తరుచు కాళ్ల నొప్పులు వస్తున్నాయా? ఆ కారణాల వల్లే ఐతే..!

Frequent Pain In The Legs It Might Be Happening For 7 Reasons - Sakshi

కొందరు తరుచు కాళ్ల నొప్పితో బాధపడుతుంటారు. అదొక దీర్ఘకాలిక వ్యాధిలా ఇబ్బంది పెడుతుంటుంది. ఎందువల్ల వస్తుందో తెలయదు గానీ సడెన్‌గా వచ్చి నానా ఇబ్బందులు పెడుతుంటుంది. ఇలా ఎందుకు జరగుతుంది? ఏమైనా అనారోగ్యాలకు సంకేతమా? ప్రధాన కారణాలేంటి తదితరాల గురించే ఈ కథనం

కాళ్ల నొప్పికి చాలా కారణాలు ఉండొచ్చు. అది నొప్పి తీవ్రతపై కూడా ఆధారపడి ఉంటుంది. కొన్ని రకాల ఆరోగ్య సమస్యల కారణంగా కూడా ఇలా కాలి నొప్పి రావొచ్చు. అందుకు గల ప్రధాన కారణాలేంటో చూద్దాం

కండరాల ఒత్తిడి లేదా అతిగా కష్టపడినా..
కాలినొప్పిలో అత్యంత సాధారణ కారణాల్లో ఒకటి కండరాల ఒత్తిడి లేదా అతిగా నడవటం. తీవ్రమైన శారీరక శ్రమ, వ్యాయామం చేసే సమయంలో సరికాని విధానంల లేదా మీ కండరాలను వాటి పరిమితికి మించి నెట్టడం వల్ల జరగొచ్చు. 

గాయాలు లేదా ప్రమాదాలు
కాలికి ఏదైన గాయం లేదా ప్రమాదంలో కాళ్లకు తీవ్రంగా గాయం అయినా  ఈ నొప్పులు రావడం జరుగుతుంది. ఆ టైంలో బెణకడం జరిగి అది సెట్‌ అవ్వక కూడా తరుచుగా ఇలా కాలి నొప్పి రూపంలో ఇబ్బంది పెట్టొచ్చు. 

పెరిఫెరల్‌ ఆర్టరీ డిసీజ్‌(ప్యాడ్‌)
కాళ్లకు రక్తాన్ని సరఫరా చేసే ధమనుల్లో ఫలకం ఏర్పడినప్పుడూ ప్యాడ్‌ సంభవిస్తుంది. ఈ పరిస్థితి కండరాలకు రక్తప్రసరణను తగ్గిస్తుంది. ముఖ్యంగా కార్యకలాపాల సమయాల్లో నొప్పికి దారితీస్తుంది. ప్యాడ్‌ ఉన్న వ్యక్తుల కాళ్లల్లో తిమ్మిరి, లేదా బలహీనత సంభవించొచ్చు

నరాల కుదింపు
తుంటి లేదా తొడ వెనుక భాగపు నరములు కుదింపు లేదా చిట్లడం వల్ల నొప్పి రావొచ్చు. హెర్నియేటెడ్‌ డిస్కలు లేదా స్పైనల్‌ స్టెనోసిస్‌ వంటి పరిస్థితులు నరాల మీద ఒత్తిడికి దారితీయొచ్చు. ఫలితంగా నొప్పి, జలదరింపు లేదా తిమ్మిరి కాళ్లలో ఏర్పడి నొప్పిలా అనిపిస్తుంది.

పరిధీయ నరాల వ్యాధి
పరిధీయ నరాల వ్యాధి అనేది తరచుగా మధుమేహం, ఆల్కహాల్‌ సేవించడం లేదా కొన్ని మందుల కారణంగా పరిధీయ నరాలకు నష్టం జరగడంతో ఈ పరిస్థితి సంభవిస్తుంది. 

కీళ్ల సమస్య
కీళ్లను ప్రభావితం చేసే పరిస్థితులు లేదా ఆర్థరైటిస్‌ వంటివి కూడా కాళ్లనొప్పులకు దారితీస్తాయి. ఆస్టియో ఆర్థరైటిస్‌, రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ లేదా గౌట్‌ వంటివి కాళ్ల కీళ్లల్లో మంట, అసౌకర్యాన్ని కలిగిస్తాయి. 

డీప్‌ వెయిన్‌ థ్రాంబోసిస్‌
కాళ్లల్లో రక్తం గడ్డకట్టడం వల్ల ఎర్రగా వాపు వచ్చి నొప్పి వస్తుంది. డీప్‌ వెయిన్‌ థ్రాంబోసిస్‌(డీవీటీ)తో సంబంధం ఉన్న కాలు నొప్పి సాధారణంగా నిరంతరం తిమ్మిరి లాంటి అసౌకర్యం లేదా తీవ్రమైన నొప్పి ఉంటుంది. అంతేగాక ప్రభావిత ప్రాంతంలో వెచ్చగా ఎరుపుతో కూడిన నొప్పి ఉంటుంది. ఈ నొప్పి తొడ వరకు విస్తరించొచ్చు. కదిలిన లేదా నిలబడేందుకు చూసిన మరింత తీవ్రంగా నొప్పి వస్తుంది. ఇది తీవ్రంగాక మునుపే వైద్యుడిని తక్షణమే సంప్రదించాలి. లేదంటే రక్తం గడ్డకట్టుకుపోయిన ప్రాంతం చలనం కోల్పోయి తీసివేయడం లేదా ప్రాణాంతకంగానో మారొచ్చు. 

ముఖ్యంగా పైన చెప్పిన ఏవిధమైన అనుభూతి కలిగిన సమీపంలోని వైద్యుడిని సంప్రదించి, సూచనలు పాటించడం ఉత్తమం. సాధారణ నొప్పిగా నిర్లక్ష్యం వహిస్తే పూర్తిగా నడవలేని స్థితిని కొని తెచ్చుకోవద్దని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

(చదవండి: రాగిపాత్రల్లో ఈ పానీయాలను అస్సలు తాగొద్దు!)

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top