కణాల కంట్రోలర్‌ | Dr Jazzini Selected As Outstanding Young Person of the World | Sakshi
Sakshi News home page

కణాల కంట్రోలర్‌

Nov 5 2020 8:11 AM | Updated on Nov 5 2020 8:40 AM

Dr Jazzini  Selected As  Outstanding Young Person of the World - Sakshi

నివారణపై ఒక కన్ను. నిర్థరణపై ఇంకో కన్ను. చికిత్సకు మరో కన్ను. బ్రెస్ట్‌ క్యాన్సర్‌పై.. మూడు కళ్లు వేసి ఉంచారు డాక్టర్‌ వర్ఘీస్‌! పరిశోధన మూడో కన్ను. జన్యువుల్ని గమనిస్తూ.. కణాల్ని కంట్రోల్‌ చేస్తుంటారు. ఈ వైద్య త్రినేత్రి ఈ ఏడాది ‘పర్సన్‌ ఆఫ్‌ ది వరల్డ్‌’! డాక్టర్‌ జాజినీ వర్ఘీస్‌ కణజాల పునర్నిర్మాణ వైద్య చికిత్సా నిపుణురాలు, ప్లాస్టిక్‌ సర్జన్‌. లండన్‌లోని ‘రాయల్‌ ఫ్రీ హాస్పిటల్‌ అండ్‌ యూనివర్సిటీ కాలేజ్‌’కి ఆంకోప్లాస్టిక్‌ బ్రెస్ట్‌ సర్జరీ కన్సెల్టెంట్‌గా ఉన్నారు. వైద్యరంగంలో యంగ్‌ టాలెంట్‌ను గుర్తించి సత్కరిస్తుండే జూనియర్‌ ఛాంబర్‌ ఇంటర్నేషనల్‌ (జె.సి.ఐ.) అనే అంతర్జాతీయ సంస్థ ఈ ఏడాది ‘ఔట్‌స్టాండింగ్‌ యంగ్‌ పర్సన్‌ ఆఫ్‌ ది వరల్డ్‌’గా డాక్టర్‌ జాజిని ని ఎంపిక చేసింది! వినూత్య వైద్యావిష్కరణ కేటగిరీలో ఆమెకు ఈ అత్యున్నతస్థాయి గౌరవం దక్కింది.

బ్రెస్ట్‌ క్యాన్సర్‌ నివారణ, నిర్థరణ, చికిత్సలలో మరింత మెరుగైన ఫలితాలను సాధించేందుకు డాక్టర్‌ జాజిని కనిపెట్టిన అద్భుతమైన విధానాలకు, అభివృద్ధి చెందుతున్న దేశాలలో బ్రెస్ట్‌ క్యాన్సర్‌ను నివారించే ‘ఎర్లీ స్క్రీనింగ్‌’కు అవసరమైన వ్యూహాలను రూపొందించినందుకు జె.సి.ఐ. ఈ అవార్డును ప్రకటించింది. నలభై ఏళ్ల లోపు శాస్త్ర పరిశోధకులకు ఇచ్చే అవార్డు ఇది. వైద్యరంగ విభాగానికి 110 దేశాల నుంచి వచ్చిన ఎంట్రీలలో యూ.కె. నుంచి పది మంది గట్టి పోటీ ఇచ్చినప్పటికీ బ్రెస్ట్‌ క్యాన్సర్‌ పరిశోధకురాలిగా డాక్టర్‌ జాజినీ సాధించిన ఘనత ఆమెను విజేతగా నిలబెట్టింది. జె.సి.ఇ. ఇంకా బిజినెస్, పాలిటిక్స్, విద్యారంగం, సంస్కృతి, శిశు సంక్షేమం, ప్రపంచ శాంతి, శాస్త్ర పురోగమనం వంటి విభాగాలలో అవార్డును ప్రదానం చేస్తుంటుంది. 

బ్రెస్ట్‌ క్యాన్సర్‌కు గురైన వారి జీవితాన్ని నాణ్యమైనదిగా పునర్నిర్మించడం డాక్టర్‌ వర్ఘీస్‌ లక్ష్యం! ఆ ధ్యేయంతోనే ఆమె బ్రెస్ట్‌ క్యాన్సర్‌పై అధ్యయనాలను, పరిశోధనలను తన జీవితాశయంగా ఎంచుకున్నారు. బ్రెస్ట్‌ క్యాన్సర్‌ చికిత్సా విధానాలను నిరంతరం అత్యాధునిక స్థాయికి  తీసుకెళుతూనే ఉండాలన్నది ఆమె ప్రయత్నం. కేరళలోని ముత్తొం హరిపాద్‌ ఆమె స్వస్థలం. మెడిసిన్‌ చదివి బ్రిటన్‌ వెళ్లారు. తండ్రి జార్జి, తల్లి జాలీ వర్ఘీస్‌ కేరళలోనే ఉంటారు. భర్త, ఇద్దరు పిల్లలతో డాక్టర్‌ జాజిని లండన్‌లో స్థిరపడ్డారు. అయితే తన అభివృద్ధి కోసం ఆమె స్వదేశాన్ని వదులుకుని వెళ్లిపోలేదు. ‘‘విదేశాల్లో వైద్య పరిశోధనలు జరపడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాటిని ఉపయోగించుకుని మానవాళి ఆరోగ్యానికి మేలు జరిగే విధానాలు కనిపెట్టేందుకే ఇంత దూరం వచ్చాను’’ అని డాక్టర్‌ వర్ఘీస్‌ తరచు చెబుతూ ఉంటారు.

పదిహేడేళ్ల క్రితం మెడిసిన్‌ ప్రాక్టీస్‌ కోసం లండన్‌ వెళ్లిన వర్ఘీస్‌ మొదట చేసిన పని భారతీయ వైద్య విద్యార్థులకు విద్యానంతర గ్రామీణప్రాంత సేవల ఒప్పందంతో స్కాలర్‌షిప్‌లను ఏర్పాటు చేయాలని అక్కడి ప్రభుత్వానికి ప్రతిపాదించడం. డాక్టర్‌ వర్ఘీస్‌ ప్రస్తుతం యు.సి.ఎల్‌. (యూనివర్సిటీ కాలేజ్‌ లండన్‌)లో లెక్చరర్‌గా పని చేస్తున్నారు. బ్రెస్ట్‌ క్యాన్సర్‌ రిసెర్చ్‌లో ఈ చిన్న వయసులోనే అనేక ఇంగ్లండ్‌ సంస్థల నుంచి అవార్డులు అందుకున్నారు. ‘జెనిటిక్స్‌ ఆఫ్‌ బ్రెస్ట్‌ క్యాన్సర్‌’పై ఎం.ఫిల్‌., పిహెచ్‌.డి చేయడానికి కేంబ్రిడ్జి యూనివర్సిటీ నుంచి స్కాలర్‌షిప్‌లు పొందిన అతి కొద్ది మంది భారతీయ వైద్యులలో డాక్టర్‌ వర్ఘీస్‌ ఒకరు. తాజాగా వచ్చిన ‘ఔట్‌స్టాండింగ్‌ యంగ్‌ పర్సన్‌ ఆఫ్‌ ది వరల్డ్‌’ అవార్డు అందుకోడానికి వచ్చే నెల ఆమె జపాన్‌ వెళుతున్నారు. జె.సి.ఐ. ఈసారి జపాన్‌లో అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement