గౌరవ మర్యాదలు | Sakshi
Sakshi News home page

గౌరవ మర్యాదలు

Published Mon, Oct 2 2023 5:35 AM

Explanation of Courtesy, respectability - Sakshi

మర్యాద అనే మాటకి హద్దు, చెలియలికట్ట అనే అర్థాలున్నాయి. వ్యవహారంలో గౌరవమర్యాదలని కలిపి జంటపదాలుగా వాడుతాము. ఇతరుల చేత చెప్పించుకోకుండా తన హద్దుల్లో తాను ఉండటం మర్యాద. చెలియలికట్ట అంటే సముద్రానికి ఒడ్డు. నదులు, చెరువులు మొదలైన వాటికి ఒక ఒడ్డు ఉంటుంది. అవి కొన్ని సార్లు ఒడ్డుని తెగ కొట్టి విజృంభించటం చూస్తాం. కాని, సముద్రానికి ఎవరు ఒక ఒడ్డుని తయారు చేయలేదు. ‘ఈ గీత దాటవద్దు’ అని ఎవరూ కట్టడి చేయలేదు. అయినా ఎటువంటి సమయంలోనూ చెలియలికట్టని దాటి సముద్రుడు భూభాగంలో ప్రవేశించటం చూడం మనం. మనిషి విషయం కూడా అంతే!  

కొన్ని రకాలైన రీతి, రివాజులని, తీరు తెన్నులని ప్రవర్తనా నియమావళిని నేర్పే పద్ధతులు అనేకం ఉన్నాయి. చిన్నతనంలో ఇంట్లో పెద్దలు ఏం చేయాలి? ఏం చేయకూడదు? మొదలైన విషయాలని  కొన్ని మాటలతోనూ, కొన్ని చేతలతోనూ నేర్పిస్తారు. కొన్ని చదువుకోటం వల్ల తెలుస్తాయి. కొన్ని ఎవరూ చెప్పరు. చెప్పాలని కూడా తెలియదు. ప్రతివ్యక్తి తనంతట తానుగా తెలుసుకుని అమలు చేయవలసి ఉంటాయి. ఎదుటి వారికి ఆ విషయం చెప్పటానికి ఇబ్బందిగా ఉంటుంది. అవతలి వారిని ఇబ్బంది పెట్టకుండా ధర్మబద్ధంగా ఉండే ప్రవర్తనని మర్యాద అనవచ్చునేమో! ఎవరి చేతా చెప్పించుకోకుండా తన పరిమితుల్లో తాను ఉండటం మర్యాద. సముద్రం గట్టు లేకపోయినా తన హద్దు తాను దాటనట్టు.

ఉదాహరణకి – ఒక గదిలోకి ప్రవేశించాం అనుకోండి. ముందు వెళ్ళిన వారు లోపలికి వెళ్ళాలి. వెనక నున్న వారు అప్పుడే కదా లోపలికి అడుగు పెట్టటానికి వీలు కలిగేది. అదే కాస్త పదవో, అధికారమో ఉన్న వాళ్ళు అయితే, కదలమని చెప్పలేరు. బహుళ అంతస్థుల భవనాల్లో లిఫ్ట్‌ దగ్గర తరచూ ఎదుర్కొనే సమస్య ఇది. చెపితే,‘‘మాకు తెలియదా? మీరు చెప్పాలా? జరుగుతాం లెండి. అంత తొందర ఎందుకు?’’ అని పెద్ద బోధ చేస్తారు. నిజానికి చెప్పించుకున్నామే, అని సిగ్గుపడాలి. ముందు లోపలికి వెళ్ళిన వారు వెనక ఉన్న వారికి అవకాశం కలిగించాలనే నియమం ఎక్కడా రాసి లేదు. అయినా పాటించాలని తెలుసు కనకనే నీది తప్పు అనలేక ఎదురు దాడికి దిగటం.

ఎవరైనా నిద్రపోతూ ఉంటే గట్టిగా పాటలో, టీవీనో పెట్టుకోవటం గురించి ఎక్కడా ప్రస్తావన లేదు కనక నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను అనటం మూర్ఖత్వం అవుతుందా? కాదా? నలుగురి మధ్యలో ఉన్నప్పుడు చికాకు కలిగించే చేష్టలు, శబ్దాలు చేయటం, జుగుప్సావహంగా ప్రవర్తించటం ఆమోదయోగ్యం కాదు కదా! వెకిలి చేష్టలు ఎప్పుడైనా, ఎక్కడైనా అమర్యాదగా పరిగణించ బడతాయి. సభల్లో, సమావేశాలలో కొన్ని పాటించవలసిన పద్ధతులు నిర్దేశించ బడతాయి. కొన్ని పేర్కొనక పోయినా అమలు జరుగుతూ ఉంటాయి. సమాజంలో కూడా అంతే! ఉదాహరణకి పెద్దలు మాట్లాడుకుంటుంటే పిల్లలు మధ్యలో కలిగించుకో కూడదు. అసలు ఆ ప్రాంతంలో ఉండకూడదు. ఒక వేళ ఉండటం తటస్థిస్తే, పేరు పెట్టి పిలిచి మాట్లాడమంటే తప్ప నోరు విప్పకూడదు. రామాయణంలో రాముడు బాలకాండ మొత్తం మీద మాట్లాడిన మాటలు వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. మర్యాదాపురుషోత్తముడు కదా! సభల్లో కూడా ఇదే పాటించ వలసిన నియమం. మర్యాద ప్రవర్తన వల్ల లభిస్తుంది. అడిగితే రాదు. కనుకనే మర్యాద గౌరవంతో జత కలిసి ఉంటుంది.   

సున్నితమైన విషయాలు ప్రస్తావించక పోవటం ఒక మర్యాద. ఏ విషయం ప్రస్తావిస్తే బాధ కలుగుతుందో దానిని తనంత తాను ఎత్తక పోవటం మర్యాదస్తుల లక్షణం. మర్యాద ఇచ్చి పుచ్చుకోవలసినది. వస్త్రధారణ, మాటతీరు, నడతలలో మర్యాద వ్యక్తమౌతుంది. మర్యాదస్తులకి మాత్రమే సమాజంలో గౌరవం లభిస్తుంది. 

– డా. ఎన్‌. అనంతలక్ష్మి

Advertisement
Advertisement