
ప్రస్తుతం అంతా డిజిటల్ యుగం నడుస్తోంది.. బస్ టికెట్ కొనాలన్నా.. వాటర్ బాటిల్ కొనాలన్నా.. అన్నింటికీ యుపిఐ పేమెంట్సే.. ఈ క్రమంలో బహిరంగ మార్కెట్‌లో చిల్లర కొరత ఏర్పడుతోంది.. ప్రతి కొనుగోలుకీ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం అలవాటైపోయింది. నూటికి 60 శాతం పైగా పేమెంట్స్ ఈ తరహాలోనే నడుస్తున్నాయి. దీంతో అత్యవసరమైన చోట ఖర్చు చేసేందుకు కూడా జేబులో రూ.10 ఉండని పరిస్థితి. ఈ ప్రభావం దేవాలయాలపై భారీగా కనిపిస్తోంది.
దీంతో ఈ సమస్యకు ప్రత్యామ్నాంగా దేవాలయాల్లోనూ ఇటీవల కాలంలో హుండీ ఆదాయం గణనీయంగా పడిపోతోందని దేవాదాయ శాఖ రికార్డులు వెల్లడిస్తున్నాయి. దీనిని అధిగమించేందుకు నగరంలోని జూబ్లీహిల్స్‌లోని శ్రీ పెద్దమ్మ దేవాలయంతో పాటు బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం, సికింద్రాబాద్ గణేష్ టెంపుల్, మహంకాళి దేవాలయం, చిక్కడపల్లి వెంకటేశ్వరస్వామి దేవాలయంతో పాటు పలు ప్రధాన ఆలయాల్లో ఈ–హుండీలను అందుబాటులోకి తీసుకొచ్చాయి.
తాజాగా నగరంలోనే భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసే జూబ్లీహిల్స్ శ్రీ పెద్దమ్మ ఆలయంలో ఈ–హుండీ ఏర్పాటైంది. సోమవారం నుంచి భక్తులకు ఈ–హుండీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. భక్తులు ఇక్కడ స్కాన్ చేసి కానుకలను నేరుగా ఆలయ అకౌంట్‌లోకి పంపించవచ్చు.
మొదటి రోజు ఈ విధానానికి భారీ స్పందన లభించింది. మిగతా ఆలయాల్లోనూ ఈ–హుండీలను ఏర్పాటు చేయాలని దేవాదాయ శాఖ అధికారుల నుంచి ఆదేశాలు వెలువడిన నేపథ్యంలో ఆయా ఆలయాలు ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నాయి.
(చదవండి: ఆ దంపతుల అభి‘రుచే’ సపరేటు.. అమెరికాలో వడాపావ్ పిక్నిక్‌కి అదే రూటు)