ఈ టాగ్‌తో నోరులేని జీవాలు సేఫ్‌!

This Hyderabad NGO Tags Stray Dogs With Fluorescent Collars To Avoid Road Accidents - Sakshi

ప్రస్తుతమున్న బిజీ లైఫ్‌లో ముందుకు దూసుకుపోవడమేగానీ.. పక్కవారిని పట్టించుకునే తీరికలేదు. రోడ్డుమీద డ్రైవింగ్‌ చేస్తూ వెళ్తున్నప్పుడు వెనకాముందు చూసుకోకుండా ఎదురుగా వస్తున్న వాహనాలు, నోరులేని జంతువులనూ గుద్దేస్తున్నారు. రోడ్డెక్కిన మనిషికే సేఫ్టిలేని ఈరోజుల్లో.. మూగ జీవాల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. క్రమంగా అడవులు కనుమరుగవుతుండడంతో కాంక్రీట్‌ జంగిల్‌ల్లో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్న మూగ జీవాల పరిస్థితిని అర్థం చేసుకున్న.. చైతన్య గుండ్లూరి.. వినూత్న ఐడియాతో వాటికి రక్షణ కల్పిస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన చైతన్య మూగజీవాల పరిరక్షణకు ఏకంగా ఓ ఎన్జీవోని స్థాపించారు. వేగంగా దూసుకుపోయే వాహనాల మధ్య నలిగి ప్రాణాలు కోల్పోతున్న కుక్కలకు ఫ్లోరోసెంట్‌ ట్యాగ్‌లు, బెల్టులు అమర్చి కాపాడుతున్నారు.

చైతన్య మాట్లాడుతూ..‘‘ నా పనిలో భాగంగా నేను ఎక్కువ సమయం ప్రయాణాలు చేస్తూ ఉంటాను. ఆ సమయంలో పలుమార్లు  వేగంగా దూసుకుపోతున్న వాహనాల కింద పడి జంతువులు చనిపోవడం చూసేవాడిని. అంతేగాకుండా నాకెంతో ఇష్టమైన నా బెస్ట్‌ ఫ్రెండ్‌ ఒక కుక్కను తప్పించబోయి రోడ్డు యాక్సిడెంట్‌లో చనిపోయాడు. ఈ సంఘటన నన్ను ఎంతో కలిచి వేసింది. దీంతో రోడ్డు మీద తిరిగే కుక్కలు వాహనాలకు అడ్డుపడకుండా, ఇంకా అవి బిక్కుబిక్కుమంటూ తిరగకుండా ఉండేందుకు ఏదైనా చేయాలనుకున్నాను. ఇందులో భాగంగానే గతేడాది నవంబర్‌లో ప్లోరోసెంట్‌ ట్యాగ్‌లను కుక్కలు, ఆవులు, గేదెల మెడలో వేయడం ప్రారంభించాం. రాత్రి సమయంల్లో అవి రోడ్ల మీదకు వచ్చినా డ్రైవింగ్‌ చేసేవారికి క్లియర్‌గా కనిపిస్తాయి. దీంతో యాక్సిడెంట్లు అవ్వవు. ఫ్లోరోసెంట్‌ పదార్థంతో తయారైన ఈ ట్యాగ్‌లపై లైట్‌ పడగానే మెరుస్తాయి. దీంతో దూరం నుంచే ఎదురుగా జంతువు ఉన్నట్లు గుర్తించి వాహనం స్పీడు తగ్గించి పక్క నుంచి వెళ్లిపోతారు. దీని వల్ల ఇటు మూగజీవాలకు, అటు వాహనదారులకు ఏ ఇబ్బంది ఉండదు’’ అని చైతన్య చెప్పాడు.  

ప్రస్తుతం చైతన్య ఎన్జీవో ఆరు రాష్ట్రాలో చురుకుగా పనిచేస్తోంది. 36 నగరాల్లో 270 మంది వలంటీర్లు మూగజీవాలను రక్షిస్తున్నారు. రోజుకి దాదాపు 200 కుక్కలకు ట్యాగ్‌లు వేస్తున్నారు. ఇలా రోజూ జంతువులకు ట్యాగ్‌లు, ఫ్లోరోసెంట్‌ బెల్టులు వేయాలంటే భారీసంఖ్యలో అవి అవసరమవుతాయి. అందుకే  గ్రామాల్లోని స్మాల్‌ ఉమెన్‌ ఎంట్రప్రెన్యూర్‌ గ్రూపులతో వీటిని తయారు చేయిస్తూ.. వారికి కూడా ఉపాధి కల్పిస్తున్నారు.  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top