
‘వయసు పైబడడం అనేది సహజం... వచ్చే సమస్యలు కూడా సహజం’ అని ఆరోగ్యాన్ని గాలికి వదిలేసేవారు కొందరు. ‘వయసు పైబడడం అనేది సహజమే అయినా, తగిన జాగ్రత్తలు తీసుకోవడం, వ్యాయామాలు చేయడం తప్పనిసరి’ అని ముందుకు వెళ్లేవారు కొందరు. బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ రెండో కోవకు చెందిన వ్యక్తి.
తన ఆలోచనలను పర్సనల్ బ్లాగ్ ద్వారా ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటారు బిగ్ బి. 82 సంవత్సరాల అమితాబ్ తాజాగా వృద్ధాప్యానికి సంబంధించిన సవాళ్ల గురించి తన తాజా పోస్ట్‌లో రాశారు. ఇంట్లో ‘హ్యాండిల్ బార్స్’ అవసరం గురించి ప్రస్తావించారు.
వృద్ధుల కోసం బాత్‌రూమ్‌లో, ఇంట్లోని కొన్ని చోట్ల హ్యాండిల్ బార్స్ లేదా గ్రాబ్ బార్స్ ఏర్పాటు చేస్తారు.
‘మీట్–అండ్–గ్రీట్ విత్ ఫ్యాన్స్’లో భాగంగా అభిమానులను కలుసుకున్న తరువాత తన దినచర్య గురించి రాశారు బిగ్ బి.
‘శరీరం క్రమేణా సమతుల్యత కోల్పోతోంది’ అని రాసిన బచ్చన్ తన ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెడుతున్నారు. యోగా, శ్వాస వ్యాయామాలు, మొబిలిటీ వ్యాయామాల ప్రాముఖ్యత గురించి తన పోస్ట్‌లో నొక్కి చెప్పారు.
‘82 సంవత్సరాల వయసులోనూ ఇంత చురుగ్గా ఎలా ఉండగలుగుతున్నారు?’ అనే ప్రశ్నకు సోషల్ మీడియాలో ఆయన పోస్ట్‌లే సమాధానం చెబుతాయి. సందర్భానుసారంగా ఉన్నత జీవనశైలికి సంబంధించిన అలవాట్ల గుంచి ఎన్నో పోస్ట్‌లలో వివరించారు అమితాబ్.
ఎన్నో అనారోగ్య సమస్యలను అధిగమించి ఉత్సాహంగా ముందుకు వెళుతున్న సూపర్ స్టార్ నిజమైన పోరాట యోధుడు. ఎంతోమందికి స్ఫూర్తినిచ్చే వ్యక్తి.
(చదవండి: 'బ్యూటిఫుల్ బామ్మ'..! ఫిట్‌నెస్‌లో సరిలేరు ఈమెకెవ్వరూ..)