అచ్చం నాన్న లానే!

Father Wax Replica Wedding - Sakshi

తమిళనాడులో ఉంటున్న లక్ష్మీప్రభకు పెళ్లి నిశ్చయమైంది. పెళ్లి సమయం దగ్గరపడుతున్నా చెల్లెలు బాధగా ఎందుకు ఉంటోందో అక్క భువనేశ్వరి అర్థం చేసుకుంది. తన పెళ్లి చూడకుండానే తండ్రి మరణించాడనే కారణంగా చెల్లెలు ఏ మాత్రం సంతోషం లేదని భువనేశ్వరికి తెలుసు. పెళ్లి సమయానికి తండ్రి మైనపు విగ్రహాన్ని 6 లక్షలు వెచ్చించి, తయారు చేయించి మండపంలో ఉంచింది. మండపంలో తండ్రి(విగ్రహాన్ని)ని చూసిన లక్ష్మీ ప్రభ ఆనందంతో కన్నీరు పెట్టుకుంది. పెళ్లి తర్వాత తండ్రి ఆశీర్వాదం తీసుకుంది. చెల్లెలు ఆనందమే తనకు కావాల్సింది అని లక్ష్మీప్రభను దీవిస్తూ అక్క భువనేశ్వరి చెప్పిన మాటలు అతిథులనూ ఆనందింపజేశాయి. అక్కాచెల్లెళ్ల అనుబంధం ఎప్పుడూ ఇలాగే ఉండాలంటూ అతిథులు వారికి అభినందనలు తెలిపారు.

కొత్త ఇంటిలో తన గృహలక్ష్మితో కలిసి గృహప్రవేశం వేడుక జరుపుకోవాలనుకున్న పారిశ్రామికవేత్త శ్రీనివాస్‌ గుప్తా తన దివంగత భార్య మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. కర్ణాటకలో జరిగిన ఈ వేడుక వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌ అయ్యాయి. ఇలాగే చాలా మంది తాము పోగొట్టుకన్న ప్రియమైనవారిని విగ్రహాల ఏర్పాటుతో బాధను తగ్గించుకుంటున్నారు. ఇటీవల తమిళనాడు వాసి అయిన లక్ష్మీ ప్రభ వివాహంలో ఆమె తండ్రి మైనపు విగ్రహం సమక్షంలో పెళ్లి జరగడం, ఆ వేడుక భావోద్వేగాలకు ప్రతీకగా నిలవడం అందరినీ ఆకట్టుకుంది.

డబ్బు కన్నా ఆనందం మిన్న
లక్షీప్రభ తండ్రి ఈ ప్రపంచంలో లేరు. తండ్రి లేకపోవడంతో ఆమె రోజూ బాధపడేది. ఇంతలో, ఆమె ఇంట్లో వివాహానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. దీంతో ఆమె ఇంకా నిరాశకు గురైంది. తండ్రి లేకుండా ఈ పెళ్లి అవసరమా అంటూ మాట్లాడేది. లక్ష్మీప్రభ అక్క భువనేశ్వరి చెల్లెలికి ఆనందాన్ని తిరిగి ఇవ్వడానికి ఒక ప్రత్యేకమైన మార్గాన్ని కనుగొంది. తమ తండ్రి మైనపు విగ్రహాన్ని తయారుచేయించి లక్ష్మీప్రభ పెళ్లికి బహుమతిగా ఇచ్చింది. ఈ విగ్రహ తయారీకి భువనేశ్వరి 6 లక్షలు ఖర్చు చేసింది. విగ్రహానికి ఎక్కువ ఖర్చు అవుతుందని చెప్పినా, ‘నా చెల్లెల ముఖంలో ఆనందాన్ని చూడాలనుకుంటున్నాను, ఆ ఆనందం ముందు ఈ ఖర్చు ప్దెదది కాదు’ అంది భువనేశ్వరి. పెళ్లి రోజున తండ్రితో కలిసి ఉన్నారనే భావనతో లక్ష్మీప్రభ ఆనందంతో పొంగిపోయింది. అక్క ఇచ్చిన అపురూపమైన కానుకకు ఆనందంతో కన్నీరు పెట్టుకుంది. పెళ్లి కాగానే తన భర్తతో కలిసి తండ్రి ఆశీర్వాదం కూడా తీసుకుంది లక్ష్మీ ప్రభ. చెల్లెలు ఆనందం కోసం భువనేశ్వరి చేసిన ఈ ప్రయత్నం విజయవంతమైంది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top