మైరావ‌ణుని ప్రాణాలు తుమ్మెద రూపంలో

Hanuman Vs Mairavath In Ramayana Story - Sakshi

లంకలో రామ రావణ యుద్ధం జరుగుతోంది. వానరసేన ధాటికి, రామలక్ష్మణుల పరాక్రమానికి రాక్షస వీరులు ఒక్కొక్కరే హతమైపోయారు. చివరకు మహాబలశాలి అయిన రావణుడి సోదరుడు కుంభకర్ణుడు, దేవేంద్రుడిని సైతం జయించిన మేఘనాదుడు హతమైపోయారు. దిక్కుతోచని స్థితిలో పడ్డాడు రావణుడు. ఒంటరిగా కూర్చుని, తన మేనమామ మైరావణుడిని తలచుకున్నాడు.

మైరావణుడు వెంటనే ప్రత్యక్షమయ్యాడు. రావణుడి పరిస్థితి తెలుసుకున్నాడు. ‘రావణా! విచారించకు. నా మాయాజాలాన్ని దాటి రాముడైనా, దేవుడైనా అంగుళం దాటి అవతలకు పోలేరు. రామలక్ష్మణులిద్దరినీ బంధించి, రేపే వాళ్లను దుర్గకు బలి ఇస్తాను’ అని ధైర్యం చెప్పాడు. విభీషణుడికి చారుల ద్వారా సంగతి తెలిసి, సుగ్రీవుడిని, వానరులను అప్రమత్తం చేశాడు. రామలక్ష్మణులకు కట్టుదిట్టంగా కాపాడుకోవాలని చెప్పాడు.

వెంటనే హనుమంతుడు తన తోకను భారీగా పెంచి, రామలక్ష్మణుల చుట్టూ రక్షణవలయంలా ఏర్పాటు చేసి, తోకపై కూర్చుని కాపలాగా ఉన్నాడు. మైరావణుడికి ఇదంతా తెలిసి, రామలక్ష్మణులను తస్కరించుకు తెమ్మని సూచీముఖుడనే అనుచరుణ్ణి పంపాడు. హనుమంతుడి వాలవలయం లోపలికి సూక్ష్మరూపంలో ప్రవేశించడానికి ప్రయత్నించాడు.

హనుమంతుడి వాల రోమాలను తాకడంతోనే అతడి ముఖం రక్తసిక్తం కావడంతో వెనుదిరిగాడు. సూచీముఖుడి వల్ల పని జరగకపోవడంతో పాషాణముఖుడిని పంపాడు. వాడు హనుమంతుడి వాలవలయాన్ని తన రాతిముఖంతో బద్దలు కొట్టడానికి ప్రయత్నిస్తే, వాడి ముఖమే బద్దలైంది. చివరకు మైరావణుడే స్వయంగా రంగంలోకి దిగాడు.

మాయోపాయాలలో ఆరితేరిన మైరావణుడు హనుమంతుడి వద్దకు విభీషణుడి రూపంలో వచ్చాడు. ‘హనుమా! రామలక్ష్మణులు సురక్షితమే కదా! రాక్షసులు మాయావులు. నేనొకసారి లోపలకు పోయి రామలక్ష్మణులను చూసి వస్తాను’ అన్నాడు. హనుమంతుడు తోకను సడలించి, అతడు లోపలకు పోయేందుకు మార్గం కల్పించాడు. లోపలకు చొరబడిన మైరావణుడు రామలక్ష్మణులను చిన్న విగ్రహాలుగా మార్చి, తన వస్త్రాల్లో దాచి పెట్టుకుని ఏమీ ఎరుగనట్లు బయటకు వచ్చాడు.

‘రామలక్ష్మణులు గాఢనిద్రలో ఉన్నారు. జాగ్రత్త’ అని హనుమంతుడితో చెప్పి, అక్కడి నుంచి తన పాతాళ లంకకు వెళ్లిపోయాడు. వారిని ఒక గదిలో బంధించి, తన సోదరి దుర్దండిని వారికి కాపలాగా పెట్టాడు. కాసేపటికి విభీషణుడు వచ్చాడు. ‘హనుమా! రామలక్ష్మణులు క్షేమమే కదా! ఒకసారి లోపలకు పోయి చూద్దాం’ అన్నాడు. ‘విభీషణా! ఇందాకే కదా వచ్చి వెళ్లావు. ఇంతలోనే మళ్లీ ఏమొచ్చింది’ అడిగాడు హనుమంతుడు.

హనుమంతుడి మాటలతో విభీషణుడు ఆందోళన చెందాడు. ‘హనుమా! ఇంతకుముందు నేను రాలేదు. ఇదేదో మైరావణుడి మాయ కావచ్చు. చూద్దాం పద’ అన్నాడు. ఇద్దరూ లోపల చూశారు. రామలక్ష్మణులు కనిపించలేదు. విభీషణుడికి పరిస్థితి అర్థమైంది. ‘హనుమా! మనం క్షణం కూడా ఆలస్యం చెయ్యవద్దు’ అంటూ తనతో హనుమంతుడిని పాతాళ లంకకు తీసుకుపోయాడు.

కావలిగా ఉన్న దుర్దండితో విభీషణుడు ‘భయపడకు. రామలక్ష్మణులు ఎక్కడ ఉన్నారో చెప్పు’ అన్నాడు. ‘రామలక్ష్మణులను తెల్లారే బలి ఇవ్వడానికి మైరావణుడు సిద్ధమవుతున్నాడు. వారు ఇదే గదిలో ఉన్నారు’ అని చూపింది. హనుమంతుడు గది తలుపులు బద్దలుకొట్టాడు. ఆ శబ్దానికి కాపలాగా ఉన్న రాక్షసభటులు పరుగు పరుగున ఆయుధాలతో అక్కడకు వచ్చారు.

హనుమంతుడు భీకరాకారం దాల్చి, వారందరినీ దొరికిన వారిని దొరికినట్లే మట్టుబెట్టసాగాడు. పాతాళలంకలో రాక్షసుల హాహాకారాలు మిన్నుముట్టాయి. ఈ కలకలం విని మైరావణుడే స్వయంగా వచ్చాడు. రాక్షసులపై వీరవిహారం చేస్తున్న హనుమంతుడితో కలబడ్డాడు. మైరావణుడు తన మీద ప్రయోగించిన ఆయుధాలన్నింటినీ హనుమంతుడు తుత్తునియలు చేశాడు. చివరకు ఇద్దరూ బాహాబాహీ తలపడ్డారు.

హనుమంతుడు ఎన్నిసార్లు తన పిడికిటి పోట్లతో ముక్కలు ముక్కలుగా చేసినా, మళ్లీ అతుక్కుని మైరావణుడు లేచి తలపడుతున్నాడు. హనుమంతుడు ఆశ్చర్యపడ్డాడు.
ఇదంతా గమనించిన దుర్దండి ‘మహావీరా! కలవరపడకు. వీడి పంచప్రాణాలు ఐదు తుమ్మెదల రూపంలో ఉన్నాయి. ఆ తుమ్మెదలను ఈ బిలంలోనే దాచి ఉంచాడు’ అంటూ ఆ బిలాన్ని చూపించింది. బిలానికి మూసి ఉన్న రాతిని హనుమంతుడు పిడికిటి పోటుతో పిండి పిండి చేశాడు.

బిలం నుంచి తుమ్మెదలు భీకరంగా ఝుంకారం చేస్తూ హనుమంతుడి మీదకు వచ్చాయి. హనుమంతుడు ఒక్కొక్క తుమ్మెదనే పట్టి, తన కాలి కింద వేసి నలిపేశాడు. ఐదు తుమ్మెదలూ అంతమొందడంతోనే, మైరావణుడు మొదలు తెగిన చెట్టులా కుప్పకూలిపోయాడు. రామలక్ష్మణులను విభీషణుడిని తన భుజాల మీద, వీపు మీద కూర్చోబెట్టుకుని హనుమంతుడు శరవేగంగా లంకలోని యుద్ధ స్థావరానికి చేరుకున్నాడు. జరిగినదంతా తెలుసుకుని సుగ్రీవుడు ఆశ్చర్యపోయాడు. హనుమంతుణ్ణి అభినందించాడు.

∙సాంఖ్యాయన

(చ‌ద‌వండి: విఘ్నేశ్వ‌రుని పూజ త‌రువాత వాయ‌న‌దానం మంత్రం )

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top