఏపీజే అబ్దుల్‌ కలామ్‌ చెప్పగా ఆమె వినలేదు. కానీ తనకు తానుగా పెద్ద కలనే కన్నారు. ఐఏఎస్‌ కావాలనే కల నెరవేరకపోవడానికి ఒకటి కాదు రెండు కాదు కుటుంబ రీత్యా అనేక కారణాలు. అడ్డంకులు ఐఏఎస్‌ కాకుండా ఆపగలిగాయి, కానీ సమాజానికి సేవ చేయడానికి కాదు కదా అనుకున్నారామె. తన ఎదురుగా కనిపించిన ప్రతి సమస్యకూ పరిష్కారాన్ని వెతుకుతూ, పరిష్కరించే వరకు విశ్రమించకుండా శ్రమించారు.

బాల్యంలోనే నాన్న పోవడం, పిల్లల పెంపకం బాధ్యతను మోస్తూ అమ్మ భుజాలు అరిగిపోవడం చూస్తూ పెరిగారామె. అంతేకాదు... తొలి ఉద్యోగం ఒక ఎన్‌జీవోలో టీచర్‌గా. దాంతో ఆ తర్వాత కూడా ఆమె అడుగులు సర్వీస్‌ వైపుగానే సాగాయి. దశాబ్దాలపాటు మహిళల కోసమే సేవలందించారామె. ఈ ప్రయాణంలో ఆమెకో కొత్త సంగతి తెలిసింది. డిగ్రీ చదువుకున్న వాళ్లకు కూడా ఎక్కాలు రావడం లేదు. నేర్చుకుని మర్చిపోయారా అంటే... అదీ కాదు. బడి గడప తొక్కని, అక్షరాలు నేర్వని బాల్యం ఉంటుంది.

కానీ బడికి వెళ్లి అక్షరాలు నేర్చుకుని ఎక్కాలు నేర్వని బాల్యం ఉంటుందని ఊహించలేదామె. మరింత క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత తెలిసిందేమిటంటే... నేటి బాల్యానికి ఎక్కాలు నేర్చుకోవడం టైమ్‌ వేస్ట్‌ పనిగా ఉంటోందని. కాలిక్యులేటర్‌ లేకుండా వందలో నాలుగోవంతు ఎంత అంటే చెప్పడం చేతకావడం లేదని. ఇన్ని తెలిసిన తర్వాత ప్రాథమిక పాఠశాలలకు వెళ్లి ఎక్కాల పుస్తకాలు పంచు తున్నారు. ఒకటి రెండు నెలల పాటు వాళ్లకు నేర్చుకునే టైమ్‌ ఇచ్చి ఆ తర్వాత పోటీలు పెడుతున్నారు. ప్రతి క్లాసులో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతోపాటు పాల్గొన్న వాళ్లకు కూడా ప్రోత్సాహకాలిస్తున్నారు. రకరకాలుగా సాగిన తన సామాజిక ప్రస్థానాన్ని ఆమె సాక్షితో పంచుకున్నారు.
 
ఆడపిల్ల పుట్టాలి... చదవాలి!
 ‘‘మా వారి ఉద్యోగరీత్యా రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో ఎక్కువ కాలం ఉన్నాను. పెళ్లికి ముందు చదువు చెప్పిన అలవాటు ఉండడంతో అక్కడ ఖాళీగా ఉండలేకపోయేదాన్ని. పైగా మేము నార్త్‌లో ఉన్న రోజుల్లో అక్కడి మహిళలు దాదాపుగా నిరక్షరాస్యులే. నేనిక్కడ చదివింది సెకండ్‌ లాంగ్వేజ్‌ హిందీ మాత్రమే. కానీ అక్షరాలు, వాక్యాలు నేర్పించడానికి సరిపోయేది. వాళ్లకు నేర్పిస్తూ నేను హిందీ మాట్లాడడం నేర్చుకున్నాను. భాష మీద పట్టు రావడంతో వాళ్లకు కౌన్సెలింగ్‌ ఇవ్వడం సులువైంది. ఘూంఘట్‌ చాటున, అత్తింటి నియమాల మాటున జీవించడమే వాళ్లకు తెలిసింది. కడుపులో ఉన్నది ఆడపిల్ల అయితే బిడ్డను కనకూడదని, గర్భస్రావం చేయించుకోవాలని నూరిపోసింది అక్కడి సమాజం.

యువతులు కూడా అదే నిజమనే విశ్వాసంతో ఉండేవాళ్లు. స్త్రీ లేని సమాజం ఎలా మనుగడ సాగిస్తుందో చెప్పమని, దక్షిణాదిలో ఆడపిల్ల çపుడితే లక్ష్మీదేవి పుట్టినట్లు భావిస్తారని వాళ్లకు నచ్చచెప్తుంటే... ‘ఇద్దరు మగపిల్లలున్న తల్లి ఆమె ఏ మాటైనా చెబుతుంది. ఆడపిల్లకు కట్నాలిచ్చేది ఎవరు’ అని అక్కడి మగవాళ్లలో నా మీద వ్యతిరేకత పెల్లుబుకుతుండేది. నాది నిశ్శబ్ద ఉద్యమం కాబట్టి నా మీద దాడులు జరగలేదు. ఇంటిముందు మురుగు కాలువ ఓపెన్‌ డ్రైనేజ్‌లో పిల్లలు పడుతుంటారు కూడా. పరిశుభ్రత లేమిని, ఇలాంటి సమస్యలను ప్రశ్నిస్తూ, మహిళలను కలుపుకుని స్థానిక మున్సిపల్‌ ఆఫీసులకు వెళ్లేదాన్ని. రోడ్డు శుభ్రం చేసిన తర్వాత ఆ కాలనీలో నివసించే ఆడవాళ్ల చేత సంతకం చేయించుకునే నియమం పెట్టారు మున్సిపల్‌ కమిషనర్‌.  

నేర్చుకోవడానికి వయసు పరిమితి ఎందుకు!
నా ఉద్దేశం ఒక్కటే. ‘మహిళ కుటుంబ భారాన్ని మోయాల్సి వస్తే... ఆ క్షణంలో బెంబేలెత్తిపోకూడదు. ప్రతి ఒక్కరి చేతిలో ఏదో ఒక పని ఉండాలి. ఆర్థిక స్వావలంబన సాధించాలి’... అని. హైదరాబాద్‌కి వచ్చిన తర్వాత ఇక్కడి మహిళల కోసం స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్స్‌ అనేకం చేశాను. గవర్నమెంట్‌ ప్రోగ్రామ్స్‌లో వయో పరిమితి ఉంటుంది. అందులో ఇమడని వాళ్లు ‘మాకూ నేర్చుకోవాలని ఉంది’ అంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి నాది. అలాంటి వాళ్ల కోసం కేవీఎస్‌ ఫౌండేషన్‌ స్థాపించి ఉచితంగా శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాను. శిక్షణ కార్యక్రమాలు, ఎగ్జిబిషన్‌లు 2006 నుంచి నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. శిక్షణ కార్యక్రమాల నుంచి పుట్టుకు వచ్చిన అవసరమే ఈ ఎక్కాల ఉద్యమం’’ అన్నారు విజయకుమారి.

టైలరింగ్‌ నేర్పించేటప్పుడు నడుము చుట్టు కొలత లో నాలుగో వంతు మార్క్‌ చేయమంటే చాలామందికి తెలిసేది కాదు. దాంతో ముందు లెక్కలు నేర్పించాల్సి వచ్చేది. ఏదో సందేహం వచ్చి హైదరాబాద్‌లోని మా అపార్ట్‌మెంట్‌ పిల్లలను అడిగాను. ఎక్కాలు చదవడం ఏంటన్నట్లు చూశారు. అపార్ట్‌మెంట్‌లో ఎక్కాల పోటీలు పెట్టాను. పాల్గొనడానికే సిగ్గుపడుతున్నారు కొందరు. స్కూళ్లకు వెళ్లాను. ప్రైవేట్‌ స్కూళ్లు పెద్దగా స్పందించలేదు. ప్రభుత్వ పాఠశాలలు స్వాగతించాయి. సిటీలో ఇప్పటికి మూడువేల ఎక్కాల పుస్తకాలు పంచాను. ఉప్పరపల్లి, ప్రభుత్వ పాఠశాల లో రెండవ తరగతి పిల్లాడు చాలా త్వరగా ఇరవై ఎక్కాలు నేర్చుకున్నాడు. పిల్లలకు చక్కగా నేర్పిస్తే మెరికల్లా తయారవుతారు. ప్రైవేట్‌ విద్యారంగం పిల్లలను మార్కుల పోటీలోకి నెట్టేస్తూ, లెక్కలకు పునాది వంటి ఎక్కాలను నిర్లక్ష్యం చేస్తోంది. మహిళలకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌తోపాటు పిల్లలకు ఎక్కాలు నేర్పించే మరో నిశ్శబ్ద ఉద్యమాన్ని చేపట్టాను.
– కేశిరాజు విజయకుమారి, సామాజిక కార్యకర్త, కేవీఎస్‌ ఫౌండేషన్‌

– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి
ఫొటోలు : అనిల్‌ కుమార్‌ మోర్ల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement