
శ్రీలంక రాజధాని కొలంబోలో ఉన్న లేడీ రిడ్జ్‌వే హాస్పిటల్ ఫర్ చిల్డ్రన్ (Lady Ridgeway Hospital for Children) ఆసుపత్రి ప్రపంచంలో అతి పెద్ద పిల్లల ఆసుపత్రి. ఇక్కడ ఒకేసారి 1200 కంటే ఎక్కువమందికి చికిత్స అందించొచ్చు. 1895లో ‘లేడీ హావ్‌లాక్ హాస్పిటల్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్’ పేరుతో దీన్ని స్థాపించారు. 1910లో దీన్ని ‘లేడీ రిడ్జ్‌వే హాస్పిటల్ ఫర్ చిల్డ్రన్‌గా మార్చారు. లేడీ హావ్‌లాక్, లేడీ రిడ్జ్‌వే ఇద్దరూ సిలోన్‌లోని బ్రిటిష్ గవర్నర్లు సర్ ఆర్థర్ హావ్‌లాక్, సర్ జోసెఫ్ వెస్ట్ రిడ్జ్‌వేల సతీమణులు.

లేడీ రిడ్జ్‌వే హాస్పిటల్ శ్రీలంకకు పీడియాట్రిక్ కేర్ కోసం జాతీయ రిఫెరల్ సెంటర్‌గా కూడా పనిచేస్తుంది. కొలంబో నగరంతోపాటు చుట్టుపక్కలున్న అనేక ్ర΄ాంతాల జనాభాకు ఇది అత్యవసర, అవుట్ పేషెంట్ కేర్ అందించే ఆసుపత్రి. శ్రీలంక ప్రభుత్వ ఉచిత రాష్ట్ర ఆరోగ్య సంరక్షణ విధానం ద్వారా ఇక్కడ అని సేవలూ ఉచితంగా అందుతాయి. ఈ ఆసుపత్రిలోని ఔట్ పేషెంట్ విభాగం, యాక్సిడెంట్ సర్వీస్ విభాగం సంవత్సరంలో 365 రోజులు, రోజుకు 24 గంటలు తెరిచే ఉంటుంది. ఇక్కడ సంవత్సరానికి పది లక్షలకు పైగా ఔట్ పేషెంట్లు వచ్చి చికిత్స పొందుతుంటారు. దాదాపు 50,000 మంది పిల్లలు ఇక్కడ చికిత్స పొందుతుంటారు. ఇక్కడి వైద్యులు ఎంతోమంది చిన్నారులను ప్రాణాపాయ స్థితి నుంచి రక్షించి, ఆరోగ్యవంతుల్ని చేసి ఇంటికి పంపించారు. శ్రీలంక క్రికెటర్ యాంజిలో మ్యాథ్యూస్ కూతురు కూడా ఇక్కడ చికిత్స పొందింది. ఇక్కడి వైద్యులు, నర్సులు అందించిన సేవలు చూసి, ఆయన ఈ ఆసుపత్రికి తనవంతు సాయాన్ని అందించారు.