క్లూషియల్‌: పాంట్రీ కారులో శవం | Funday Crime Story | Sakshi
Sakshi News home page

క్లూషియల్‌: పాంట్రీ కారులో శవం

Apr 26 2026 1:28 AM | Updated on Apr 26 2026 1:28 AM

Funday Crime Story

సమయం ఉదయం 10 గంటలు..  హైదరాబాద్‌లోని నాంపల్లి స్టేషన్‌ కు చెన్నై ఎక్స్‌ప్రెస్‌ చేరుకుంది. రైలు పాంట్రీకారులో సినిమా ప్రొడ్యూసర్‌ తంగవేలు శవమై కనిపించడం పెను సంచలనం సృష్టించింది. ఈ మిస్టరీని చేధించడానికి డిటెక్టివ్‌ సిద్ధార్థ రంగంలోకి దిగాడు.తంగవేలు మృతదేహం పాంట్రీకారులోని స్టోరేజ్‌ క్యాబిన్‌ దగ్గర పడి ఉంది. అతని గొంతుపై లోతైన గాయం ఉంది, కాని, ఆశ్చర్యకరంగా రక్తపు మరకలు చాలా తక్కువగా ఉన్నాయి.సిద్ధార్థ తన విచారణను పాంట్రీ సిబ్బంది నుంచి ప్రారంభించాడు.మొదటి అనుమానితుడిగా వంటవాడిని ప్రశ్నించాడు. అతడు ‘‘నేను రాత్రంతా బిజీగా ఉన్నాను, నాకేం తెలియదు’’ అని చెప్పాడు.రెండవ అనుమానితుడైన మేనేజర్‌ను ప్రశ్నించాడు సిద్దార్థ. తంగవేలు తనను డబ్బుల కోసం వేధించాడని ఒప్పుకున్నాడు కాని, తాను చంపలేదని వాదించాడు.

సిద్ధార్థ పాంట్రీకారులోని డీప్‌ ఫ్రీజర్‌ని పరిశీలించాడు. అక్కడ గడ్డకట్టిన రక్తపు చుక్కలను గుర్తించాడు. అలాగే తంగవేలు చేతి గడియారం 11:30 గంటలకు ఆగిపోయి ఉంది. కానీ రైలు సిబ్బంది ఆయన 1:00 గంటకు కూడా సజీవంగా ఉన్నాడని సాక్ష్యం చెప్పారు.అదే సమయంలో రాత్రి ఒంటి గంటకు తంగవేలు బోగీలో నడుచుకుంటూ వెళ్లడం చూశానని అదే బోగీలో ప్రయాణిస్తున్న సంతోష్‌ అనే కుర్రాడు చెప్పాడు. తన తాతకు మూలికా వైద్యం కోసం చెన్నైలో ఉంటున్న ఆయుర్వేద వైద్యుడు సుబ్బారాయుడు దగరికి వెళ్లి అదే ట్రైన్‌లో అదే బోగీలో ప్రయాణించినట్టు సాక్ష్యం చెప్పాడు.‘రాత్రి 11:30 గంటలకు చనిపోయిన వ్యక్తి ఒంటి గంటకు నడుస్తూ కనిపించడం ఎలా సాధ్యం?’ అక్కడే సిద్దార్థ డిటెక్టివ్‌ బుర్ర వేగంగా పని చేసింది.

రైలు నాంపల్లి స్టేషన్‌ కు చేరుకున్నాక, రైల్వే క్లీనింగ్‌ సిబ్బంది పాంట్రీకారులోని స్టోరేజ్‌ క్యాబిన్‌ (సామాన్లు ఉంచే గది) తలుపు తీసినప్పుడు అక్కడ తంగవేలు మృతదేహం బయటపడింది.అసలు ఏం జరిగింది? సిద్ధార్థ పరిశోధన మొదలుపెట్టాడు.రాత్రి 11:30 గంటలకే తంగవేలును పాంట్రీకారులోని సీక్రెట్‌ స్టోరేజ్‌ ఏరియాలో ఎవరో చంపేశారు.సిద్ధార్థ తంగవేలు చేతి గడియారాన్ని గమనించాడు. అది రాత్రి 11:30 గంటలకే ఆగిపోయి ఉంది. గొడవ జరిగిన సమయంలో గడియారం కింద పడి ఆగిపోయిందని గ్రహించాడు.శవాన్ని రైలు నుంచి బయట పడేయడం సాధ్యం కాదు కాబట్టి, హంతకుడు ఎవరికీ అనుమానం రాకుండా కూరగాయలు, ఖాళీ డబ్బాలు ఉంచే పెద్ద డీప్‌ ఫ్రీజర్‌ అడుగున శవాన్ని దాచిపెట్టి, పైన సామాన్లు సర్దేశారు.

రాత్రి ఒంటి గంట సమయంలో తంగవేలులాగే డ్రెస్‌ వేసుకున్న ఒక సిబ్బంది, తల వంచుకుని పాంట్రీ నుంచి బయటకు వెళ్తున్నట్లు నమ్మించే ప్రయత్నం చేశాడు.రైలు నాంపల్లి స్టేషన్‌ ప్లాట్‌ఫారమ్‌ మీద ఆగడానికి సరిగ్గా 5 నిమిషాల ముందు, అందరూ సామాన్లు సర్దుకోవడంలో బిజీగా ఉన్నప్పుడు మేనేజర్‌ తెలివిగా శవాన్ని ఫ్రీజర్‌ నుండి తీసి, పాంట్రీకారులోని ఒక మూలగా ఉన్న సర్వీస్‌ డోర్‌ దగ్గర పడేశాడు. రైలు ఆగగానే అందరూ దిగిపోతుంటే, తను కూడా ఏమీ తెలియనట్టు పక్కకు తప్పుకున్నాడు.సిద్ధార్థ ఆ స్టోరేజ్‌ క్యాబిన్‌ తలుపుల దగ్గర రక్తపు మరకలు నేల మీద కాకుండా, పైభాగంలో ఉండటం గమనించాడు. అంటే శవాన్ని ఎక్కడి నుంచో తీసి ఇక్కడ పడేశారని గ్రహించాడు. ఫ్రీజర్‌ తెరిచి చూస్తే, అక్కడ తంగవేలు కోటు బటన్‌ దొరికింది. దాంతో అసలు రహస్యం బయటపడింది.

మేనేజర్‌ గురించి ఎంక్వయిరీ చేస్తే అసలు విషయం బయటపడింది.తరచూ సినిమా పనుల మీద పెద్దమొత్తం డబ్బుతో తిరిగే తంగవేలుతో పరిచయం పెంచుకుని, అతని దగ్గర పెద్దమొత్తం డబ్బు ఉండటం గమనించి, అదంతా బ్లాక్‌ మనీ అని తెలుసుకుని దొంగిలించే ప్రయత్నం చేశాడు. కుదరకపోవడంతో పెనుగులాటలో చంపేశాడు.ఆ హత్యను కప్పి పుచ్చుకోవడానికి ఈ డ్రామా ఆడాడు. వ్యక్తిగతమైన విషయాలు అపరిచితులతో పంచుకోవడం తంగవేలు చేసిన తప్పయితే, అత్యాశతో నేరం చేసి కటకటాల్లోకి వెళ్లడం మేనేజర్‌ స్వయంకృతాపరాధం. నేరానికి శిక్ష తప్పదు.  

∙శ్రీసుధామయి 

Advertisement
 
Advertisement
Advertisement