Rainy Season Healthy Diet: వర్షాకాలం.. పచ్చి ఆకు కూరలు, సీ ఫుడ్‌ వద్దు.. ఇవి తినండి!

Health Tips In Telugu: What Food To Eat What To Avoid In Rainy Season - Sakshi

వర్షాకాలం అంటే చాలామందికి ఇష్టం. అందమైన వాతావరణం, బయట వర్షం పడుతుంటే వేడి వేడి మిర్చి బజ్జీలో, పకోడీలో తింటూ... ఇష్టమైన పుస్తకాలు చదువుకుంటూనో, సంగీతం వింటూనో కాలం గడపడం అందరికీ ఇష్టమైన పనులే.. అయితే వర్షాకాలం కేవలం వీటినే కాదు.. ఎన్నో రకాల వ్యాధులకు కూడా ఆలవాలం.

డెంగ్యూ, చికన్‌ గున్యా, మలేరియా, కలరా, టైఫాయిడ్, డయేరియా, వైరల్‌ ఫీవర్‌ వంటి ఎన్నో వ్యాధులు వర్షా కాలంలోనే ఎక్కువగా ప్రబలుతుంటాయి. వీటితోపాటు జలుబు, దగ్గు, జ్వరం వంటి సాధారణ సమస్యలు కూడా చికాకు పెడుతుంటాయి. వీటిని నివారించేందుకు కొన్ని ముందు జాగ్రత్త చర్యలు, చిట్కాలు పాటించడం మంచిది. అవేమిటో చూద్దాం. 

వర్షాకాలం ఆరోగ్యంపై తీవ్రప్రభావాన్ని చూపిస్తుంది. ఈ కాలంలో అనేక రోగాలు చుట్టుముట్టి బాధిస్తుంటాయి. వర్షాలు పడడంతో దోమలు, ఈగలు వంటి కీటకాల బెడద పెరుగుతుంది. ఇవి వైరల్‌ ఫీవర్లు, ఇన్‌ఫెక్షన్లు కలిగిస్తాయి. తరచూ జలుబు, దగ్గు వంటి వాటితో అనారోగ్యానికి గురయ్యే అవకాశముంది. అసిడిటీ, ఉబ్బరం, అజీర్ణం లాంటి గ్యాస్ట్రిక్‌ సమస్యలు సర్వసాధారణంగా వస్తుంటాయి.

అధిక వర్షాల వల్ల ఆరోగ్యానికి ముప్పు కూడా ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాటిని నిరోధించడానికి కింది జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అందువల్ల, సమతుల్య ఆహారం తీసుకోవడం, రోజూ వ్యాయామం చేయడం మంచిది.

ఇవి తగ్గించాలి.. ఇవి తినాలి
►జంక్, స్పైసీ, జిడ్డుగల ఆహారాన్ని తక్కువగా తీసుకోవాలి.
►పెరుగు లేదా మజ్జిగ వంటి ప్రోబయోటిక్స్‌ కలిగిన పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. అవి మన జీర్ణవ్యవస్థకు మద్దతు ఇచ్చే మంచి బ్యాక్టీరియాను కలిగి ఉంటాయి.
►పచ్చి ఆకు కూరలను తినడం మానుకోవాలి. ఎందుకంటే అవి సూక్ష్మక్రిములతో నిండి ఉంటాయి. ఒకవేళ తినాలని భావిస్తే మితంగా తినడం మేలు.
►పేగులకు అనుకూలమైన, తేలికగా జీర్ణమయ్యే తేలికైన ఆహారాన్ని ఎంచుకోవాలి. 

►పచ్చి కూరగాయలకు బదులుగా ఆవిరి మీద ఉడికించిన కూరగాయలను తినాలి.
►అలాగే కాచి చల్లార్చిన నీరు తాగడం అవసరం.
►వర్షాకాలంలో కడుపు, పేగు, కాలేయ ఇన్‌ఫెక్షన్‌లతో బాధపడుతున్న రోగుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది.
►ముఖ్యంగా ఆహారం, నీటి ద్వారా ఇన్ఫెక్షన్ల కారణంగా రోగాలు అకస్మాత్తుగా దరిచేరే అవకాశం ఉంటుంది.
►కాబట్టి వేడి ఆహారాన్ని తీసుకోవటం మంచిది. వర్షాకాలంలో ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన ఆహారాలు తినరాదు.

సీ ఫుడ్‌ వద్దు:
►వర్షాకాలంలో నీరు కలుషితమై ఉంటుంది. అందువల్ల సీ ఫుడ్‌ తినడం మానుకోవాలి. చేపలు తినడం వల్ల కలరా, డయేరియా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అసిడిటీతో బాధపడే అవకాశం ఉంటుంది.

►ఆహారం తిన్న వెంటనే నిద్రపోయే అలవాటు మానుకోండి. వర్షం కారణంగా వ్యాయామాలు చేసేందుకు బయటకు వెళ్ళలేని పరిస్ధితి ఉంటుంది కాబట్టి జీర్ణ క్రియలు సాఫీగా ఉండాలంటే ఇంట్లోనే తేలికపాటి వ్యాయామాలు చేయటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

వర్షాకాలంలో స్ట్రీట్‌ ఫుడ్‌ కు దూరంగా ఉండాలి!
►ఆహారం కలుషితమై ఉండే అవకాశాలు ఉన్నందువల్ల రకరకాల రోగాల బారిన పడే ప్రమాదం ఉంటుంది.
►తక్కువ మొత్తంలో తినేలా చూసుకోవాలి. అధిక మొత్తంలో ఆహారం తీసుకోవటం ఏమాత్రం మంచిది కాదు.
►దీనివల్ల జీర్ణ వ్యవస్థపై భారం పడుతుంది. నూనెతో తయారు చేసిన పదార్థాల జోలికి వెళ్లనే వెళ్ళవద్దు.

చల్లని డ్రింక్‌లు వద్దు.. వేడి సూప్‌లే ముద్దు
►వర్షాకాలంలో వెచ్చని సూప్‌ తాగడం చాలా బాగుంటుంది. చికెన్‌ సూప్‌ నుంచి క్యారెట్‌ సూప్, మష్రూమ్‌ సూప్‌ లేదా వెజిటబుల్‌ సూప్‌ మొదలైన అనేక సూప్‌లను తీసుకోవచ్చు. అంతేకాదు తులసి, పసుపు, దాల్చిన చెక్క, ఏలకులతోపాటు నిమ్మకాయ వంటి ఇతర రోగనిరోధక శక్తిని పెంచే టీ (చాయ్‌)లను తీసుకోవచ్చు.

►వీలయినంతవరకు వర్షం పడేటప్పుడు ఇంట్లో ఉండటానికి ప్రయత్నించడం మేలు. ఈ విధంగా మీరు అనేక వ్యాధుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోగలుగుతారు.

చదవండి: Maharashtra: ఇక నల్లేరుపై బండి నడకే!.. బండి లాగే ఎద్దుల కష్టం తగ్గించే ఆవిష్కరణ
దానిమ్మ వల్ల కలిగే ఆరోగ్య ప్రయెజనాలెన్నో..! 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top