క్షీరసాగర మథనం-గరళ ఆవిర్భావం | Ksheera Sagara Madhanam Story: Origin of Halahala Poison Explained from Sri Vishnu Puranam | Sakshi
Sakshi News home page

Ksheera Sagara Mathanam గరళ ఆవిర్భావం

Oct 8 2025 12:41 PM | Updated on Oct 8 2025 12:56 PM

How the garalam came out in ksheera sagara mathanam

దుర్వాసుని శాపం వల్ల అసురులకు తన త్రిలోకాధిపత్యాన్నీ, సకల సంపదలనూ కోల్పోయాడు ఇంద్రుడు. అసురుల చేతిలో ఎన్నో బాధలు అనుభవించి ఇతర దేవతలతో కలిసి చివరకు బ్రహ్మను ఆశ్రయించాడు. బ్రహ్మ వారిని విష్ణువు దగ్గరకు నడిపించాడు. ఆయన సాగరమథనం చేసి అందులోంచి పుట్టే అమృతాన్ని దేవతలు మాత్రమే సేవించేట్లుగా చేయడం ఒక్కటే ఈ సమస్యకు సరైన పరిష్కారం అన్నాడు. సత్వరం అసురులను మంచి మాటలతో ఒప్పించి అందరూ కలిసి మందర పర్వతాన్ని కవ్వముగాను, వాసుకిని ఆ కవ్వమునకు తాడుగాను అమర్చి సాగర మథన కార్యక్రమానికి పూనుకొమ్మని చెప్పాడు. అలా మొదలైన ‘క్షీరసాగర మథనం’ (Ksheera Sagara Madhanam)అనే బృహత్కార్యంలో శ్రీమహావిష్ణువు కమఠ (తాబేలు) రూపం దాల్చి, మందర పర్వతం సాగరంలో మునగకుండా అడ్డుతగిలే ఆధారమై అమరాడు. 

చదవండి: Happy Divorce విడాకులను సెలబ్రేట్‌ చేసుకున్న తల్లీ కొడుకులు

అసురులు వాసుకికి తలవైపున ఉండి లాగడం వలన వాసుకి నోటి నుండి వెలువడిన విషపు వేడిజ్వాలలు తగిలి నానాటికి కమిలిపోయి, అలిసిపోయి బలహీనులై మిగలసాగారు. దేవతలు తోకవైపు ఉండి లాగి బలవంతులుగానే మిగిలారు. అలా సాగిన సాగర మథనంలో వరుసగా సురభి, వారుణి, కల్పవృక్షము, ఐరావతము, ఉచ్చైశ్రవము, పూర్ణచంద్ర మండలము, అప్సరలు, ధన్వంతరి ఉద్భవించారు. ఆ తరువాత క్షీరసాగరం నుండి అమృతం జనించక ముందు, హాలాహలం ప్రత్యక్షమవడం జరిగిందని కలిదిండి భావనారాయణ రచించిన ‘శ్రీవిష్ణుపురాణం’ చెబు తోంది. కం. అక్కజముగ దేవాసురు / లుక్కున, వడి, బట్టితిగుచు నుద్ధతులకడున్‌ / త్రొక్కుడువడి, వాసుకి, వడి / గ్రక్కిన గరళంబు భోగిగణములు గొనియెన్‌. దేవతలు అసురులు ఎంతో శ్రమపడి చెరొకవైపు పట్టి అవిరామంగా లాగడం వలన త్రొక్కుడుపడిన వాసుకి అలసిపోయి భళ్ళుమని ఒక్కసారిగా గరళాన్ని కక్కాడు. ఆ గరళాన్ని సర్ప సమూహాలు ఆరగించాయి – అని పై పద్యం భావం. అలా క్షీరసాగర మథనం సందర్భంగా పుట్టిన హాలాహలాన్ని నాగులు గ్రహించారని శ్రీవిష్ణుపురాణం కథనం చేసింది.  

– భట్టు వెంకటరావు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement