
హైదరాబాద్: తన చుట్టూ ఏం జరుగుతుందో తెలియని పసితనం.. తానేం చేస్తున్నాడో తెలియని అమాయకత్వం.. ఆత్మహత్య చేసు కున్న కన్నతల్లికి అమ్మమ్మతో కలిసి తలకొరివి పెడుతూ నాలుగేళ్ల బాలుడు పలికిన మాటలు అక్కడున్నవారి గుండెలను మెలి పెట్టాయి. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్‌లో శ్రావ్య (27) మంగళవారం ఆత్మహత్య చేసుకుంది. ఆమె అంత్యక్రియలు బుధవారం జరిగాయి. తల్లి చితికి కుమారుడు శ్రేయాన్స్ నందన్ (4) తన అమ్మమ్మతో కలిసి నిప్పు పెట్టాడు.
చితి చుట్టూ తిరుగుతున్న క్రమంలో నీటి కుండను పగులగొట్టారు. రెండోసారి కుండకు రంధ్రం చేస్తున్న సమయంలో అమ్మమ్మతో ‘అమ్మా.. కుండ పగిలింది ఇంటికి పోదాం’అని బాలుడు చెప్పిన మాటలు అంత్యక్రియల్లో పాల్గొన్నవారిని కన్నీరు పెట్టించాయి. శ్రావ్య ఆత్మహత్యకు భర్త ధర్మతేజ్ పరోక్షంగా కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ధర్మతేజ్‌తోపాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు.