
మన దేశంలో రామాయణం తెలియని వారూ వానకు తడవని వారూ ఉండరు. సీతారాముల కథ రామాయణంగా వేల సంవత్సరాలుగా జనంలో ఉంది. రాముడు ఎందుకు దేవుడయ్యాడంటే రావణాసురుడనే రాక్షసుణ్ణి ఓడించాడు కాబట్టి. మీకు రామాయణం పై అవగాహన ఉండాలి. చదవడం ద్వారానే కాకుండా సినిమాలు చూడటం ద్వారా కూడా రామాయణం తెలుసుకోవచ్చు. తెలుగులో ఎన్నో మంచి సినిమాలు రామాయణంపై వచ్చాయి. అవి...
రాముడిలో ఎన్నో గొప్ప లక్షణాలు ఉన్నాయి. ఆయన పితృవాక్య పరిపాలకుడు. అంటే తండ్రి చెప్పే మాట జవదాటడు. మన కన్నతండ్రిని గౌరవించే పద్ధతి అది. మీరు మీ నాన్న మాట వినకపోతే అది రాముడి మార్గం కాదు. అలాగే రాముడికి తన సోదరులంటే ఎంతో ఇష్టం. లక్ష్మణుడు, భరతుడు, శతృఘ్నుడు... ఈ ముగ్గురిని ఎంతో అభిమానించాడు. భార్య సీతను ఎంతో గౌరవించాడు, ప్రేమించాడు. దుర్మార్గుడైన రావణాసురుడు ఆమెను ఎత్తుకొని పోతే సీత కోసం నిద్రాహారాలు మాని అన్వేషించాడు. అలాగే హనుమంతుడు వంటి బంటును ఎంతో ఆదరించాడు.
రాముడు వీరుడు. శూరుడు. ప్రజలను గొప్పగా పాలించి ‘రామరాజ్యం చల్లని రాజ్యం’ అనిపించుకున్నాడు. ఇంకా రామాయణం చదివినా, చూసినా ఎన్నో గొప్ప విషయాలు తెలుస్తాయి. మీరు ఆ సినిమాలు చూడండి... సెలవులు మరికొన్ని రోజులే ఉన్నాయి. అందుకే రోజుకు ఒక రామాయణం సినిమా చూడండి. మీకు భాష తెలియకపోయినా, పాత్రలు తెలియకపోయినా అమ్మనో, నాన్ననో, అమ్మమ్మనో అడగండి. ఈ సినిమాలన్నీ యూట్యూబ్‌లో ఉన్నాయి.
1. సీతారామ కల్యాణం:
ఇది 1961లో వచ్చిన సినిమా. ఇందులో ‘శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి’ అనే గొప్ప పాట ఉంది. సీతా రాముల కల్యాణం, తర్వాత రావణాసురుడి ప్రవేశం అన్నీ మీరు చూడొచ్చు. ఆనాటి నటీనటులను తెలుసుకోవచ్చు. భాషను గమనించవచ్చు.
2. లవకుశ:
ఈ సినిమా తప్పక చూడాలి. తెలుగు వారందరూ ఈ సినిమా చూస్తారు. సీతారాములకు లవకుశులనే కుమారులు ఉన్నారని తెలుసు కదా. వారి గురించిన కథ ఇది. సీతమ్మ వాల్మీకి ఆశ్రమంలో ఉండి లవకుశులకు జన్మనివ్వగా వారు తమ తండ్రి అయిన రాముణ్ణి ఎలా చేరుకున్నారో ఈ సినిమాలో చూడొచ్చు. వాల్మీకిగా నటించిన నటుడి పేరు నాగయ్య గారు. ఆయన ఎంత చక్కగా నటిస్తారో, మాట్లాడతారో గమనించండి. అలాగే కుశ లవులుగా నటించిన బాల నటులను చూడండి. ఈ సినిమాలో ఎన్నో మంచి పాటలు ఉన్నాయి. వాటిని నేర్చుకొని పాడొచ్చు.
3. సంపూర్ణ రామాయణం:
పిల్లలూ... బాపు అనే దర్శకుడు 1972లో తీసిన సినిమా ఇది. రామాయణ గాథలు అనేకం ప్రచారంలో ఉన్నాయి. వాటి ఆధారంగా మనవారు సినిమాలు తీస్తుంటారు. అయితే ఈ సినిమా మాత్రం వాల్మీకి రామాయణాన్ని ప్రొమాణికంగా తీసుకుని అందులోని ఆరు కాండలను చూపుతుంది. అంటే వాల్మీకి రామాయణంగా రాసింది ఏమిటో తెలియాలంటే ఈ సినిమా చూస్తే సరిపోతుందన్న మాట. తప్పక చూడండి.
4. శ్రీరామ పట్టాభిషేకం:
రామాయణ గాథను ముఖ్య కాండలతో చూపిన మరో సినిమా ఇది. ఇందులో అయోధ్య కాండ, కిష్కింధ కాండ, సుందర కాండ, యుద్ధ కాండలను సమగ్రంగా చూపించారు. వనవాసంలో ఉన్న సీతారాముల వద్దకు మాయలేడిని పంపి రాముడు దాని కోసం వెళ్లగా ఒంటరిగా ఉన్న సీతను రావణుడు అపహరించుకునే ఘట్టం ఈ సినిమాలో మీరు చూడొచ్చు.
5. రామాయణం:
రామాయణ సినిమాల్లో పెద్దవాళ్లు పాత్రల్ని ధరిస్తారు. కాని అందరూ పిల్లలే రామాయణ పాత్రలు ధరిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో వచ్చినదే ‘రామాయణం’. ఇప్పుడు జూ.ఎన్టీఆర్‌గా మీ అందరికీ తెలిసిన తారక్ ఈ సినిమాలో రాముడిగా నటించాడు. గుణశేఖర్ దర్శకత్వం వహించగా ఎం.ఎస్.రెడ్డి నిర్మించారు. రామాయణం పూర్తి కథ ఈ సినిమాలో ఉంది. 1997లో ఈ సినిమా వచ్చింది.
6. శ్రీ రామరాజ్యం:
లవ–కుశుల కథపై వచ్చిన మరో సినిమా ఇది. ఇందులో వాల్మీకిగా అక్కినేని నాగేశ్వరరావు గారు నటించడం విశేషం. ఇది కూడా దర్శకుడు బాపు తీసినదే. ఇందులో ‘జగదానంద కారకా’ అనే మంచి పాట ఉంది.
ఇవే కాదు... ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్‘ కూడా రామాయణం మీదే. ఇప్పుడు మళ్లీ రామాయణం మీద భారీ సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి. రణబీర్ కపూర్, సాయి పల్లవి సీతారాములుగా ఒక సినిమా నిర్మాణంలో ఉంది. సూర్యచంద్రులు ఉన్నంత కాలం రామాయణం పై పుస్తకాలు, సినిమాలు వస్తూనే ఉంటాయి. ఆ కథను మీరు ఎన్నిసార్లు తెలుసుకున్నా మరోసారి తెలుసుకుంటూనే ఉంటారు. అదీ దాని మహత్తు.