పాలిసిస్టిక్ కిడ్నీ వ్యాధితో ఎండ్‌స్టేజ్ రీనల్ ఫెయిల్యూర్‌కు గురైన కెన్యాకు చెందిన మహిళకు హైదరాబాద్‌లోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (AINU) హైటెక్ సిటీ వైద్యులు కొత్త జీవితం అందించారు. విజయవంతంగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేశారు.
కెన్యాకు చెందిన 55 ఏళ్ల ఫతుమో మొహముద్ డుబో కొంత కాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. కెన్యాలో వైద్య పరీక్షలు చేసిన తర్వాత అత్యవసరంగా కిడ్నీ మార్పిడి చేయాలని డాక్టర్లు తేల్చి చెప్పారు. దీంతో ఆమె తన సోదరి, చిన్న కూతురుతో కలిసి మెరుగైన చికిత్స కోసం భారత్‌కు వచ్చారు. AINU హైటెక్ సిటీలో చేరారు. వైద్యులు సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత జీవ దాత ద్వారా కిడ్నీ మార్పిడి చేయాలని నిర్ణయించారు. ఆమె సోదరి కిడ్నీ దానం చేయడానికి ముందుకు వచ్చారు.
ప్రాణాలు నిలిపిన సోదరి:
AINU హైటెక్ సిటీ వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో ఆమె సోదరి కిడ్నీ సరిపోలుతుందని తేలింది. దీంతో గత ఏడాది సెప్టెంబర్‌లో ఒకే సెషన్‌లో దాత నుంచి కిడ్నీ తీసి స్వీకర్తకు అమర్చామనీ AINU సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ కె. క్రాంతి కుమార్ తెలిపారు. సుమారు నాలుగు గంటల పాటు సాగిన ఈ శస్త్రచికిత్సను AINU హైటెక్ సిటీ ట్రాన్స్‌ప్లాంట్ విభాగానికి చెందిన ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్లు, నెఫ్రాలజిస్టులు, అనస్థీషియా, క్రిటికల్ కేర్ నిపుణుల బృందం విజయవంతంగా నిర్వహించిందని అన్నారు. "ఈ కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సకు దాత ఎంపిక నుంచి శస్త్రానంతర సంరక్షణ వరకు అన్ని దశల్లో సమన్వయంతో పనిచేశాం. ఎండ్‌స్టేజ్ రీనల్ డిసీజ్ ఉన్న రోగులకు జీవ దాత కిడ్నీ మార్పిడి అత్యుత్తమ ఫలితాలను ఇస్తోంది" అని వెల్లడించారు.
జన్యుపరమైన వ్యాధి:
పాలిసిస్టిక్ కిడ్నీ వ్యాధి అనేది జన్యుపరమైన కుటుంబ సంబంధిత వ్యాధి అని డాక్టర్ కె. క్రాంతి కుమార్ తెలిపారు. ఈ వ్యాధి వచ్చిన వారికి కాలక్రమేణా మూత్రపిండాల్లో అనేక సిస్టులు ఏర్పడతాయని చెప్పారు. క్రమం తప్పకుండా స్క్రీనింగ్, దీర్ఘకాలిక ఫాలోఅప్ ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఐతే ప్రతి ఒక్కరిలోనూ కిడ్నీ వైఫల్యం కాదని, కొన్ని సందర్భాల్లో మాత్రం క్రానిక్ కిడ్నీ డిసీజ్‌గా మారి, చివరికి ఎండ్‌స్టేజ్ రీనల్ ఫెయిల్యూర్‌కు దారి తీస్తుందని వివరించారు. వారికి తప్పకుండా కిడ్నీ మార్పిడి చేయాల్సి ఉంటుందన్నారు.
భారత్‌కు కృతజ్ఞతలు:
ఈ సందర్భంగా ఫతుమో మొహముద్ డుబో మాట్లాడుతూ, “కెన్యా నుంచి భారత్‌కు రావడం చాలా కష్టమైన నిర్ణయం. కానీ ఇక్కడి వైద్యులు నాకు మళ్లీ జీవించే అవకాశం ఇచ్చారు. ప్రతి దశను స్పష్టంగా వివరించి మాకు అండగా నిలిచారు. నా సోదరి కిడ్నీ దానం చేయడం వల్లనే నా ప్రాణాలు నిలిచాయి,” అని తెలిపారు. అవయవ మార్పిడుల్లో భారత్ ప్రపంచ స్థాయిలో కీలక కేంద్రంగా ఎదుగుతోందని, దీనికి తాజా శస్త్ర చికిత్స ఒక ఉదాహరణ అని వైద్యులు తెలిపారు.
కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సను డాక్టర్ మల్లికార్జున, డాక్టర్ దీపక్ రగూరి, డాక్టర్ ఎమ్.డి. తైఫ్ బెండిగేరి, డాక్టర్ . సయ్యద్ ఎమ్.డి. ఘౌస్, డాక్టర్. దీక్ష ప్రియలతో కూడిన వైద్య బృందం నిర్వహించింది.
(చదవండి: 90 నిమిషాల ఎమర్జెన్సీ రూమ్‌కి..హడలెత్తించేలా బిల్లు..!)


