
‘నేను అత్యంత క్రమశిక్షణ కలిగిన మోడల్‌ను. కానీ దీని కోసం భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. 37 ఏళ్ల వయసులో ఒక అసాధారణమైన రీతిలో బ్లడ్ క్యాన్సర్ నిర్ధారణ అయ్యింది. నేను ఐదు సంవత్సరాలు మించి బతకబోనని వైద్యులు చెప్పారు.. కానీ నా అంతరాత్మ మాత్రం నన్ను బలంగా నిలిపింది. ఇప్పడు నేను 53 ఏళ్ల వయసులో సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతున్నాను’ అని చెప్పుకొచ్చారు ప్రముఖ నటి, రచయిత లిసారే.
ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఎల్‌ఓ) హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో ‘ది మేనీ లైవ్స్ ఆఫ్ లిసా రే’ పేరిట బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ హోటల్‌లో ఇంటరాక్టివ్ సెషన్ మంగళవారం జరిగింది. ఇందులో లిసా రే తన జీవిత అనుభవాలను పంచుకున్నారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. ‘నా అత్యున్నత విజయ ఘడియ, నాకు అత్యంత చీకటి సమయంగా మారింది’ అంటూ ఆమె వాఖ్యానించారు.
మన ఆరోగ్యానికి మనమే సీఈఓ అన్నారు. ‘బాధ్యత తీసుకోండి, ఆరోగ్యానికి ప్రాధాన్యతనివ్వండి’ అన్నారు. విజయం సమస్యలు పరిష్కరించదని, మన భావోద్వేగం ఆత్మవేదనను తొలగించబోదని అభిప్రాయపడ్డారు. సమాజం నిర్వచించిన విజయాన్ని తానే ప్రశ్నించాల్సి వచ్చిందన్నారు. లోపల నా భావాలు వేరుగా ఉండడంతో, నేను లోతుగా వెతకాల్సి వచ్చిందని చెప్పారు.
రోగం అనేది దాచుకోవాల్సిన, సిగ్గుపడాల్సిన విషయం కాదు.. నా శరీరం, నా జీవితం, నా వ్యాధి.. అన్నీ అంగీకరించడం వల్ల నాకు నిజమైన విముక్తి లభించిందన్నారు. ధ్యానం నాకు ఆత్మస్థైర్యాన్ని ఇచ్చిందన్నారు. కార్లను శుభ్రం చేస్తాం.. ఇంటి చుట్టూ పరిసరాలను శుభ్రంగా ఉంచుతాం.. కానీ మన మనసులోని నెగెటివ్ ఆలోచనలను ఎందుకు శుభ్రం చేయలేకపోతున్నామని ప్రశ్నించారు.
దేశం పరిపూర్ణం కాకపోయినా, జీవించడానికి ఇది ఉత్తమ స్థలమని పేర్కొన్నారు. హైదరాబాద్ నాకు ఎంతో ప్రత్యేకం. ఇక్కడి ప్రజల ఆత్మీయత, ప్రేమతోపాటు ఆహారాన్ని, ఇతర రంగాలన్నింటినీ నేను ప్రేమిస్తాను. మళ్లీ మళ్లీ ఇక్కడికే వస్తుంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌ఎల్‌ఓ హైదరాబాద్ చైర్‌పర్సన్ ప్రతిభా కుందా తదితరులు పాల్గొన్నారు.
(చదవండి: ఆ ఆస్తిపై మీ తల్లికి మాత్రమే హక్కులు..)