ఆ సమయంలో ఆందోళన, కోపం, చిరాకు బాగా ఇబ్బందిపెడుతున్నాయి.. సలహాఇవ్వండి.. | Sakshi
Sakshi News home page

ఆ సమయంలో ఆందోళన, కోపం, చిరాకు బాగా ఇబ్బందిపెడుతున్నాయి.. సలహాఇవ్వండి..

Published Sun, Oct 31 2021 12:26 PM

Dr Venati Shobha Gynecology Suggestions In Funday Magazine - Sakshi

మాకు పెళ్లయి ఆరేళ్లయింది. ఇంకా పిల్లల్లేరు. మా వారికి స్పెర్మ్‌ కౌంట్, మొబిలిటీ బాగానే ఉంది గాని, మార్ఫాలజీ తక్కువ ఉన్నట్లు రిపోర్టు వచ్చింది. మా సమస్యకు పరిష్కారం తెలపండి.
– సత్యవతి, ఈ–మెయిల్‌
పిల్లలు కలగకపోవడానికి 35 శాతం ఆడవారిలో లోపాలు, 35 శాతం మగవారిలో లోపాలు, మిగిలిన 30 శాతం ఇద్దరిలో లోపాలు కారణమవుతాయి. మగవారి లోపాలలో ముఖ్యమైన కారణం వీర్యకణాల సంఖ్య, కదలిక, నాణ్యతలో లోపాలు. మీ వారిలో వీర్యకణాల సంఖ్య, కదలిక బాగానే ఉన్నా, వాటి నాణ్యత (మార్ఫాలజీ) సరిగా లేకపోవడం వల్ల అవి అండంలోనికి చొచ్చుకు పోలేవు. దానివల్ల అండం ఫలదీకరణ సరిగా జరగకపోవచ్చు. నాణ్యతలేని వీర్యకణాల వల్ల పిండం సరిగా ఏర్పడకపోవచ్చు. దానిల్ల గర్భం సరిగా నిలబడకపోవడం, అబార్షన్లు కావడం, బిడ్డలో అవయవ లోపాలు వంటి సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. వీర్యకణాలలో తల, మెడ, తోక అనే మూడు భాగాలు ఉంటాయి. వీటిలో ఏదో ఒక భాగంలో లేదా అన్ని భాగాలలో లోపాలు ఉండవచ్చు.

సాధారణంగా వీర్యకణాలలో 4 శాతం కంటే ఎక్కువ వీర్యకణాలు నాణ్యత కలిగి ఉంటే, గర్భం రావడానికి అవకాశాలు బాగా ఉంటాయి. పొగతాగడం, మద్యం తాగడం వంటి అలవాట్లు ఉన్నా, సుగర్, అధిక బరువు, మానసిక ఒత్తిడి, వేరికోసిల్, ఇన్ఫెక్షన్లు ఇంకా ఇతర సమస్యలు ఉన్నట్లయితే వీర్యకణాల నాణ్యత సరిగా ఉండకపోవచ్చు. ఇన్ఫెక్షన్లు ఉంటే సరైన కోర్సు యాంటీబయోటిక్స్, యాంటీ ఆక్సిడెంట్‌ మాత్రలు వాడటం, దురలవాట్లు, జంక్‌ఫుడ్, కూల్‌డ్రింక్స్‌ వంటివి మానుకోవడం, సుగర్‌ అదుపులో పెట్టుకోవడం, మితమైన పౌష్టికాహారం తీసుకుంటూ, యోగా, ధ్యానం వంటివి అలవరచుకోవడం వంటివి డాక్టర్‌ సలహా మేరకు పాటించాలి. అలాగే, అవసరమైన పరీక్షలు చేయించుకుని కారణాన్ని బట్టి చికిత్స తీసుకోవడం వల్ల కూడా వీర్యకణాల నాణ్యత పెరిగే అవకాశాలు బాగా ఉంటాయి.

చదవండి: ఇలా చేస్తే .. ఎప్పటినుంచో వెంటాడుతున్న చుండ్రు సమస్య పరార్‌!!

నా వయసు 23 ఏళ్లు. నాకు ఏడాది కిందట పెళ్లయింది. నెలసరి సమయంలో ఆందోళన, చిరాకు, కోపం బాగా ఇబ్బందిపెడుతున్నాయి. పుట్టింట్లో ఉన్నప్పుడు కోపంతో అరిచినా, చిరాకు పడినా ఎవరూ ఏమీ అనేవారు కాదు. ఇప్పుడు నా భర్తపై చిరాకు చూపిస్తుండటంతో ఇద్దరికీ తరచు గొడవలు జరుగుతున్నాయి. నా సమస్యకు పరిష్కారం సూచించగలరు.
– మానస, ఏలూరు
కొందరిలో పీరియడ్స్‌ మొదలయ్యే పది పదిహేను రోజుల ముందే ప్రొజెస్టిరాన్‌ హార్మోన్‌లో మార్పుల వల్ల, కొన్ని మినరల్స్‌ లోపం వల్ల, ఇంకా ఎన్నో తెలియని కారణాల వల్ల కోపం, చిరాకు, ఆందోళన, శరీరం బరువెక్కినట్లు ఉండటం, రొమ్ముల్లో నీరు చేరి రొమ్ములు నొప్పిగా బరువుగా ఉండటం వంటి లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయి. దీనినే ప్రీమెన్‌స్ట్రువల్‌ సిండ్రోమ్‌ అంటారు. దీనికి చికిత్సలో భాగంగా మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం, నడక వంటివి చేస్తూ, డాక్టర్‌ పర్యవేక్షణలో ప్రైమ్‌రోజ్‌ ఆయిల్, మినరల్స్, విటమిన్స్‌తో కూడిన మందులు, ఇంకా ఇతర అవసరమైన మందులు మూడు నెలల పాటు వాడి చూడవచ్చు. జీవనశైలిలో మార్పులు, ఆహారంలో ఉప్పు తగ్గించి తీసుకోవడం, వంటి జాగ్రత్తలు పాటించడం మంచిది. అలాగే మీ వారికి ఈ సమస్య గురించి వివరించి చెబితే ఆయన మీ పరిస్థితిని అర్థం చేసుకుని, సర్దుకుపోవడం జరుగుతుంది.

చదవండి: అందుకే కార్డియాక్ అరెస్ట్ సంభవిస్తుందట..! ఇలా చేస్తే ప్రాణాలు నిలుపుకోవచ్చు..

మా అమ్మాయి వయసు 13 ఏళ్లు. ఆరు నెలల కిందటే రజస్వల అయింది. రెండు నెలలుగా తనకు విపరీతంగా తెల్లబట్ట అవుతోంది. దుర్వాసన వస్తోంది. దయచేసి ఈ సమస్యకు పరిష్కారం చెప్పగలరు.
– వందన, నరసన్నపేట
సాధారణంగా అమ్మాయిలలో వాసన, దురద లేని తీగలలాగ, నీరులాగ కొద్దిగా వచ్చే తెల్లబట్ట సాధారణం. ఇది యోనిలోని గ్రంథుల నుంచి ఊరుతుంది. ఈ తెల్లబట్ట పీరియడ్‌ వచ్చే ముందు పీరియడ్‌ మధ్యలో ఎక్కువగా ఉండటం సహజం. కొందరిలో కడుపులో నులిపురుగులు ఉన్నా, మలబద్ధకం వల్ల కూడా తెల్లబట్ట ఎక్కువగా కావచ్చు. శారీరక శుభ్రత, జననావయవాల వద్ద వ్యక్తిగత శుభ్రత సరిగా లేకపోయినా, రక్తహీనత, పోషకాహార లోపం వంటి సమస్యలు ఉన్నా, వైరల్, బ్యాక్టీరియల్, ఫంగల్, ప్రోటోజోవల్‌ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి.

మీ అమ్మాయికి పాలు, పండ్లు, కూరగాయలు, ఆకు కూరలు, పప్పులతో కూడిన మితమైన పోషకాహారం ఇవ్వండి. మలవిసర్జన తర్వాత ముందు నుంచి వెనక్కు శుభ్రపరచుకోవాలి. వెనుక నుంచి ముందు వైపుకి శుభ్రపరచుకోవడం ద్వారా మలద్వారం దగ్గర బ్యాక్టీరియా ముందువైపు పాకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గైనకాలజిస్టును సంప్రదించి, ఇతరత్రా సమస్యలేవైనా ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి పరీక్షలు చేయించుకుని, దానిని బట్టి సరైన మందులు వాడుకోవడం మంచిది.

- డా. వేనాటి శోభ
 గైనకాలజిస్ట్‌
హైదరాబాద్‌

చదవండి: ఐదేళ్లుగా వెతుకులాట.. దొరికిన గోల్డ్‌ ఐలాండ్‌.. లక్షల కోట్ల సంపద!

Advertisement
 
Advertisement