కరీంనగర్‌ శిరీష: రూ. 50 లక్షల ‘ఇమ్మన’ ఫెలోషిప్‌! పోషకాహారంపై అధ్యయనానికి గుర్తింపు

Karimnagar Shireesha: IMMANA Fellowship Her Inspiring Journey - Sakshi

పోషకాహారంపై అధ్యయనానికి గుర్తింపు 

గ్రామీణ–పట్టణ కుటుంబాల్లో పోషకాహార లేమి ఏ విధంగా ఉందో మూలాల నుంచి క్షుణ్ణంగా అధ్యయనం చేసిన కరీంనగర్‌ వాసి శిరీష జునుతులకు ఇన్నోవేటివ్‌ మెథడ్స్‌ అండ్‌ మెట్రిక్స్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ అండ్‌ న్యూట్రిషన్‌ ఆక్షన్స్‌ (ఇమ్మన)నుంచి యాభై లక్షల రూపాయల ఫెలోషిప్‌ లభించింది.

ప్రపంచవ్యాప్తంగా ఈ ఫెలోషిప్‌ను ఆరుగురు అందుకోగా వారిలో  మన దేశం నుంచి శిరీష ఒక్కరే కావడం విశేషం. ఫెలోషిప్‌ వివరాలతో పాటు అగ్రికల్చర్, ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్‌ విభాగాల్లో తను చేస్తున్న కృషి గురించి వివరించింది శిరీష. 

‘‘ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్‌లో పీహెచ్‌డీ చేశాను. మేనేజ్‌లో రెండేళ్లుగా వర్క్‌ చేస్తున్నాను. అర్బన్‌ ఫార్మింగ్, మైక్రో గ్రీన్స్, ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌లో ప్రాజెక్ట్‌ వర్క్‌ పూర్తిచేశాను. ఇప్పుడు ఈ ఫెలోషిప్‌ అగ్రికల్చర్, న్యూట్రిషన్, హెల్త్‌ ఈ మూడు విభాగాల్లో చేసిన ప్రాజెక్ట్‌కి వచ్చింది.

ఇలా వచ్చిన నగదు మొత్తాన్ని ప్రాజెక్ట్‌ వర్క్‌కే వాడతాను. నేను గ్రామీణ, గిరిజన స్థాయిల్లో చేసిన ప్రాజెక్ట్‌ రిజల్ట్‌ని ఇక్రిశాట్‌లో జరిగిన కాన్ఫరెన్స్‌లో ప్రెజెంట్‌ చేశాను. స్వీడన్, మలావిల్లోనూ ఈ విశేషాలు తెలియజేయబోతున్నాను. అంతర్జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తులో ప్రెజెంటేషన్‌కి అవకాశం వచ్చిందంటే దీని ప్రాముఖ్యత ఈ సమయంలో చాలా ఉందని అర్ధమవుతోంది. కష్టమైన టాస్క్‌ అయినప్పటికీ సకాలంలో పూర్తి చేయగలిగానని ఆనందంగా ఉంది. 

గ్రామీణ స్థాయికి వెళ్లాలి...
వ్యవసాయం అనగానే మన జనాభాకు సరిపడా ఆహారోత్పత్తి జరగాలనే ఇన్నాళ్లుగా ఆలోచిస్తున్నాం. ఇప్పటివరకు మన దేశం ఈ విషయంలో రెండవ స్థానంలో ఉంది. పోషకాహారలోపంలో మాత్రం మొదటి స్థానంలో ఉంది. మన దగ్గర చాలా మంది పోషకాహార లేమి సమస్యను ఎదుర్కొంటున్నారు.

వ్యవసాయానికి సంబంధించిన అధికారులకు గైడ్‌లైన్స్‌ ఇవ్వడం వల్ల, వారు సులువుగా ప్రజల్లోకి తీసుకెళతారు. ఈ అధికారులు చెప్పడం వల్ల దీని ప్రభావం కూడా బాగుంటుంది. ఏ సాగు చేయాలి, ఎలాంటి పంటలు వేయాలి, కుటుంబాన్ని బట్టి, వారి పోషకాహార స్థాయులను బట్టి దిగుబడి చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయాల మీద ఇంకా సరైన అవగాహన రావాల్సి ఉంది. దీనివల్ల రక్తహీనత, పోషకాహారం లేమి వంటివి తగ్గించవచ్చు. 

గిరిజనుల ఆహారం
అంగన్‌వాడీలు, సెల్ఫ్‌ హెల్ప్‌ గ్రూప్స్‌ ద్వారా గ్రామీణ మహిళల కుటుంబాల పోషకాహార స్థాయిలు ఎలా ఉన్నాయి.. అనే దానిమీద స్టడీ చేశాను. మిల్లెట్స్‌ని ఆహారంగా తీసుకోవడం ఇటీవల పట్టణాల్లోనూ పెరిగింది. అయితే, గిరిజనులు ఎప్పటి నుంచో వీటిని తీసుకుంటున్నారు.

దీనివల్ల వారి రోగనిరోధకశక్తి పట్టణాల్లో వారికన్నా మెరుగ్గా ఉంది. ఈ విషయాన్ని నేరుగా తెలుసుకోవడానికి తెలంగాణలోని గిరిజనుల కుటుంబాలను కలుసుకొని స్టడీ చేశాను. రాగి అంబలి, జొన్నరొట్టె, ఆకుకూరలు వారి ఆహారంలో ప్రధానంగా ఉంటాయి. అదే గ్రామాల్లో అయితే అవగాహన తక్కువే. ఈ విషయంగా అవగాహన సదస్సులు జరగాల్సిన అవసరం ఉంది. మార్పు తీసుకురావడానికి  అందరి కృషి అవసరం’’ అని వివరించింది శిరీష.

అవగాహన ముఖ్యం: శిరీష
మాది కరీంనగర్‌ జిల్లా, బొంతుపల్లి గ్రామం. వ్యవసాయం కుటుంబం. బిఎస్సీ హోమ్‌సైన్స్‌ చేశాక ఎమ్మెస్సీకి ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్‌ను ఎంచుకున్నాను. ఆ తర్వాత పీహెచ్‌డి చేస్తున్నప్పుడే ఎన్‌ఐఆర్‌డిలో జరిగిన మీటింగ్‌లో ఈ ఫెలోషిప్‌కి అప్లయ్‌ చేసుకోవచ్చు అని తెలిసి అప్లయ్‌ చేశాను. దాదాపుగా నా చదువు అంతా ఫెలోషిప్స్‌తోనే గడిచింది. మా అన్నయ్య ఇచ్చే గైడ్‌లైన్స్‌ కూడా బాగా సహాయపడ్డాయి. 
 – నిర్మలారెడ్డి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top