దగ్గు, గొంతు నొప్పికి ఆయుర్వేదంలో పరిష్కారాలేంటీ?

Dr-Naveen Nadiminti Ayurvedic Solutions For Calf-Sore-Throat-Infections - Sakshi

ఆయుర్వేద చికిత్సలో తులసి ప్రధానమైంది. పొడి దగ్గు కోసం తులసి టీ తరచుగా తీసుకోవచ్చు. దగ్గును వదిలించుకోవడానికి మరియు కఫాన్ని తగ్గించడానికి, అలాగే అలెర్జీలు, ఉబ్బసం లేదా ఊపిరితిత్తుల వ్యాధి వల్ల కలిగే దగ్గు లక్షణాలను మెరుగుపరచడంలో తులసి సహాయపడుతుంది. తులసి ఆకుల రసంలో తేనెను కలిపి తీసుకున్నట్లయితే, జలుబు వల్ల కలిగే గొంతు నొప్పి, దగ్గు వంటి బాధలు తగ్గుతాయి. అల్లంలో ఉప్పు కలిపి పొంగించిన ఇంగువను కలిపి చిన్న చిన్న ఉండలు చేసుకుని మింగితే కూడా నొప్పి తగ్గుతుంది. 

కఫంలో అప్పుడప్పుడు రక్తం కనిపించడం, గొంతు నొప్పి 
కఫంలో రక్తం వస్తే అది శరీరంలో అధిక వేడిని సూచిస్తున్నట్టు అర్థం. అలాగే గొంతు నొప్పి కూడా వేడి వల్ల వస్తుంది. కఫంలో రక్తం ఇన్ఫెక్షన్, ఊపిరితిత్తుల క్యాన్సర్ లేదా పల్మనరీ ఎంబోలిజం వంటి తీవ్రమైన అంతర్లీన వైద్య పరిస్థితిని ఇది తెలుపుతుంది. 

ఆయుర్వేదంలో పరిష్కారమేంటీ?
చిటికెడు నీళ్ళలో పసుపు వేసి మరిగించి ఆ ఆవిరిని రోజుకి పదిసార్లు పట్టాలి. పాలు, మిరియాలు పొడి పసుపు కలిపి మరిగించి రాత్రి పడుకునే ముందు తాగితే రిలీఫ్‌ ఉంటుంది. అలాగే ఉదయం లేవగానే తులసి ఆకుల రసం తేనేతో కలిపి తీసుకుంటే త్వరగా జలుబూ గొంతు నొప్పి, దగ్గు తగ్గుతాయి.

జలుబు లేకపోయినా రాత్రి పొడి దగ్గు వస్తే ఎలా తగ్గించాలి?
శరీరంలో నీరు సరిపోక ఒంట్లో వేడి చేసినప్పుడు ఇలా దగ్గు వస్తుంది. దగ్గు అప్పటికప్పుడు వెంటనే తగ్గదు కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కొంత రిలీఫ్‌ ఉంటుంది.
- ఉప్పు,నీళ్ళు గొంతు దాకా పుక్కిలించడం
- మిరియాల కషాయం (రుచించడం కోసం కొంత బెల్లం కూడా కలపవచ్చు)
- గోరు వెచ్చటి నీళ్లలో తేనె, నిమ్మరసం ఉపశమనాన్ని కలిగిస్తుంది.
ఇలాంటి సమస్య నివారణ కోసం దప్పిక వేసినప్పుడల్లా అశ్రద్ధ చేయకుండా కావలసినన్ని నీరు తాగడం అలవాటు చేసుకుంటే మంచిది.

అదే పనిగా తేన్పులు.. ఏం చెయ్యాలి?
జీర్ణాశయంలో ఆమ్లం ఎక్కువైనప్పుడు తేన్పు వచ్చినప్పుడు గాలితో పాటు ఆమ్లం గొంతు వరకు వస్తుంది. దానితో గొంతు మంటగా మారుతుంది.
- ఆహారంలో మసాలాలు తక్కువగా ఉపయోగించాలి. సాత్వికాహారం తీసుకోవాలి. ఆహారం తీసుకోవడానికి సమయపాలన పాటించాలి.

రాత్రి పూట గొంతులో మంట ఎందుకు వస్తుంది?
ఈ సమస్య వచ్చింది అంటే మీకు ఎసిడిటీ లేదా ఆసిడ్ రిఫ్లెక్స్ ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. 
- రాత్రి పూట మసాలాలు, బాగా కారం, ఘాటు ఉన్న పదార్థాలు తగ్గించండి.
- వీలుంటే 7, 8 గంటలకు ముందే రాత్రి భోజనం పూర్తి చేయాలి
- దాని వల్ల గొంతు సాఫీగా ఉంటుంది. ఇబ్బంది రాదు.
- డా. నవీన్‌ నడిమింటి, ఆయుర్వేద నిపుణులు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top