శత్రు సైన్యానికి కోట కట్టించి ఇచ్చారు!

Fort Blunder: The Fort That America Mistakenly Built in Canada - Sakshi

అప్పుడప్పుడూ పొరపాటున సరిహద్దు దాటి శత్రుదేశాల్లోకి ప్రవేశించే ప్రజలు, సైనికుల గురించి మనం తరచూ వింటుంటాం. అయితే, ఓ దేశసైన్యం పొరపాటున తమ శత్రువుల భూభాగంలోకి వెళ్లి ఓ కోట కట్టి, చివరికి దాన్ని వారికే అప్పగించిన వైనం తెలుసా? అయితే, ఇది చదవండి. అప్పటికే అమెరికా స్వాతంత్య్రం పొందినప్పటికీ పొరుగునే ఉన్న కెనడా మాత్రం ఇంకా బ్రిటన్‌ అధీనంలోనే ఉండేది. దీంతో బ్రిటీష్‌ దళాల నుంచి మళ్లీ ముప్పు తప్పదని అనుమానించిన అమెరికా ప్రభుత్వం కెనడా వైపున ఉన్న తమ సరిహద్దులను పటిష్టం చేసుకోవాలని భావించింది. అనుకున్నదే తడవుగా ఈశాన్యాన క్లింటన్‌ కౌంటీలోని న్యూయార్క్‌కు ఆనుకొని ఉన్న చాంప్లాన్‌ సరస్సు వద్ద ఓ సైనిక కోట నిర్మించడం ప్రారంభించింది.

కోట దాదాపు పూర్తవుతుందనగా ఆ ప్రదేశం తమ భూభాగంలో లేనట్లు అమెరికా గుర్తించింది. అది కెనడాలో ఉన్నట్లు సర్వేలో తేలడంతో వెంటనే కోట కోసం తరలించిన తమ సామగ్రిని వెనక్కు తెచ్చుకుంది. ఆ తర్వాత కోటకు ఉపయోగించిన రాళ్లు, తదితర వాటిని స్థానికులు కొంతమేర పట్టుకుపోయారు. చివరికి దీనిని కెనడా స్వాధీనం చేసుకుంది. అమెరికా ప్రభుత్వం ఇలా అనుకోకుండా తమ శత్రువుల భూభాగంలోనే కోటను కట్టి, చివరికి దాన్ని వారికే ఇచ్చివేయడంతో ఈ కోటకు ‘ఫోర్ట్‌ బ్లండర్‌’ అని పేరు పడింది. ఆ తర్వాత కాలక్రమంలో దీనికి ఫోర్ట్‌ మౌంట్‌గోమరీ అని పేరు పెట్టినప్పటికీ ఇప్పటికీ తొలిపేరు వాడుకలోనే ఉంది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top