కేన్సర్‌ను జయించే టీ పార్టీలు | Host a tea party for cancer awareness: VG Venkatesh | Sakshi
Sakshi News home page

కేన్సర్‌ను జయించే టీ పార్టీలు

May 29 2024 12:01 AM | Updated on May 29 2024 12:01 AM

Host a tea party for cancer awareness: VG Venkatesh

ముంబైలో విజి వెంకటేశ్‌ నిర్వహించే టీ పార్టీలకు నలుగురూ ఉత్సాహంగా వస్తారు. కారణం– కొన్ని కబుర్లు నడుస్తాయి. దాంతోపాటు కేన్సర్‌ను నివారించే జీవన విధానం తెలుస్తుంది. కేన్సర్‌ బాధితులకు అండగా నిలిచే వీలూ దొరుకుతుంది. 71 ఏళ్ల విజి వెంకటేశ్‌ గత రెండు దశాబ్దాలుగా కేన్సర్‌పై చైతన్యం కలిగిస్తోంది. విజి వేంకటేశ్‌ కృషి....

‘కేన్సర్‌ అంటే ఇంకా జనంలో భయం పోలేదు. మాట్లాడటానికి జంకుతారు. టీ అందరికీ ఇష్టం. తాగుతూ కబుర్లు చెప్పుకున్నంత సాధారణంగా కేన్సర్‌ గురించి మాట్లాడుకుంటూ, చర్చించుకుంటూ, బాధితులకు చేయదగ్గ సాయాన్ని గుర్తు చేయడం గురించే నేను టీ పార్టీలు– చాయ్‌ ఫర్‌ కేన్సర్‌ నిర్వహిస్తున్నాను’ అని తెలిపారు విజి వెంకటేశ్‌. ముంబైకి చెందిన 72 ఏళ్ల ఈ సేవా కార్యకర్త దక్షిణ ఆసియాలో కేన్సర్‌ బాధితుల సహాయానికి పని చేస్తున్న ‘ది మ్యాక్స్‌ ఫౌండేషన్‌’కు ప్రధాన బాధ్యతలు నిర్వరిస్తోంది. 

‘మేము చాలా హాస్పిటల్స్‌తో మాట్లాడాము. దిగువ ఆదాయ వర్గాల్లో కేన్సర్‌ బాధితులకు ఉచితంగా వైద్యం చేయడానికి వాళ్లు ముందుకు వచ్చారు. ప్రత్యేకంగా ఛారిటబుల్‌ ఆస్పత్రులు కూడా ఉన్నాయి. కాని సమస్య ఏమిటంటే... ఆ పేషెంట్లు ఆస్పత్రికి వచ్చి వైద్యం చేయించుకోవడానికి దారి ఖర్చులు వారి వద్ద ఉండవు. మందులు కొనుక్కోవడానికి, తగిన ΄ûష్టికాహారం తినడానికి వీలుండదు. అలాంటి వారికి సహాయం అందించడమే నా లక్ష్యం. అందుకు టీ పార్టీలకు స్నేహితులను పిలుస్తాను. వారి సహాయం కోరుతాను’ అంది విజి వెంకటేశ్‌.

కార్మికులను చూసి...
విజి వెంకటేశ్‌ ముందు ఒక సాధారణ కార్యకర్తగానే సేవా రంగంలోకి వచ్చింది. ముంబైలోని కేన్సర్‌ పేషెంట్స్‌ ఎయిడ్‌ అసోసియేషన్‌ కోసం నాలుగు చందాలు వసూలు చేసి పెట్టడం ఆమె పని. చిన్న చిన్న వాడల్లోకి వెళ్లి చందాలు అడిగితే వాళ్లు తమ దగ్గర ఉన్నదాంట్లో ఇరవై రూపాయలో, ముప్పై రూపాయలో ఇచ్చేవారు. మరోవైపు వారంతా కార్మికులు కనుక ధూమపానం వల్ల, ఇతర అలవాట్ల వల్ల ఎక్కువగా కేన్సర్‌ బారిన పడటం విజి గమనించింది. ‘ఒక కేన్సర్‌ పేషెంట్‌తో టెస్ట్‌లు చేయించుకుని, మందులు తీసుకోవచ్చు కదా అనంటే అతను దాని బదులు నా పిల్లలకు పాలు కొనివ్వగలిగితే నాకు ఎక్కువ సంతోషం అన్నాడు. ఆ జవాబు నన్ను కదిలించింది. ఇంత నిస్సహాయ స్థితిలో ఉన్న బాధితులకు జీవితాంతం సహాయం చేయాలని నిశ్చయించుకున్నాను’ అని తెలిపింది విజి.

చాయ్‌ పార్టీ 4 లక్షలు
విజి తన టీ పార్టీలకు స్నేహితులను, బంధువులను పిలుస్తుంది. ఆమె సంస్థ, కృషి గురించి విన్న అపరిచితులు కూడా వచ్చి టీ పార్టీలో కూచుంటారు. కేన్సర్‌ అవగాహన కార్యక్రమం ఉంటుంది. దాంతో పాటు సరదా పాటలు, మాటలు నడుస్తాయి. చివరలో విజి దిగువ ఆదాయ వర్గాల కేన్సర్‌ బాధితుల కోసం చందాలు కోరుతుంది. ‘ప్రతి టీ పార్టీలో కూడా విశేష స్పందన వస్తుంది. అప్పటికప్పుడు వారికి తోచింది ఇస్తారు. ఒకోసారి 4 లక్షల రూపాయల వరకూ వస్తాయి. అక్కడ ఉన్నవారు వేరే ఫ్రెండ్స్‌కు కాల్‌ చేసి మరీ డబ్బులు వేయిస్తారు’ అని తెలిపింది విజి.

18 వేల మందికి
విజి తన సంస్థ ద్వారా ముంబై, మహరాష్ట్రలోని 18 వేల మంది కేన్సర్‌ బాధితులకు సహాయం అందిస్తోంది. వారి చికిత్సకు, మందులకు, పరీక్షలకు డబ్బు ఏర్పాటు చేస్తుంది. ఒకోసారి కుటుంబ పరిస్థితి కూడా గమనించాల్సి ఉంటుంది. ‘తగిన వైద్యం అందితే చాలామటుకు కేన్సర్‌ నుంచి బయటపడొచ్చు. ఆ వైద్యం అందే పరిస్థితుల కోసం మనందరం తలా ఒక చేయి వేయాలి’ అందామె.
ప్రస్తుతం దేశంలో 30 చోట్ల విజి సంస్థ కోసం టీపార్టీలు జరుగుతున్నాయి. మిగిలినప్రాంతాల్లో కూడా ఇలాంటివి నిర్వహించి నిధులు కేన్సర్‌ బాధితులకు అందేలా చేయొచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement