మోదీకి యాదమ్మ మెనూ

Karimnagar woman Goolla Yadamma to cook for Narendra Modi - Sakshi

‘ఇంటి వంట’ స్త్రీలకు అప్పజెప్పి ‘ఉత్సవ వంట’ మగాడు హస్తగతం చేసుకున్నాడు. నలభీములే భారీ వంటలు చేస్తారట. పెద్ద పెద్ద హోటళ్లలో చెఫ్స్‌ మగాళ్లే ఉండాలట. ఈ మూస అభిప్రాయాన్ని మన తెలంగాణ మహా వంటగత్తె బద్దలు కొట్టింది. ‘వింటే భారతం వినాలి తింటే గూళ్ల యాదమ్మ వంట తినాలి’ అని పేరు సంపాదించింది. అందుకే హైదరాబాద్‌కు మోదీ వస్తుంటే
కాల్‌ యాదమ్మకు వెళ్లింది. ‘యాదమ్మగారూ ఏం వొండుతున్నారు ప్రధానికి?’ అని అడిగితే నోరూరించేలా ఆమె చెప్పిన మాటలు ఏమిటో తెలుసా?

ప్రధాని మోదీ ఇష్టపడే వంటకం ఏమిటో తెలుసా? కిచిడి. ఆయన గుజరాతీ కాబట్టి ‘ఢోక్లా’ అంటే కూడా చాలా ఇష్టం. శనగపిండి, మజ్జిగ కలిపి చేసే ‘ఖాండ్వీ’ ఉంటే మరో ముద్ద ఎక్కువ తింటారు. ఈ మూడూ  మామిడి పచ్చడి, శ్రీఖండ్‌ ఉంటే సరేసరి. అయితే ఈసారి ఆయనను సంతోషపెట్టే వంటకాలు వేరే ఉన్నాయి. అవి అచ్చు తెలంగాణ వంటకాలు. తెలుగు వంటకాలు. హైదరాబాద్‌ పర్యటనకు హాజరవుతున్న మోదీ ‘స్థానిక వంటకాలు తింటాను’ అని  చెప్పినందున సిద్ధమవుతున్నాయి. అయితే వీటిని వండుతున్నది ఫైవ్‌స్టార్‌ హోటళ్ల చెఫ్‌లు కాదు. కరీంనగర్‌ పల్లె నుంచి ఇంతింతై ఎదిగిన గొప్ప వంటకత్తె గూళ్ల యాదమ్మ. ఆమెతో ‘సాక్షి’ మాట్లాడింది.

గంగవాయిలి కూర... ఆలుగడ్డ వేపుడు
‘మోదీ గారికి ఏం వండాలో చివరి నిమిషంలో చెప్తామన్నారు. కాని తెలంగాణ రుచి తెలియాలంటే ఏం వండాలో మనసులో అనుకున్నా.  ముద్దపప్పు, గంగవాయిలి కూర, పప్పు చారు, పుంటికూర, ఆలుగడ్డ వేపుడు, పచ్చి పులుసు చేద్దామనుకుంటున్నా’ అంది గూళ్ల యాదమ్మ. వీటితో పాటు సకినాలు, సర్వపిండి, అరిసెలు, భక్ష్యాలు, పాయసం, పప్పుగారెలు యాదమ్మ లిస్ట్‌లో ఉన్నాయి. ‘ఇంతకాలం 20 వేలు, 50 వేల మందికి వంట చేశాను.135 కోట్ల మందికి ప్రధాని అయిన మోదీకి చేస్తానని ఏనాడూ అనుకోలేదు. ఒక రకంగా దేశ ప్రజలందరికీ వంట చేసినట్లుగానే భావిస్తున్నా’ అంది యాదమ్మ.

జీవితం చెదిరినా రుచి కుదిరింది
‘మా స్వగ్రామం సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్‌ మండలం గౌరవెల్లి. అత్తవారు పక్కనే కొండాపూర్‌. పదిహేనేళ్లకు పెళ్లయితే కొడుకు పుట్టిన మూడు నెలలకు నా భర్త చంద్రయ్య పనిలో మట్టిపెళ్లెలు కూలి మరణించాడు. బతుకు చెదిరిపోయింది. అత్తగారి ఇంట నరకం మొదలయ్యింది. నేనూ నా కొడుకు బతకాలంటే నా కాళ్ల మీద  నిలబడాలనుకున్నాను. 1993లో కొండాపూర్‌లో తెల్లవారుజామున 4 గంటలకు భుజాన మూడు నెలల పసిగుడ్డును వేసుకుని బస్టాప్‌కు వచ్చి కరీంనగర్‌ బస్సెక్కా.

కొన్నాళ్లు స్కూల్‌ ఆయాగా పని చేశా. ఆ తర్వాత నా గురువు వెంకన్న వద్ద పనికి కుదరడం నా జీవితాన్ని మార్చివేసింది. ఆయన రోజుకు 15 రూపాయలు కూలీ ఇచ్చేవాడు. ఆ దశ నుంచి లక్షల రూపాయల కాంట్రాక్టుతో వేల మందికి భోజనం పెట్టే స్థాయికి ఎదిగాను’ అంది యాదమ్మ. నిజానికి భారీ వంటలంటే మగవారే సమర్థంగా చేయగలరు అనే స్థిర అభిప్రాయం ఉంది. కాని యాదమ్మ వేల మందికి అలవోకగా వండుతూ పెద్ద పెద్ద వంట మాస్టర్లను చకితులను చేస్తోంది. ఇది సామాన్యమైన విజయం కాదు.

నాటుకోడి... నల్ల మాంసం
‘నేను తెలంగాణ నాన్‌వెజ్‌ కూడా బాగా చేస్తాను. అవే నాకు పేరు తెచ్చాయి. మటన్, చికెన్, నాటుకోడి, బిర్యానీ, నల్ల మాంసం, బోటీ, చేపల పులుసు, చైనీస్, ఇండియన్  అన్ని వెరైటీలు చేస్తాను.అయితే పని వస్తేనే సరిపోదు.క్రమశిక్షణ ఉండాలి. 25 ఏళ్ల కింద కరీంనగర్‌ పట్టణంలో స్కూటీ నడిపే ఐదారుగురు మహిళల్లో నేను ఒకదాన్ని. టైంకు ఫంక్షన్లకు వెళ్లాలని పట్టుబట్టి మరీ స్కూటీ నేర్చుకున్నా. మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ బండి సంజయ్‌లు బాగా ప్రోత్సహిస్తారు. వారి ఇంట్లో, రాజకీయ పార్టీలకు నాదే వంట. కాలేజీ ఫంక్షన్ల నుంచి రాజకీయ సభల దాకా 20 వేల మందికి ఇట్టే వండిపెడతా.ఈ రోజు నా వద్ద 30 మంది స్త్రీలకు ఉపాధి కల్పిస్తున్నా, నా దగ్గర పని నేర్చుకున్న స్త్రీలు ఎందరో వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడ్డారు క్యాటరింగ్‌ చేసుకుంటూ’ అందామె.

వేములవాడ నుంచి పుష్కరాల దాకా
‘కష్టపడుతూ నిజాయతీగా ఉంటే దేవుడు అవకాశాలు తానే ఇస్తాడు. అలాగే నాకూ ఇస్తున్నాడు. ఏటా శివరాత్రి ఉత్సవాలకు దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడలో భక్తులకు వండి పెట్టే భాగ్యం దక్కింది. అలాగే కొండగట్టు హనుమాన్  జయంతి వేడుకలకు కూడా పిలుస్తారు. గోదావరి పుష్కరాలకు కూడా వండాను.  ముఖ్యమంత్రి కేసీఆర్‌ అత్తవారింట్లోనే 25 ఏళ్లుగా వంటలు చేస్తున్నాను. సీఎం గారిని చాలాసార్లు చూశాను. ఆయన నా వంటలు రుచి చూశారు. కానీ ఏనాడూ మాట్లాడే అవకాశం దక్కలేదు. ఆయన కుమారుడు కేటీఆర్‌ మూడు సభలకు వండిపెట్టాను. అందులో అసెంబ్లీ ఎన్నికలకి ముందు తరవాత 50 వేల మందికి వండాను. ఇటీవల తీగల బ్రిడ్జి శంకుస్థాపన సమయంలోనూ 20 వేల మందికి వంట చేశాను. నా వంటలు బాగున్నాయని కేటీఆర్‌ కితాబిచ్చారు’ అందామె.

ఇంటికి పెద్దకొడుకయ్యా
‘నాకు ఇద్దరు తమ్ముళ్లు, ఇద్దరు చెల్లెళ్లు. మా నాన్న అనారోగ్యంతో చనిపోతూ చిన్న చెల్లె, తమ్ముడు బాధ్యతలను నాకు అప్పగించారు.  తమ్ముడిని నా దగ్గరే ఉంచి చదివించి వాడి పెళ్లి చేశాను. చెల్లి పెళ్లిలోనూ నాకు చేతనైనంత సాయపడ్డా. మొన్న ఊళ్లో అమ్మవారి గుడిలో విగ్రహం పెట్టించి, వెండి కిరీటం చేయించా. ఊరంతా కదలివచ్చి అభినందించింది. అంతేకాదు, నాకు ఊరి నుంచి రావాల్సిన మూడున్నర ఎకరాల భూమిని నా కొడుకు వెంకటేశ్‌ పేరిట ఊరంతా ఒక్కటై చేయించింది’ అందామె.

ఒంటరి మహిళలకు భయం వద్దు
‘ఏ కారణం చేతనైనా సమాజంలో మహిళలు ఒంటరిగా బతకాల్సి వస్తే అస్సలు భయపడవద్దు. కష్టపడి చేసే ఏ పనైనా బెరుకు, భయం వద్దు. నిజాయతీగా చేస్తే తప్పకుండా ఎదుగుదల ఉంటుంది. ఆ నిజాయతీ మీకు, మీ పనికి తప్పకుండా గుర్తింపు తీసుకువస్తాయి. ఏనాడూ ఆడిన మాట తప్పకూడదు. అలా చేస్తే మార్కెట్‌లో, సమాజంలో పలుచనైపోతాం. నేను లక్ష రూపాయల వంటకు ఆర్డర్‌ తీసుకున్నాక అదేరోజు పని చేయాలంటూ కోటి రూపాయల ఆర్డర్‌ వచ్చినా తీసుకోను. మాటంటే మాటే.ఆ నిజాయితీ ఉంటే తప్పకుండా పైకి రావచ్చు’ అందామె.
యాదమ్మను మెచ్చుకోకుండా ఎలా ఉండగలం?

– భాషబోయిన అనిల్‌కుమార్, సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌
ఫొటోలు: ఏలేటి శైలేందర్‌రెడ్డి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top