మనవాళ్లతో ఉండటమే అసలైన ఇంటీరియర్‌ డిజైన్‌..! యువరాజ్‌ సింగ్‌ | Inside Yuvraj Singh's mountain facing Chandigarh home | Sakshi
Sakshi News home page

యువరాజ్‌ సింగ్‌ లగ్జరీ ఇల్లు.. అసలైన ఇంటీరియర్‌ డిజైన్‌ అదే అంటున్న యువీ!

Jul 24 2025 2:36 PM | Updated on Jul 24 2025 3:54 PM

Inside Yuvraj Singh's mountain facing Chandigarh home

పెద్ద పెద్ద స్టార్‌లు, సెలబ్రిటీల ఇళ్లు ఎలా ఉంటాయో తెలిసిందే. కోట్లు ఖరీదు చేసే ఆ లగ్జరీ ఇళ్లు కళ్లు చెదిరే హంగులతో అత్యంత ఆర్భాటంగా ఉంటాయి. కొందరు కళలకు నిలయంలా, మరికొందరు పచ్చదనానికి పెద్దపీట వేసేలా తీర్చిదిద్దుకుంటారు. అది సహజం. కానీ ఈ సార్ట్‌ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ మాత్రం ఇంటీరియర్‌ డిజైన్‌కి అసలైన అర్థం ఇచ్చేలా ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఆయన కలల సౌధం చూస్తే..ఇది కదా ఇల్లంటే అని అంటారు.

చండీగఢ్‌లో యువరాజ్‌ అందమైన ఇల్లు కొలువుదీరి ఉంది. ఆయన తన ఇంటిని క్రీడా స్ఫూర్తికి, అచంచలమైన ప్రేమకు నిలయంగా అద్బుతంగా తీర్చిదిద్దుకున్నాడు. సూర్యకాంతి ఇంటిలోపలకి ప్రవేశించేలా పూర్తి వెంటిలేషన్‌తో ఉంటుంది. కేవలం విలాసవంతమైన ఫర్నీచర్‌, లగ్జరీ వస్తువుల నిలయంగా కాదు. కుటుంబ విలువలకు, ఇంటి ఉండే ప్రతి ఒక్కరి అభిప్రాయానికి విలువ ఇచ్చేలా తీర్చిదిద్దుకున్నారు యువరాజ్‌. ఆ విషయాన్ని స్వయంగా యువరాజ్‌సింగే ఒక ఇంటర్వ్యూలో షేర్‌ చేసుకున్నారు. ఇల్లు అంటే ఎంత ఖరీదైనది..అందులో ఎంత డబ్బు పెట్టి ఇంటీరియర్‌ డిజైన్‌ చేశామన్నది కాదు. మన వాళ్లతో అంటే.. తల్లి, భార్య..ఇలా అందరూ కలిసి ఉండగలిగే అదృష్టం దొరకడమే అంటున్నారు. 

ఇంటిని అమ్మకు, భార్యకు సెపరేట్‌ అంతస్థులు కేటాయించి.. వారికి నచ్చినట్లు అందంగా డిజైన్‌ చేయడం కాదు. అందరం ఒకే చోట కలిసి ఉంటూ..అందరి అభిప్రాయంతో నిర్మించుకుంటే..అది అత్యంత విలువైనది అంటూ కుటుంబ విలువల గురించి ఈ జనరేషన్‌ తెలుసుకునేలా అద్భుతంగా చెప్పాడు. ఎంత పెద్ద ఇల్లు కట్టినా..అది ఖాళీగా ఉంటే నిరుపయోగమే అని చెబుతున్నాడు యూవీ. 

అలాంటి ఇంటిలో ఉన్నా.. లేకపోయినా ఒకటేనని, కుటుంబమే మన ఇల్లు అనే విషయం మరవకండి అంటూ అనుబంధాల ప్రాముఖ్యత గురించి హైలెట్‌ చేశాడు యూవీ. ప్రతి ఒక్కరికి డ్రీమ్‌ హౌస్‌ కట్టుకోవాలనే కోరిక ఉంటుంది. అది మన కుటుంబ సభ్యులందరితో ఉండగలిగేలా నిర్మించుకున్నప్పుడే అది మరింత అందంగా కనిపిస్తుందని చెబుతున్నాడు. ఇల్లు అనేది మన బాల్యపు జ్ఞాపకాలు, మన వివాహం, పిల్లల జననం వరకు ప్రతిది కళ్లముందు మెదిలాడేలా చేసే జ్ఞాపకాల మూటగా అభివర్ణించాడు. 

జ్ఞాపకాలు పదిలంగా ఉండేలా..
ఇక తన రోజుని టేబుల్‌టెన్నిస్‌తో ప్రారంభిస్తాడట, అందుకే ఆ ఆట తన ఇంటి ప్రాంగంణంలో ఉంటుందని చెబుతున్నాడు. ఆ స్పూకర్‌ టేబుల్‌ తన బాల్యాన్ని గుర్తు చేస్తుందట. అలాగే ఫిట్‌నెస్‌ కోసం జిమ్‌..ఇది తన ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వమని గుర్తుచేస్తుందట. ఇక ఆయన ఇంటిలోని వాల్‌ ఆఫ్‌ ఫ్రేమ్‌గా ఆరు సిక్సెల బ్యాట్‌ ఉంటుంది. ఇది తాను కేన్సర్‌ని ఓడించి ఎలా 150 పరుగుల స్కోరు సాధించానో గుర్తుచేస్తుందట. పైగా అది తనకు అత్యంత ప్రత్యేకమైన జ్ఞాపకమని అ‍ంటున్నాడు యువరాజ్‌ సింగ్‌. 

"కుంగదీసే వ్యాధిని జయించేందుకు ధైర్యం ఒక్కటే ఆయుధం. అది ఉంటే ఏది మనల్ని విచ్ఛిన్నం చేయలేదు. అదే నేను విశ్వసిస్తా. ఆ చేదు ఘటన తాలుకా జ్ఞాపకం తనలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుందని సగర్వంగా చెబుతున్నాడు". యువరాజ్‌ సింగ్‌. అందమైన పర్వతాల మధ్య ఉన్న తన ఇల్లు, చుట్టూ ఉన్న వ్యూ తనకు అత్యంత ఇష్టమైన టూరిస్ట్‌ స్పాట్‌గా పేర్కొన్నాడు. 

చివరగా ఇంటికి ఎలాంటి రంగులూ, ఎంత ఖరీదైన సీలింగ్‌లు, ఫర్నీచర్‌లు పెట్టించామన్నది కాదు..భార్య, పిల్లలు, తల్లితో కలిసి నివశించగలగడం..వారి ఇష్టంతో ఇల్లు అందంగా రూపుదిద్దుకోవడమేనని అంటున్నాడు. అలాంటి ఇంటిలో ఉండే ఏ భర్త/కొడుకు సదా అదృష్టమంతుడే అంటూ ఇల్లు అనే పదానికి అసలైన అర్థం చెప్పాడు ఈ స్టార్‌ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌. కాగా, యూవీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ ఆఫ్‌ లెజెండ్స్‌ అనే టీ20 టోర్నమెంట్లో ఆడుతున్నాడు.

(చదవండి: పనస పండు ఎంత పనిచేసింది..? బ్రిత్‌ అనలైజర్‌ రీడింగ్‌నే ఫూల్‌ చేసిందగా..!)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement