
మగజాతి ఉనికికి కీలకమైన ‘వై’ క్రోమోజోమ్ క్షీణించిపోతోంది. ఈ పరిస్థితిపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
భూమ్మీద మగజాతి అంతరించిపోతుందా అనే భయాలు కూడా ఉన్నాయి. ఇప్పటికిప్పుడే అంత ముప్పేమీ లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందుకు కొన్ని కోట్ల సంవత్సరాలు పడుతుందని అంటున్నారు. ‘వై’ క్రోమోజోమ్ క్షీణతపై ఇటీవలి కాలంలో అంతర్జాతీయంగా వైద్య పరిశోధకుల్లో చర్చ జరుగుతోంది. దీనిపై విస్తృత పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. ఈ ‘వై’ వర్రీ గురించి తెలుసుకుందాం.
పురుషుల కంటే మహిళల ఆయుర్దాయం ఎక్కువ. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితి. పురుషుల ఆయుర్దాయం తక్కువగా ఉండటానికి అనేక సామాజిక, శారీరక కారణాలు ఉన్నాయి. ధూమపానం, మద్యపానం వంటి వ్యసనాలు పురుషుల్లోనే ఎక్కువ. ఇక మహిళల్లో ఉండే ఈస్ట్రోజన్ హార్మోన్ వారికి రకరకాల ఆరోగ్య పరిస్థితుల నుంచి సహజ రక్షణ కల్పిస్తుంది. మహిళల్లోని ఇరవైమూడు జతల క్రోమోజోమ్‌లలోనూ రెండేసి ఎక్స్ క్రోమోజోమ్‌లు ఉంటాయి. పురుషుల్లో ఇరవైమూడో జతలో ఒక ‘ఎక్స్’, ఒక ‘వై’ క్రోమోజోమ్‌లు ఉంటాయి. ఒక ‘ఎక్స్’ క్రోమోజోమ్ కంటే, రెండు ‘ఎక్స్’ క్రోమోజోమ్‌లు ఉండటం కూడా మహిళల ఆయుర్దాయం ఎక్కువగా ఉండటానికి కారణం అనే అభిప్రాయం కూడా ఉంది. ఇలా చెబుతూ పోతే ఈ జాబితా చాలానే ఉంటుంది. పురుషుల కంటే మహిళల ఆయుర్దాయం ఎక్కువగా ఉండటానికి గల కారణాలపై రకరకాల ప్రచారాలు ఉన్నాయి.
వాటిలో కొన్ని వాస్తవాలు, ఇంకొన్ని అవాస్తవాలు ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, పురుషుల్లోని ‘వై’ క్రోమోజోమ్ క్షీణిస్తున్నట్లుగా ఇటీవలి పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ‘వై’ క్రోమోజోమ్ పురుషుల అస్తిత్వానికి కీలకమైనది. వయసు పెరిగే కొద్ది పురుషుల్లోని ‘వై’ క్రోమోజోమ్ తన జన్యుకణాలను కోల్పోతూ ఉంటుంది. ఈ కణాలు కోల్పోయే వేగాన్ని బట్టి వార్ధక్య లక్షణాలు కనిపిస్తాయి. వార్ధక్యంలో వచ్చే వ్యాధులు కూడా చుట్టుముడతాయి. ‘వై’ క్రోమోజోమ్ కణాల క్షీణత ఈ మేరకు మాత్రమే పరిమితమైతే ఏ ఆందోళనా అక్కర్లేదు. ‘వై’ క్రోమోజోమ్ పూర్తిగా అంతరించిపోయే పరిస్థితి కూడా ఉందని కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇదే జరిగితే, భూమ్మీద పురుషజాతి అంతరించిపోతుంది.
పురుషజాతి పూర్తిగా అంతరించిపోతే, భూమ్మీద మహిళలు మాత్రం ఎంతకాలమని మనుగడ సాగించగలరు? ‘వై’ క్రోమోజోమ్ అంతరించిపోతే, యావత్ మానవాళి కూడా భూమ్మీద అంతరించిపోతుందా? ఇలా ఈ అంశంపై అనేకమైన ప్రశ్నలు ఉన్నాయి. ‘వై’ క్రోమోజోమ్ క్షీణత వల్ల ఏర్పడబోయే పరిణామాలపై తలెత్తుతున్న ప్రశ్నలకు సమాధానాలను అన్వేషించడానికి, మానవాళి అంతరించిపోయే ముప్పును తప్పించే మార్గాలను కనుగొనడానికి శాస్త్రవేత్తలు విస్తృతంగా పరిశోధనలు సాగిస్తున్నారు. భూమ్మీద మానవుల మనుగడ మొదలైన నాటి నుంచి మానవజాతిలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి.
వాటిలో భాగంగానే పురుషజాతి అస్తిత్వానికి కీలకమైన ‘వై’ క్రోమోజోమ్‌లో కూడా అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మనుషుల్లో 23 జతల క్రోమోజోమ్‌లు ఉంటాయి. వాటిలో ఒక జత లింగనిర్ధారణకు కీలకమైనది. మహిళల్లో ఈ జతలో రెండు ‘ఎక్స్’ క్రోమోజోమ్‌లు, పురుషుల్లో ఒక ‘ఎక్స్’, ఒక ‘వై’ క్రోమోజోమ్ ఉంటాయి. ‘ఎక్స్’ క్రోమోజోమ్‌లోని జన్యుకణాల సంఖ్యతో పోల్చుకుంటే, ‘వై’ క్రోమోజోమ్‌లోని జన్యుకణాల సంఖ్య వేగంగా తగ్గిపోతోందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ పరిణామంపై రకరకాల ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వాటికి సంబంధించిన వాస్తవాలను తెలుసుకుందాం.
దీనివల్లే పురుషుల్లో వంధ్యత్వం
‘వై’ క్రోమోజోమ్ క్షీణత వల్లనే పురుషుల్లో వంధ్యత్వం కలుగుతున్నట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ముఖ్యంగా – ‘వై’ క్రోమోజోమ్‌లో ఉన్న జన్యు కణాల్లోని ‘అజూస్పెర్మియా ఫ్యాక్టర్’లో (ఏజెడ్‌ఎఫ్) ‘మైక్రో డిలీషన్స్’ రూపంలో చోటు చేసుకునే క్షీణత పురుషుల్లో వంధ్యత్వానికి కారణమవుతోందని కూడా గుర్తించారు. ‘వై’ క్రోమోజోమ్‌లోని ‘ఏజెడ్‌ఎఫ్’ కణాల క్షీణత పురుషుల్లో వంధ్యత్వానికి ప్రధాన కారణంగా ఉంటోందని అమెరికన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సెయింట్ లూయీలోని సెయింట్ ల్యూక్స్ హాస్పిటల్‌కు చెందిన వైద్య నిపుణులు జరిపిన పరిశోధనల్లో ‘వై’ క్రోమోజోమ్‌లోని జన్యుకణాల్లో పునస్సంయోగానికి అవకాశాలు తక్కువగా ఉండటం వల్లనే ఇందులోని జన్యువులు క్షీణిస్తున్నాయని వెల్లడైంది. ‘వై’ క్రోమోజోమ్ క్షీణత వల్ల పురుషుల్లో వంధ్యత్వం మాత్రమే కాకుండా, మరిన్ని ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయని పలు అంతర్జాతీయ పరిశోధనలు చెబుతున్నాయి. వారు చెబుతున్న ప్రకారం ‘వై’ క్రోమోజోమ్ క్షీణత వల్ల పురుషుల్లో పెరిగే ఆరోగ్య సమస్యలు ఇవీ:
∙‘వై’ క్రోమోజోమ్‌లో ఏర్పడే ‘మొజాయిక్ లాస్’ వల్ల పురుషుల్లో గుండె కండరాలు బలహీనపడి గుండెజబ్బులు, నాడీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారి అల్జీమర్స్ వంటి నాడీ వ్యాధులు, త్వరగా వార్ధక్య లక్షణాలు సంభవిస్తాయని ఎన్‌ఐహెచ్ పరిశోధనలు చెబుతున్నాయి. పురుషుల శరీరంలోని కణాలు ‘వై’ క్రోమోజోమ్‌ను పూర్తిగా కోల్పోయే పరిస్థితినే ‘మొజాయిక్ లాస్’ అంటారు.
∙‘వై’ క్రోమోజోమ్ మొజాయిక్ లాస్ వల్ల శరీరంలోని కండరాల బిగువు సడలిపోవడం, ఎముకల పటుత్వం తగ్గిపోవడం, రోగ నిరోధక కణాలు వేగంగా నశించడం జరిగి అకాల మరణాలు సంభవించే అవకాశాలు కూడా గణనీయంగా పెరుగుతాయని ఎన్‌ఐహెచ్ పరిశోధకులు చెబుతున్నారు.
అంతరించిపోతే జరిగేదేమిటి?
‘వై’ క్రోమోజోమ్ పూర్తిగా అంతరించిపోయినట్లయితే, మానవులలో మగజాతి అంతరించిపోతుంది. ఇది వెంటనే జరిగే పరిణామం. ఫలితంగా మానవుల పునరుత్పత్తి నిలిచిపోతుంది. ‘వై’ క్రోమోజోమ్‌లో పురుష లక్షణాల అభివృద్ధికి కీలకమైన ‘ఎస్‌ఆర్‌వై’ (సెక్స్ రీజియన్ ఆన్ ది వై) జన్యువు ఉంటుంది. ఇది నశించినట్లయితే, మానవాళికి తీవ్రమైన అనర్థంగానే భావించవచ్చు. అయితే, జీవపరిణామంలో భాగంగా మానవజాతి పునరుత్పాదలోను, పురుషజాతి లింగనిర్ధారణలోను కొత్త మార్పులు సంభవించవచ్చని, ఇలాంటి మార్పులు కొన్ని ఇతర జంతు జాతుల్లో జరగడాన్ని ఇప్పటికే గమనించామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
జీవ పరిణామం ఒక నిదానమైన ప్రక్రియ అని, సుదీర్ఘకాలంలో లింగనిర్ధారణకు కీలకమైన కొత్త జన్యువులు పుట్టుకొచ్చే అవకాశం కూడా ఉంటుందని వారు చెబుతున్నారు. మనుషుల జన్యువులలో ఈ స్థాయి మార్పు జరిగితే, మానవజాతి విభిన్నంగా పరిణామం చెందగలదని అంటున్నారు. ఇదిలా ఉంటే, ఇప్పటికే అంతరించిపోయినవి అంతరించిపోగా ‘వై’ క్రోమోజోమ్‌లో మిగిలిన జన్యువులను కాపాడుకోవడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పలువురు అంతర్జాతీయ వైద్యపరిశోధకులు చెబుతున్నారు. ‘వై’ క్రోమోజోమ్‌లోని జన్యువులలో జరిగే హానికరమైన ఉత్పరివర్తనలను నిరోధించి, కీలకమైన జన్యువులను కాపాడుకోవడానికి అవసరమైతే జన్యుసవరణ సాంకేతికతను వినియోగించుకోవాలని సూచిస్తున్నారు.
‘వై’ క్రోమోజోమ్ క్షీణత పురుషుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, దీనివల్ల కొన్నిరకాల క్యాన్సర్లు, గుండెజబ్బులు సహా పలు వ్యాధులు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్య పరిశోధకులు చెబుతున్నారు. అందువల్ల ‘వై’ క్రోమోజోమ్ క్షీణతను అరికట్టడానికి, ఇందులోని మిగిలిన జన్యువులు అంతరించిపోకుండా ఉండటానికి మరిన్ని పరిశోధనలు విస్తృతంగా జరగాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.
ఆ ఎలుకల్లో ఏం జరిగిందంటే?
రెండు జాతులకు చెందిన ఎలుకల్లో ‘వై’ క్రోమోజోమ్ అంతరించిపోయింది. దాంతోపాటే ‘ఎస్‌ఆర్‌వై’ జన్యువు కూడా అంతరించింది. అయినా వాటి పునరుత్పత్తి నిలిచిపోలేదు. ఇంకా మనుగడ సాగిస్తూనే ఉన్నాయి. అమెరికాలోని మిసోరీ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ షెరిల్ రోజన్‌ఫీల్డ్ ఆధ్వర్యంలోని శాస్త్రవేత్తలు కొద్ది సంవత్సరాల కిందట జరిపిన పరిశోధనల్లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సాధారణంగా మనుషులు సహా సమస్త స్తన్యజీవుల్లోను మగ జీవుల లింగ నిర్ధారణకు దోహదపడేది ‘వై’ క్రోమోజోమ్‌లోని ‘ఎస్‌ఆర్‌వై’ జన్యువు. మగ జీవుల్లోని పునరుత్పత్తికి కీలకమైనది ‘వై’ క్రోమోజోమ్, అందులోని ‘ఎస్‌ఆర్‌వై’ జన్యువు ‘వై’ క్రోమోజోమ్ లేకుండానే, జపాన్ తీర ప్రాంతంలో కనిపించే ‘అమామీ స్పైనీ ర్యాట్’, ‘ర్యుక్యు స్పైనీ ర్యాట్’ అనే జాతులకు చెందిన ఎలుకలు మనుగడ సాగించగలుగుతున్నాయి.
ఇవి యథాప్రకారం పునరుత్పత్తి కొనసాగించగలుగుతున్నాయి. వీటిలో ‘వై’ క్రోమోజోమ్ పూర్తిగా అంతరించిపోయినా, లింగ నిర్ధారణకు అవసరమైన ప్రత్యామ్నాయ జన్యు ఉత్పరివర్తనలు జరిగాయని, వాటి ఫలితంగానే ఇవి మనుగడ సాగించగలుగుతున్నాయని ప్రొఫెసర్ షెరిల్ రోజన్‌ఫీల్డ్ ఆధ్వర్యంలో జరిగిన పరిశోధనల్లో వెల్లడైంది. ఈ ఎలుకల్లోని ఎక్స్ క్రోమోజోమ్‌లోని ‘ఎస్‌ఓఎక్స్9’ అనే జన్యువు పురుష లింగనిర్ధారణకు కీలకమైన ‘ఎస్‌ఆర్‌వై’ జన్యువులా పనిచేస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ఎలుక జాతుల్లో జరిగిన జన్యు ఉత్పరివర్తనల ఫలితంగా వీటిలో విలక్షణమైన లింగనిర్ధారణ వ్యవస్థ ఏర్పడినట్లు వారు కనుగొన్నారు. యూరోప్‌లో కనిపించే ‘మోల్‌వోల్’ అనే ఎలుక జాతిలోనూ ఇదే పరిస్థితిని శాస్త్రవేత్తలు గుర్తించారు.
‘మోల్‌వోల్’ జాతి ఎలుకల్లో కూడా ‘వై’ క్రోమోజోమ్ అంతరించిపోయింది. అయినా, ఇవి కూడా మనుగడ సాగించగలుగుతున్నాయి. ఈ పరిశోధనల్లో ఇప్పటి వరకు తేలిన ఫలితాల ఆధారంగా ‘వై’ క్రోమోజోమ్ అంతరించిపోయినంత మాత్రాన మనుషుల మనుగడకు ముప్పు ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే, ‘వై’ క్రోమోజోమ్ అంతరించిపోయిన ఎలుకల్లో మాదిరిగానే మనుషుల్లోనూ ప్రత్యామ్నాయ జన్యు ఉత్పరివర్తనలు జరిగి విలక్షణమైన లింగనిర్ధారణ వ్యవస్థ ఏర్పడవచ్చని భావిస్తున్నారు.
పాతికేళ్లుగా పరిశోధనలు
మనుషుల్లో ‘వై’ క్రోమోజోమ్ క్షీణతపై దాదాపుగా పాతికేళ్లుగా పరిశోధనలు జరుగుతున్నాయి. వేర్వేరు దేశాల శాస్త్రవేత్తలు ఈ అంశంపై వేర్వేరు అభిప్రాయాలను వెలిబుచ్చుతున్నారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన జెనెటిక్స్ ప్రొఫెసర్ బ్రియాన్ సైక్స్ ‘వై’ క్రోమోజోమ్ క్షీణతపై ‘ఆడమ్స్ కర్స్: ఎ ఫ్యూచర్ వితౌట్ మెన్’ అనే పుస్తకాన్ని 2003లో ప్రచురించారు. మనుషుల్లోని ‘వై’ క్రోమోజోమ్ జన్యువులు నశిస్తున్న తీరుపై ఆయన విస్తృత పరిశోధనలు జరిపారు. మరో ఐదువేల తరాలు గడిచే నాటికి– అంటే, ఇంకో లక్షా పాతికవేల సంవత్సరాలలోనే మనుషుల్లో ‘వై’ క్రోమోజోమ్ పూర్తిగా అంతరించిపోగలదని, భవిష్యత్తులో పురుషులు లేని ప్రపంచం ఏర్పడుతుందని ఆయన తన పుస్తకంలో రాశారు.
పురుషులలో వీర్యకణాల సంఖ్య తగ్గిపోతుండటానికి ‘వై’ క్రోమోజోమ్ క్షీణతే కారణమని ప్రొఫెసర్ బ్రియాన్ తన పుస్తకంలో వెల్లడించారు. ‘వై’ క్రోమోజోమ్ పూర్తిగా నశించడం వల్ల పురుషులు అంతరించిపోయాక కూడా భూమ్మీద మనుషులు మనుగడ సాగించాలంటే, ఒకే ఒక్క మార్గం ఉంటుందని తెలిపారు. అదేమిటంటే, ఒక ‘ఎక్స్’ క్రోమోజోమ్‌తో మహిళల అండాలను ఫలదీకరించి, ‘ఇన్ విట్రో ఫర్టిలైజేషన్’ (ఐవీఎఫ్) పద్ధతి ద్వారా మాత్రమే మనుషుల్లో పునరుత్పత్తి సాధ్యం కాగలదని అభిప్రాయపడ్డారు. బ్రియాన్ తన పుస్తకంలో వెల్లడించిన అభిప్రాయాలపై ఇప్పటికీ విస్తృతంగా చర్చ జరుగుతోంది. మరోవైపు మనుషుల్లో ‘వై’ క్రోమోజోమ్ క్షీణతపై కూడా విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి.
అయితే, కొందరు పరిశోధకులు ‘వై’ క్రోమోజోమ్ క్షీణత గురించి అనవసరంగా అతిగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ‘వై’ క్రోమోజోమ్ పూర్తిగా నశించినంత మాత్రాన భూమ్మీద మానవాళి మనుగడ పూర్తిగా అంతరించిపోతుందని చెప్పలేమని ఇంకొందరు పరిశోధకులు చెబుతున్నారు. పురుషుల్లో ‘వై’ క్రోమోజోమ్ పూర్తిగా క్షీణించే పరిస్థితి తలెత్తితే, అందుకు ప్రత్యామ్నాయ జన్యు ఉత్పరివర్తనలు కూడా జరుగుతాయని, ఆ ఉత్పరివర్తనలు పునరుత్పత్తిని కొనసాగించగలవని అమెరికన్ జన్యు పరిశోధకులు జె.విల్సన్, జె.ఎం.స్టాలీ, జి.జె.వైకాఫ్ ‘నేచర్’ పత్రికలో రాసిన ఒక వ్యాసంలో తెలిపారు. ‘వై’ క్రోమోజోమ్ లేకున్నా, ఎలుక జాతులు మనుగడ సాగిస్తున్నట్లుగానే, మనుషులు కూడా మనుగడ సాగించగలరని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
‘వై’ క్రోమోజోమ్ క్షీణత
మానవజాతి మనుగడ మొదలైనప్పుడు పురుషుల్లోని ‘వై’ క్రోమోజోమ్‌లో 1438 జన్యుకణాలు ఉండేవి. ఇప్పుడు వాటిలోని 1383 జన్యుకణాలు అంతరించిపోయాయి. ఇప్పుడు ‘వై’ క్రోమోజోమ్‌లో మిగిలినవి 55 జన్యుకణాలు మాత్రమే! దాదాపు 30 కోట్ల సంవత్సరాల వ్యవధిలో ఈ క్షీణత సంభవించింది. ఈ లెక్కన సగటున ప్రతి పదిలక్షల సంవత్సరాలకు ‘వై’ క్రోమోజోమ్‌లోని 4.6 జన్యుకణాలు అంతరించిపోతున్నాయి. ఇదే రీతిలో ‘వై’ క్రోమోజోమ్ క్షీణత కొనసాగితే, మరో కోటి సంవత్సరాలలో పూర్తిగా అంతరించిపోతుంది. నిజానికి 16.6 కోట్ల సంవత్సరాల కిందటి వరకు ‘ఎక్స్’ క్రోమోజోమ్‌లోను, ‘వై’ క్రోమోజోమ్‌లోను జన్యువులు సరిసమానంగా ఉండేవి. పరిణామక్రమంలో ‘వై’ క్రోమోజోమ్‌లో జన్యువులు క్రమంగా కనుమరుగవడం మొదలైంది. ప్రస్తుతం ‘వై’ క్రోమోజోమ్‌లో 55 జన్యువులు మాత్రమే మిగిలి ఉన్నాయి. మానవజాతి మనుగడ మొదలైన తర్వాత గడచిన కోట్లాది సంవత్సరాలలో జరిగిన ఉత్పరివర్తనల పర్యవసానంగా ‘వై’ క్రోమోజోమ్‌లోని జన్యుకణాలు ప్రస్తుత స్థితికి క్షీణించాయి.