థైరాయిడ్‌ కూడా లేదు, అయినా ఎందుకిలా అవుతోంది?

Doctors Advice For Health Issues - Sakshi

సం'దేహం'

మెనోపాజ్‌ వచ్చి నాలుగేళ్లవుతోంది. ఈ మధ్య తరచుగా మూత్రంలో మంట, దురదగా ఉంటోంది. షుగర్‌ టెస్ట్‌ చేయించుకున్నాను. లేదు. థైరాయిడ్‌ కూడా లేదు. అయినా ఎందుకిలా అవుతోంది. వేడి చేసిందేమో అనుకున్నాను. కానీ ఎక్కడో చదివాను వేడి చేయడమంటూ ఉండదని. దయచేసి నా సమస్యకు పరిష్కారం చెప్పగలరు.
– జి. రాజేశ్వరి, తర్లికొండ

ఆడవారిలో గర్భాశయం ఇరువైపులా ఉండే అండాశయాల నుంచి ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ విడుదలవుతూ ఉంటుంది. దీని ఉత్పత్తి 45 ఏళ్ల వయసు దాటే కొద్ది క్రమంగా తగ్గుతూ, పీరియడ్స్‌ ఆగిపోయి మెనోపాజ్‌ దశకు చేరుకోవడం జరుగుతుంది. ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ ప్రభావం వల్ల యోని భాగంలో మూత్రం బయటకు వచ్చే యురెత్రా ద్వారంలో మ్యూకస్‌ పొర ఎండిపోకుండా, అందులో ద్రవాలు ఊరేట్లు చేస్తుంది. అలాగే ఈస్ట్రోజన్‌ యోనిలో ల్యాక్టోబ్యాసిలై అనే మంచి బ్యాక్టీరియా పెరగడానికి దోహదపడుతుంది.

ఈ బ్యాక్టీరియా నుంచి విడుదలయ్యే యాసిడ్‌ యోని స్రావాలను ఆమ్లగుణం కలిగేటట్లు చేస్తుంది. ఈ యాసిడ్‌ వల్ల వేరే ఇన్ఫెక్షన్‌ క్రిములు పెరగకుండా ఉంటాయి. అలాగే ఈస్ట్రోజన్‌ యురెత్రా, యోని భాగంలో ఉండే కండరాలు వదులు కాకుండా, దృఢంగా ఉండటానికి కూడా ఉపయోగపడుతుంది. మీకు మెనోపాజ్‌ వచ్చి నాలుగు సంవత్సరాలు దాటింది కాబట్టి మీ శరీరంలో ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ చాలావరకు  తగ్గిపోయి ఉంటుంది. ఈస్ట్రోజన్‌ లోపం వల్ల యురెత్రా, వజైనా కణజాలానికి రక్తప్రసరణ తగ్గిపోయి మ్యూకస్‌ పొర పల్చబడి, మ్యూకస్‌ స్రావాలు ఆగిపోయి ఎండిపోయినట్లు అయిపోతుంది.

దీనివల్ల యోనిభాగంలో పొడిబారేటట్లయి మంటగా అనిపిస్తుంది. అవసరమైతే యూరిన్‌ కల్చర్‌ పరీక్షలు చేయించి, యూరిన్‌లో ఇన్‌ఫెక్షన్‌ ఎంత ఉన్నదీ, ఎలాంటి బ్యాక్టీరియా పెరుగుతున్నదీ తెలుసుకుని, దానిని బట్టి మందులు ఇవ్వడం జరుగుతుంది. ఈ మందులతో పాటు మెనోపాజ్‌తో ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ తగ్గిపోవడం వల్ల వచ్చే ఈ సమస్యలను నివారించడానికి ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ క్రీమ్, జెల్, ఆయింట్‌మెంట్‌ లేదా వజైనల్‌ టాబ్లెట్స్‌ ఇవ్వడం జరుగుతుంది. ఈ క్రీమ్‌ను మొదటి రెండు వారాలు రోజూ రాత్రిపూట యోని లోపల మూత్ర భాగంలో పెట్టుకోవాలి. తర్వాతి నుంచి వారానికి రెండుసార్లు వాడుకోవచ్చు.

అలాగే రోజుకు మూడు లీటర్ల మంచినీళ్లు తాగడం, మల విసర్జన తర్వాత ముందు నుంచి వెనకాలకు మంచినీళ్లతో శుభ్రపరచుకోవాలి. ల్యాక్టోబ్యాసిలై ఇంటిమేట్‌ వాష్‌తో రోజుకొకసారి జననేంద్రియాలను శుభ్రపరచుకోవచ్చు. అవసరాన్ని బట్టి ల్యాక్టోబ్యాసిలైతో కూడిన ప్రోబయోటిక్‌ మందులను కొన్ని రోజులు డాక్టర్‌ సలహాపై తీసుకోవచ్చు. రోజూ కొద్దిగా క్యాన్‌బెర్రీ జ్యూస్‌ తీసుకోవడం వల్ల కొందరిలో ఈ–కోలి బ్యాక్టీరియా మూత్రాశయానికి అంటుకోకుండా, ఇన్ఫెక్షన్‌ పెరగకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. మూత్రం వచ్చినప్పుడు ఎక్కువసేపు ఆపుకోకుండా తరచుగా మూత్రవిసర్జన చేస్తూ ఉండటం వల్ల కూడా ఇన్ఫెక్షన్లు పెరగకుండా ఉండే అవకాశాలు ఉంటాయి.

ఆడవారిలో మలద్వారం యోనిభాగానికి, మూత్రద్వారానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి మలద్వారం నుంచి వచ్చే ఈ–కోలి బ్యాక్టీరియా, ఈస్ట్‌ ఇన్ఫెక్షన్లు యోనిలోకి, మూత్రద్వారంలోనికి సులువుగా పైకి పాకి యూరినరీ ఇన్ఫెక్షన్లు, వజైనల్‌ ఇన్ఫెక్షన్లు అతి త్వరగా, తరచుగా వచ్చి ఇబ్బంది పెడుతుంటాయి. దీని వల్ల మూత్రం పోసేటప్పుటు మంట, దురద వంటి లక్షణాలు ఏర్పడుతుంటాయి. కొందరిలో ఈస్ట్రోజన్‌ లోపం వల్ల మూత్రాశయం కిందకు జారడం, దానివల్ల మూత్రం పూర్తిగా బయటకు రాకుండా ఉండటం, కొంచెం మూత్రాశయంలోనే ఉండిపోవడం, దానివల్ల అక్కడ బ్యాక్టీరియా పెరిగి, యూరినరీ ఇన్ఫెక్షన్లు వచ్చి, మూత్రంలో మంట వంటి లక్షణాలు ఏర్పడతాయి.

అశ్రద్ధ చేసి, చికిత్స తీసుకోకపోతే ఇన్ఫెక్షన్‌ మూత్రాశయం నుంచి యురెటర్స్‌ ద్వారా కిడ్నీలకు పాకి ఇన్ఫెక్షన్‌ తీవ్రమయ్యే అవకాశాలు ఉంటాయి. ఒకసారి గైనకాలజిస్ట్‌ను సంప్రదించి, పరీక్ష చేయించుకుంటే, వారు స్పెక్యులమ్‌ పరీక్ష చేసి, మూత్రం ద్వారా యోనిభాగంలో బ్యాక్టీరియల్, ఫంగల్‌ ఇన్ఫెక్షన్లు ఉన్నాయా, మూత్రాశయం జారడం వంటి సమస్యలేమైనా ఉన్నాయా అనేది చూసి, సమస్యను బట్టి యాంటీఫంగల్, యాంటీబయోటిక్‌ మందులు, క్రీములు సూచించడం జరుగుతుంది. 

మేడమ్‌... మా పెళ్లి ఖరారైంది. నిశ్చితార్థానికి ముందు మా రెండు కుటుంబాల హెల్త్‌ హిస్టరీ చూసుకోవాలనుకున్నాం. పుట్టబోయే పిల్లల ఆరోగ్య దృష్ట్యా. అమ్మాయీ ఒప్పుకుంది. కానీ వాళ్ల కుటుంబ సభ్యులకు నా తీరు నచ్చక సంబంధం కేన్సిల్‌ చేసుకోవాలని చూస్తున్నారు. పైగా నా మీద అభాండాలూ వేస్తున్నారు. నా ఆలోచన తప్పా డాక్టర్‌ గారూ...
– రాఘవకృష్ణ, ప్రొద్దుటూరు

నీ ఆలోచనలో తప్పేమీ లేదు. కానీ ప్రాక్టికల్‌గా అది అందరికీ నచ్చకపోవచ్చు. కొందరు దాన్ని వెర్రి ఆలోచనగా పరిగణించవచ్చు. జన్యుపరమైన కారణాల వల్ల జన్యు సమస్యలు, అవయవ లోపాలు, మానసిక ఎదుగుదల లోపాలు, మెటబాలిక్‌ డిజార్డర్స్, థలసీమియా, హీమోఫీలియా, సికెల్‌సెల్‌ ఎనీమియా వంటి రక్త సమస్యలు వంటి అనేక సమస్యలతో పిల్లలు పుట్టవచ్చు. ఈ సమస్యలకు మూలాలు తల్లిదండ్రుల్లో గాని, వారి తల్లిదండ్రులు, ఇంకా దగ్గరి రక్తసంబంధీకులలో గానీ కొన్ని జన్యువులలో లోపాలు ఉండవచ్చు.

కొన్ని జన్యుపరమైన సమస్యలతో పుట్టిన పిల్లలతో పాటు, వారి తల్లిదండ్రులు జీవితాంతం ఇబ్బంది పడవలసి ఉంటుంది. కొన్ని సమస్యలు ఏ కారణం లేకుండా కూడా పిల్లల్లో ఏర్పడవచ్చు. కొందరిలో కొన్ని జన్యువులు బలహీనంగా ఉండటం జరుగుతుంది. అలాంటి ఇద్దరు పెళ్లి చేసుకున్నప్పుడు రెండు బలహీన జన్యువులు బిడ్డకు సంక్రమించినప్పుడు జన్యలోపాలు ఏర్పడతాయి.

కాబట్టి పెళ్లికి ముందు ఇద్దరి తరఫు దగ్గరి బంధువుల ఆరోగ్య చరిత్ర తెలుసుకోవడం వల్ల వారిలో ఏవైనా సమస్యలు ఉంటే, అవి పుట్టబోయే బిడ్డకు వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉంటాయో ఒక అంచనాకు రావచ్చు. అవసరం అనుకుంటే జెనెటిక్‌ కౌన్సెలింగ్‌కు వెళ్లవచ్చు. ఇందులో జెనెటిసిస్ట్‌ డాక్టర్‌ కుటుంబ చరిత్రను బట్టి పుట్టబోయే పిల్లల్లో జన్యుసమస్యలు ఎంతశాతం వరకు రావచ్చనేది అంచనా వేసి చెప్పడం జరుగుతుంది.
డా.వేనాటి శోభ, గైనకాలజిస్ట్‌, హైదరాబాద్‌

చదవండి: కరోనా కాలంలో పిల్లలకు సీజనల్‌ జ్వరాలు.. జాగ్రత్తలు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top