17 ఏళ్లకే ఏడు పర్వతాలను అధిరోహించింది..! మన్‌కీ బాత్‌లో సైతం.. | Kaamya Karthikeyan Becomes Youngest Girl To Scale Seven Highest Peaks In The World, Interesting Facts About Her In Telugu | Sakshi
Sakshi News home page

కామ్య... అఖండ ఖ్యాతి..! 17 ఏళ్లకే ఏడు పర్వతాలను అధిరోహించింది..!

Jan 24 2025 10:45 AM | Updated on Jan 24 2025 11:04 AM

Kaamya Karthikeyan Becomes Youngest Girl To Scale Seven Highest Peaks In The World

ప్రయాణ ప్రేమికుడు, ప్రఖ్యాత పర్వతారోహకుడు సర్‌ మార్టిన్‌ కాన్వే ‘అధిరోహించిన ప్రతి శిఖరం ఏదో ఒకటి నేర్పుతుంది’ అంటారు. అలా చిన్న వయసులోనే ఎన్నో శిఖరాల ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకుంది విశాఖపట్నానికి చెందిన కామ్య కార్తికేయన్‌. పదహారేళ్లకే ఎవరెస్ట్‌ అధిరోహించి రికార్డ్‌ సృష్టించింది. తాజాగా అంటార్కిటికాలోని మౌంట్‌ విన్సన్‌ని అధిరోహించి సెవెన్‌ సమ్మిట్స్‌ పూర్తి చేసిన యంగెస్ట్‌ ఫిమేల్‌గా రికార్డు సృష్టించింది....

ఇలా మొదలైంది...
కార్తికేయన్, లావణ్య దంపతులకు సాహస యాత్రలు ఇష్టం. తమ చిన్నారి కామ్యను భుజాలపై మోసుకుంటూనే ట్రెక్కింగ్‌కు వెళుతుండేవారు. అలా పర్వత శిఖరాలతో చిన్నవయసులోనే కామ్యకు పరిచయం అయింది. మూడేళ్ల వయసులోనే ముంబైలోని లోనావాలాలో తండ్రితోపాటు ట్రెక్కింగ్‌లో పాల్గొని ‘శభాష్‌’ అనిపించుకుంది. మహారాష్ట్రలోని డ్యూక్స్‌ నోస్, రాజ్‌గడ్‌ పర్వతాల్ని నాలుగేళ్ల వయసులో తల్లిదండ్రులతో పాటు అధిరోహించింది.

తల్లికి తగిన తనయ...
హిమాలయాల ట్రెక్కింగ్‌కు తల్లితోపాటు వెళ్లింది కామ్య. అప్పుడు ఆమె వయసు ఏడేళ్లు. తల్లీ కూతుళ్లు  మొదటి ప్రయత్నంలోనే 12 వేల అడుగుల ఎత్తైన చంద్రశీల పర్వతారోహణ చేశారు. ఆ తర్వాత హిమాలయ పర్వత శ్రేణుల్లో ఒకటైన 13,500 అడుగుల ఎత్తైన హర్‌కిదమ్‌ యాత్రను విజయవంతంగా పూర్తి చేశారు. అది పూర్తి చేసిన కొద్ది రోజుల్లోనే 13,500 అడుగుల ఎత్తైన కేదార్‌కంఠ పర్వతారోహణ చేశారు. తొమ్మిదేళ్ల వయసులో హిమాలయాల్లో  రూప్‌కుండ్‌ ట్రెక్కింగ్‌ చేసి రికార్డు సృష్టించింది కామ్య.

ప్రధాని మన్‌ కీ బాత్‌లో కామ్య...
‘అవరోధాల్ని అధిగమించి మన ఖ్యాతిని ఖండాంతరాల్లో ఇనుమడింపజేయాలి అనుకునేవారికి విశాఖ నగరానికి చెందిన కామ్య కార్తికేయన్‌  అనే చిన్నారి స్ఫూర్తినిచ్చింది’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ కామ్యను ప్రశంసించారు. దక్షిణ అమెరికాలోని అత్యంత ఎత్తైన అకాన్కాగువా పర్వతాన్ని అధిరోహించిన సమయంలో మన్‌ కీ బాత్‌లో కామ్య ప్రస్తావన తీసుకువచ్చారు మోదీ.

ఏడు ఖండాల్లో ఎన్ని రికార్డ్‌లో!
దక్షిణ అమెరికాలో 22,837 అడుగుల ఎత్తైన మౌంట్‌ అకాన్‌కాగువాని అధిరోహించి ఈ శిఖరాన్ని అధిరోహించిన తొలి బాలికగా ప్రపంచ రికార్డు సృష్టించింది. ఆఫ్రికా ఖండంలో అత్యంత ఎత్తైన 18,652 అడుగుల మౌంట్‌ కిలిమంజారోపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించి ఈ శిఖర యాత్ర పూర్తి చేయించడం ద్వారా ఆసియాలోనే అతి పిన్న వయస్కురాలిగా రికార్డు. 

యూరప్‌ ఖండంలోని అత్యంత ఎత్తైన 18,510 అడుగుల మౌంట్‌ ఎల్‌బ్రస్‌ని అధిరోహించి యంగెస్ట్‌ గర్ల్‌ ఇన్‌ ది వరల్డ్‌గా రికార్డు ఆస్ట్రేలియా ఖండంలోని అతి ఎత్తైన మౌంట్‌ కాజియాస్కోని అధిరోహించిన రెండో బాలికగా రికార్డు 

ఉత్తర అమెరికాలోని 20,308 అడుగుల మౌంట్‌ డెనలీని అధిరోహించిన యంగెస్ట్‌ నాన్‌ అమెరికన్‌గా  రికార్డు. ఆసియా ఖండంలో అత్యంత ఎత్తైన 29,031 అడుగుల మౌంట్‌ ఎవరెస్ట్‌ని అధిరోహించి నేపాల్‌ వైపు నుంచి ఎవరెస్ట్‌ని అధిరోహించి ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలిగా,  తాజాగా అంటార్కిటికాలోని మౌంట్‌ విన్సన్‌ని అధిరోహించి, ప్రపంచంలోనే అతి పిన్నవయస్కురాలిగా రికార్డ్‌ సృష్టించింది.

 ఆల్‌ రౌండర్‌
ముంబై నేవీ స్కూల్‌లో ప్లస్‌టు చదువుతున్న కామ్య కార్తికేయన్‌  పర్వతారోహణలోనే కాదు చదువులోనూ ప్రతిభ కనబరుస్తోంది. ప్రతి పరీక్షలోనూ ఫస్ట్‌ గ్రేడ్‌ సాధిస్తోంది. సంగీతంలోనూ ప్రావీణ్యం పొందిన కామ్య పియానో వాయిద్యానికి సంబంధించి 3 గ్రేడులు పాసైంది. కర్ణాటక సంగీతం,  భరతనాట్యంలోనూ ‘ఆహా’ అనిపించేలా ప్రతిభ చూపుతోంది. 

ప్రతి అడుగూ సవాల్‌గా స్వీకరించాను
సెవెన్‌ సమ్మిట్స్‌ పూర్తి చేసి భారత త్రివర్ణపతాకాన్ని ఏడు ఖండాల్లోనూ రెపరెపలాడించాలన్నదే అమ్మా నాన్నల కల. వారి ఆకాంక్ష నెరవేర్చినందుకు గర్వంగా ఉంది. ఒకానొక సమయంలో మా పేరెంట్స్‌ తమ సంపాదనంతా నా మీదే ఖర్చు చేశారు. కొందరు దాతలు సహకారం అందించి నన్ను ముందుకు నడిపించారు. ఎంతటి కష్టాన్నైనా అవలీలగా ఎదుర్కోవాలన్నది నాన్న దగ్గర నేర్చుకున్నాను.                        
– కామ్య కార్తికేయన్‌ 

(చదవండి: మహాకుంభమేళాలో ఆకర్షణగా మరో వింత బాబా..ఏకంగా తలపైనే పంటలు..!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement