Heads Up For Tails: శునకాలకు కిరాణా స్టోర్‌

Heads Up For Tails: Rashi Narang on her journey as a pet e-store owner - Sakshi

భిన్న ఆలోచన

మనుషులకు కిరాణా దుకాణాలు ఉన్నాయి. శునకాలకు? పిల్లులకు? ఏవో నాలుగు రకాల తిండి, మెడ పట్టీలు, గొలుసులు... ఇవి అమ్మే పెట్‌ స్టోర్స్‌ కాకుండా వాటి ప్రతి అవసరాన్ని పట్టించుకుని వాటికి అవసరమైన టాప్‌ క్లాస్‌ వస్తువులను అమ్మే ఓ దుకాణం ఉండాలని భావించింది రాశి నారంగ్‌. పదేళ్ల నుంచి ఎంతో స్ట్రగుల్‌ అయ్యి నేడు నంబర్‌ వన్‌ స్థాయికి చేరింది. ఆమె ‘హెడ్స్‌ అప్‌ ఫర్‌ టెయిల్స్‌’ దేశవ్యాప్తంగా 75 రిటైల్‌ స్టోర్స్‌తో 30 పెట్‌ స్పాలతో సంవత్సరానికి 140 కోట్ల రూపాయల అమ్మకాలు సాగిస్తోంది. రాశి నారంగ్‌ పరిచయం.

ఢిల్లీకి చెందిన రాశి నేడు దేశంలో అత్యధిక పెట్‌ స్టోర్లు కలిగిన సంస్థ ‘హెడ్స్‌ అప్‌ ఫర్‌ టెయిల్స్‌’కు ఫౌండర్‌. పెంపుడు జంతువుల రంగంలో కోట్ల వ్యాపారానికి వీలుంది అని గ్రహించిన తెలివైన అంట్రప్రెన్యూర్‌.

‘మాది వ్యాపార నేపథ్యం ఉన్న కుటుంబం. మా అత్తగారిది కూడా. మా ఇంట్లో చిన్నప్పుడు కుక్కల్ని పెంచేవాళ్లం. అయితే వాటి బాధ్యత మొత్తం కుటుంబం తీసుకునేది. కాని నాకు పెళ్లయిన కొత్తల్లో నాకంటూ ఒక కుక్క కావాలనుకుని ‘సారా’ అనే బుజ్జి కుక్కపిల్లను తెచ్చుకున్నాను. అదంటే చాలా ఇష్టం నాకు. దాని పుట్టినరోజుకు దానికేదైనా మంచి గిఫ్ట్‌ కొనిద్దామని ఢిల్లీ అంతా తిరిగాను. ఏవో కాలర్స్, గొలుసులు తప్ప దానికి తొడగడానికి మంచి డ్రస్సు గాని,  కొత్త రకం ఆట వస్తువు గాని, మంచి ఫుడ్‌గాని ఏమీ దొరకలేదు. కుక్కలు పడుకునే బెడ్స్‌ కూడా ఎక్కడా దొరకలేదు. నేను చెబుతున్నది 2008 సంగతి. ఇంటికి ఖాళీ చేతులతో వచ్చి నా సారాను ఒళ్లో కూచోబెట్టుకుని ఆలోచించాక అర్థమైంది... నాలాగే కుక్కలను ప్రేమించేవారు ఎందరో ఉన్నారు. వారు కూడా ఇలాగే ఫీలవుతూ ఉంటారు. నేనే కుక్కలకు అవసరమైన ప్రాడక్ట్స్‌ ఎందుకు తయారు చేయించి అమ్మకూడదు అనుకున్నాను. అలా నా యాత్ర మొదలైంది’ అంటుంది రాశి.

మొదటి స్టోర్‌ ఢిల్లీలో... అయితే ఆ ఆలోచన వచ్చాక పని మొదలెట్టడం అంత సులువు కాలేదు. రాశి హెచ్‌.ఆర్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేసింది. ఉద్యోగం కూడా చేసింది. ‘అంత చదువు చదివి కుక్కల వస్తువులు అమ్ముతావా’ అని ఫ్రెండ్స్‌ అన్నారు. ‘ఏదో హాబీలాగా కాలక్షేపం చేస్తుందిలే’ అని భర్త, అత్తమామలు అనుకుని వదిలేశారు. కాని రాశి ఆలోచన వేరుగా ఉంది. కుక్క అంటే ఆమె దృష్టిలో మరో ఫ్యామిలీ మెంబరే. ‘శునకాల పట్ల మన భారతీయుల దృష్టి ఇటీవల మారింది. అంతకుముందు వాటిని ఇంటి బయట కట్టేసి వాచ్‌ డాగ్‌లుగా చూసుకునేవారు. ఇప్పుడు ఇంట్లోనే ఒక ఫ్యామిలీ మెంబర్‌గా చూసుకుంటున్నారు. వాటికి క్వాలిటీ ఆహారం వస్తువులు మందులు ఇవ్వడంతో వాటి ఆరోగ్యం, వాటితో ఆనందం పొందాలని అనుకుంటున్నారు. కాని అలాంటి వస్తువులు ప్రత్యేకంగా దొరకడం తక్కువ. నేను రంగంలో దిగాను’ అంటుంది రాశి.

కుక్కల ఒంటి తీరు, బొచ్చును బట్టి బట్టలు కుట్టి దుస్తులు తయారు చేయడం రాశి చేసిన మొదటి పని. అవి పడుకునే తీరును బట్టి అందమైన బెడ్స్‌ తయారు చేయడం. అవి ఆడుకోవడానికి రకరకాల వస్తువులు. వాటి ముఖ్య ఆహారం, అల్పాహారం కోసం రకరకాల క్వాలిటీ పదార్థాలు, అందమైన మెడ పట్టీలు, ప్రమాదకర రసాయనాలు లేని షాంపూలు, డియోడరెంట్‌లు... ఇవన్నీ ఒకచోట చేర్చి వాటిని షాపులకిచ్చి అమ్మాలనుకుంది. ‘కాని పెట్‌ స్టోర్లు అమ్మే వ్యాపారులు సగటు వ్యాపారులు. నేను తీసుకెళ్లిన ప్రాడక్ట్‌లు చూసి ఇలాంటివి అమ్మం. ఇవి ఎవరూ కొనరు అని నన్ను వెనక్కు పంపించేసేవారు. ఇక చూసి చూసి నేనే ఒక షాపు తెరిచాను. అలా ఢిల్లీలో హెడ్స్‌ అప్‌ ఫర్‌ టెయిల్స్‌ మొదటి షాపు మొదలైంది’ అంటుంది రాశి.

సుదీర్ఘ విరామం తర్వాత...  ఢిల్లీలో షాపు నడుస్తుండగానే రాశి భర్తకు సింగపూర్‌లో ఉద్యోగం వచ్చింది. అతనితో పాటు వెళ్లి అక్కడ 7 ఏళ్లు అక్కడే ఉండిపోయి 2015లో తిరిగి వచ్చింది రాశి. ‘అన్నాళ్లు నేను షాపును అక్కడి నుంచే నడిపాను. విస్తరించడం వీలు కాలేదు. కాని తిరిగి వచ్చాక ఈ ఐదారేళ్లలోనే ఇంత స్థాయికి తీసుకొచ్చాను’ అంటుంది రాశి. ఆమె దార్శనికతను గ్రహించిన సంస్థలు భారీగా ఫండింగ్‌ చేయడంతో రాశి తన స్టోర్స్‌ను పెంచుకుంటూ వెళ్లింది. అంతే కాదు కుక్కలు, పిల్లులు, కుందేళ్లు, పిట్టలు... వీటి సంరక్షణకు స్పాలు కూడా మొదలెట్టింది. అన్నీ పెట్‌ ఫ్రెండ్లీ షాపులు. రాశి ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి ‘క్యాట్‌ ఓన్లీ స్టోర్‌’ కూడా తెరిచింది. అన్ని మెట్రో నగరాల్లో ‘హెడ్స్‌ ఫర్‌ టెయిల్స్‌’ షాపులు ఉన్నాయి. కుక్కలకు కావాల్సిన 100కు పైగా వస్తువులు, జాతిని బట్టి వాడాల్సిన వస్తువులు అమ్మడం ఈమె సక్సెస్‌కు కారణం. ఒక పనిలో పూర్తిగా శ్రద్ధతో నిమగ్నమైతే రాశిలా ఎవరైనా విజయం సాధించవచ్చు.   

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top