Hula Hoop: ఒక్క హూప్‌తో ఎన్నెన్నో ప్రయోజనాలు, మీరూ ట్రై చేస్తారా?

Hula Hoop: History, Benefits, Fun Way to Burn Calories, Cardiovascular Fitness - Sakshi

కాస్త సీరియస్‌గా ఎక్సర్‌సైజ్‌లు చేసే వాళ్లకు హూలాహూప్‌ గురించి తెలిసే ఉంటుంది. హూలాహూప్‌ అంటే రబ్బర్‌ లేదా స్టిఫ్‌ గ్రాస్‌ లేదా తేలికపాటి కొయ్యతో తయారైన ఒక పెద్ద రౌండ్‌ చక్రం. దీన్ని నడుము, పాదాలు లేదా మెడ చుట్టూ తిప్పుతూ బాలెన్స్‌ చేస్తారు. ఇది మనిషి మనుగడలో ఎప్పటినుంచో ఉంది. కానీ ఆధునిక హూలాను 1958లో ఆర్ధర్‌ కనుగొన్నాడు.

పిల్లలు వాడే హూప్‌ వ్యాసం దాదాపు 28 అంగుళాలు, పెద్దలు వాడే దాని వ్యాసం 40 అంగుళాలు ఉంటుంది. హులా హూప్‌ అలవాటు కావటానికి కొంచెం సమయం పడుతుంది కానీ, ఒకసారి హులా హూప్‌ చేయటం ప్రారంభించాక మీ శరీర కండరాలు బలపడి, మంచి శరీర ఆకృతి మీ సొంతం అవుతుంది. హులా హూప్‌ ద్వారా చేతులు, కాళ్ళు, తొడలు, పిరుదులు, ఉదరభాగం, వెన్నుభాగం కూడా మంచి ఆకృతిని సంతరించుకుంటాయి. 

ప్రయోజనాలు...
1 కార్డియో కండరాలకు బలం: హూప్‌తో చేసే ఎక్సర్‌సైజ్‌లు కార్డియో విభాగం కిందకు వస్తాయి. ఇవి గుండె, ఊపిరితిత్తులకు ఆక్సిజన్‌ సరఫరా మెరుగుపరిచేందుకు దోహదం చేస్తాయి. దీనివల్ల గుండెజబ్బులు, డయాబెటిక్స్, కొలెస్ట్రాల్‌ పెరుగుదల లాంటి రిస్కులు తగ్గుతాయి. బ్రెయిన్‌ సెల్స్‌ చురుగ్గా తయారవుతాయి. స్ట్రెస్‌ తగ్గుతుంది. హూప్‌తో ఒక క్రమబద్ధమైన రిధమ్‌ సాధించగలిగితే రక్తప్రసరణ మెరుగవుతుంది, కేలరీ లు కరిగిపోతాయి. 

2 ఆబ్స్‌ కోసం: హులా వ్యాయామం శరీర ఉదరభాగంలోని కండరాలను ప్రభావితం చేస్తుంది. హూప్‌కు అనుగుణం గా మీ శరీరాన్ని తిప్పటం వలన కండరాలు స్ట్రెచ్‌ అవుతాయి. దీంతో బలమైన ఆబ్స్‌ వస్తాయి. నడుము షేప్‌ బాగా రావాలంటే రోజులో కనీసం 5 – 7 నిమిషాల పాటూ 3 సెట్లుగా హులా హూప్‌ వ్యాయామం చేయాలి. ఇందుకు కనీసం పావుగంట సమయం వెచ్చించాలి. 

3 నిస్సత్తువను పారదోలడానికి: హులా హూప్‌ సులభంగా కనపిస్తుంది, కానీ అంత వీజీకాదు. అదే సమయంలో ఇది నేర్చుకోవడం మంచి వినోదాన్నిస్తుంది. దీనిని ఒక వ్యాయామంగా కాకుండా ఒక ఆటగా ఆస్వాదించే వారు ఎక్కువ సమయం పాటూ హులా హూప్‌ చేస్తుంటారు. దీనివల్ల మన ఒంట్లో సత్తువ (స్టామినా) పెరిగి, బద్దకం వదులుతుంది. 

4 పెరిగే ఏకాగ్రత: హులా హూప్‌ చేయటానికి వివిధ కండరాల మధ్య సమన్వయం అవసరం. శరీర కండరాలను సరైన సమయంలో సరైన విధంగా కదపగలిగితేనే హులా హూప్‌ తిరుగుతుంది. ఇందుకు మంచి సాధన అవసరం.  హులా హూప్‌ తిప్పడం మన ఏకాగ్రత స్థాయిలను పెంచుతుంది. 

5 ఖర్చు తక్కువ: దీన్ని ఇంటివద్దే చేసుకోవచ్చు. ఫీజులు కట్టి జిమ్‌లో చేరక్కర్లేదు. క్లాసులకు వెళ్లక్కర్లేదు. జిమ్‌లో మిషన్లు వాడేందుకు వేచిచూడక్కర్లేదు. పైగా దీన్ని ఎక్కడైనా చేసుకోవచ్చు. 


ఎలా? ఎలా?
ముందుగా మీకు తగిన సైజు హూప్‌ను ఎంచుకోండి. ఈ వ్యాయామం విజయవంతం కావాలంటే హూప్‌ సైజ్‌ కరెక్ట్‌గా ఉండడం ముఖ్యం. కొత్తగా ఆరంభించేవాళ్లు కాస్త పెద్ద సైజు హూప్‌ తీసుకోవాలి. అలాగే హూప్‌ వెయిట్‌ మీకు అనుగుణంగా ఉండాలి. మరీ బరువైతే తిప్పలేరు. కొత్తవాళ్లు కనీసం ఒక కేజీ వెయిట్‌ ఉన్న హూప్‌ ఎంచుకోవాలి. హూప్‌ ఆరంభించేముందు నెట్‌లో బిగినర్స్‌ కోసం ఉన్న వీడియోలు శ్రద్ధగా చూడండి. లోకల్‌ జిమ్‌లో గైడ్‌ ఉంటే సాయం తీసుకోండి. బేసిక్స్‌ వచ్చాక తేలికపాటి వర్కవుట్స్‌ ఆరంభించాలి. అనుభవం పెరిగే కొద్దీ సమయం పెంచుకోవచ్చు. ప్రతిరోజూ రెండు మూడు సెట్లు ఒక్కోటి పదినిమిషాలుండేలా చూసుకోండి. 

ఈ జాగ్రత్తలు అవసరం
సరైన పోశ్చర్‌ మెయిన్‌ టెయిన్‌  చేయడం హూప్‌కి అవసరం. హూపింగ్‌ చేసేటప్పుడు వెన్నుముక నిటారుగా ఉండాలి, నడుం దగ్గర ఒంచడం చేయవద్దు. టైట్‌గా ఉండే దుస్తులు వేసుకోవడం వల్ల హూప్‌ గమనానికి అడ్డం రాకుండా ఉంటాయి. వెన్నునొప్పి ఉన్నవాళ్లు తేలికపాటి హూపింగ్‌ చేయాలి. సరైన రీతిలో, సరైన విధంగా చేస్తే హూలా హూప్‌ మీకు మంచి షేప్‌ ఇవ్వడమే కాకుండా స్ట్రెస్‌ రిలీజ్‌ చేస్తుంది.


హూప్‌ డాన్స్‌
నడుం చుట్టూ హూప్‌ను తిప్పుతూ మ్యూజిక్‌కు అనుగుణంగా డాన్స్‌ చేయడమే హూప్‌ డాన్స్‌. ఇది హూపింగ్‌ ఎక్సర్‌సైజ్‌కు తర్వాత స్థాయి. హూలా హూప్‌తో బాగా ప్రాక్టీస్‌ వస్తే హూప్‌డాన్స్‌ సాధ్యమవుతుంది. క్రీ.పూ.1000 సంవత్సరంలో ఈజిప్ట్‌లో ఈ తరహా డాన్స్‌లున్నట్లు చారిత్రక ఆధారాలున్నాయి. ఆధునిక ప్రపంచంలో హూప్‌ డాన్స్‌ బాగా ప్రాచుర్యం పొందింది. ఇందులో నిష్ణాతులు తమను తాము హూపర్స్‌’’ అని పిలుచుకుంటారు.

సాధారణ హూప్‌ మాత్రమే కాకుండా నిప్పు అంటించిన హూప్స్‌తో కూడా కొందరు డాన్స్‌ ప్రదర్శనలు ఇస్తారు. ఇక వీధుల్లో హూప్‌ డాన్స్‌ ప్రదర్శన ఇచ్చేవాళ్లను ‘‘హూప్‌ బస్కర్స్‌’’ అంటారు. ప్రపంచ వ్యాప్తంగా హూపర్స్, హూప్‌ బస్కర్స్‌ కలిసి ప్రపంచ హూప్‌ డాన్స్‌ ఫెస్టివల్, వరల్డ్‌ బస్కర్స్‌ ఫెస్టివల్‌ లాంటివి జరుపుకుంటారు. ఇందులో ప్రపంచ నలుమూలల నుంచి హూపర్స్‌ వచ్చి పాల్గొంటారు. ఇక వీరిలో వీరికి పోటీలు నిర్వహించుకొని టాప్‌ హూపర్స్‌ను గుర్తించేందుకు వరల్డ్‌ హూప్‌ డాన్స్‌ చాంపియన్‌ షిప్‌ పోటీలు సైతం నిర్వహిస్తారు.  
– డి. శాయి ప్రమోద్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top