యువతరం ఎకో–యాంగ్జయిటీ! క్లైమెట్‌ ఛేంజ్‌’పై ఆందోళన..! | Sakshi
Sakshi News home page

యువతరం ఎకో–యాంగ్జయిటీ! క్లైమెట్‌ ఛేంజ్‌’పై ఆందోళన..!

Published Wed, May 22 2024 11:18 AM

Deloittes 2024 Gen Z and Millennial Survey

‘ఈ నెట్‌ఫ్లిక్స్, ఐపీఎల్‌ మ్యాచ్‌ల కాలంలో వాతావరణ మార్పులపై యూత్‌ దృష్టి పెడుతుందా?’ అనే ప్రశ్నకు ‘అవును’ అని చెబుతుంది డెలాయిట్‌ తాజా నివేదిక. ‘డెలాయిట్‌ 2024 జెన్‌ జెడ్, మిలీనియల్స్‌ సర్వే’ ప్రకారం వీరిలో ఎక్కువమంది ‘క్లైమెట్‌ ఛేంజ్‌’పై ఆందోళన చెందుతున్నారు. పర్యావరణ సంరక్షణకు ఇస్తున్న ప్రాధాన్యత మాట ఎలా ఉన్నా ఎకో–యాంగ్జయిటీ అనేది వారిలో కనిపించే మరో కోణం.

ఢిల్లీలో ఒకరోజు...
‘ఇల్లుదాటి బయటికి వెళ్లవద్దు అని పేరెంట్స్‌ చాలా స్ట్రిక్ట్‌గా చెప్పారు. అయినా సరే వారి కనుగప్పి ఇంటి నుంచి బయటికి వచ్చి అనుకున్నట్లుగానే అక్కడికి వెళ్లాను’ అంటుంది యశ్న ధృరియా. ఇంతకీ ఇరవై సంవత్సరాల యశ్న వెళ్లింది ఎక్కడికి? ఆరోజే విడుదలైన సినిమాకు కాదు. క్రికెట్‌ మ్యాచ్‌ చూడడానికి కాదు. మహానగరంలో జరుగుతున్న  గ్లోబల్‌ క్లైమెట్‌ స్ట్రైక్‌లో పాల్గొనడానికి. ‘వాట్స్‌ గోయింగ్‌ టు హ్యాపెన్‌’ అంటూ పర్యావరణ సంక్షోభం గురించి యశ్న కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు తల్లిదండ్రులు, స్నేహితులకు ఆశ్చర్యంగా అనిపించింది.

‘పరీక్షలో ఫెయిలైనట్లు ఏడుస్తున్నావేమిటి?’ అని అడిగారు ఒకరు. కానీ ఆ ఒకరికి తెలియనిదేమిటంటే వాతావరణానికి సంబంధించిన కీలకమైన పరీక్షను మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. ఈ సంక్షోభ నేపథ్యంలో యశ్నలాంటి వాళ్లు ఆశాదీపాలై వెలుగుతున్నారు. తాము వెలుగు దారిలో పయనిస్తూ ఎంతోమందిని తమ తోపాటు తీసుకువెళుతున్నారు. ‘తెలిసో తెలియకో, ఏమీ చేయలేకో పర్యావరణ సంక్షోభంలో భాగం అవుతున్నాం’ అనే బాధ. 

పశ్చాత్తాపం బెంగళూరుకు చెందిన శ్రీరంజనిలో కనిపిస్తుంది. గ్లోబల్‌ స్ట్రైక్‌ మూమెంట్‌ ‘ఫ్రైడేస్‌ ఫర్‌ ఫ్యూచర్‌(ఎఫ్‌ఎఫ్‌ఎఫ్‌) ఇండియా’లో భాగంగా ఎన్నో కార్యక్రమాల్లో శ్రీరంజని పాల్గొంది. పర్యావరణ సంక్షోభం తాలూకు ఆందోళన తట్టుకోలేక యూత్‌ క్లైమెట్‌ యాక్టివిస్ట్‌లలో కొందరు ట్రీట్‌మెంట్‌కు కూడా వెళుతున్నారు. ఎన్విరాన్‌మెంట్‌ యాక్షన్‌ గ్రూప్‌ ‘దేర్‌ ఈజ్‌ నో ఎర్త్‌ బి’తో కలిసి పనిచేసిన దిల్లీకి చెందిన సైకోథెరపిస్ట్‌ అగ్రిమ ఛటర్జీ పర్యావరణ సంక్షోభంపై యూత్‌ ఆందోళనను దగ్గరి నుంచి గమనించింది. 

‘తమ పరిధిలో వారు చేయగలిగింది చేస్తున్నారు. మరోవైపు సమస్య పెద్దగా ఉంది. కొన్నిసార్లు తాము చేస్తున్న ప్రయత్నం అర్థరహితంగా అనిపించి ఆందోళనకు గురవుతున్నారు. నిస్సహాయ స్థితిలోకి వెళుతున్నారు’ అంటుంది అగ్రిమ. బెంగళూరుకు చెందిన సైకోథెరపిస్ట్‌ మోహినీ సింగ్‌ ఎంతోమంది యువ క్లైమెట్‌ యాక్టివిస్ట్‌లతో కలిసి పనిచేసింది. ‘పరీక్షల్లో ఫెయిల్‌ కావడం, లవ్‌ ఫెయిల్యూర్స్, బ్రేకప్స్‌ సందర్భంగా ఇతరుల నుంచి సానుభూతి, ఓదార్పు దొరికినట్లు క్లెమెట్‌ యాంగ్జయిటీ విషయంలో దొరకదు. ఎందుకంటే అది చాలామందికి అనుభవం లేని విషయం’ అంటుంది మోహిని. శివానీ గోయల్‌ తన స్వరాష్ట్రం అస్సాంలో వాతావరణ విధ్వంసంపై పరిశోధన చేస్తోంది. పత్రికలకు  వ్యాసాలు రాస్తుంది. 

సోషల్‌ మీడియాలో కంటెంట్‌ను క్రియేట్‌ చేస్తుంటుంది. ‘నా ప్రయత్నం ఏ కొంచమైనా ఫలితాన్ని ఇస్తుందా?’ అనేది తనకు తరచుగా వచ్చే సందేహం.‘చేయాల్సింది చాలా ఉంది’ అంటున్న గోయల్‌ ‘ఇక ఏమీ చేయలేం’ అనే నిస్సహాయ స్థితిలోకి వెళ్లి ఆందోళన బారిన పడి ఉండవచ్చుగానీ దాని నుంచి బయటపడడానికి క్లైమెట్‌ యాక్టివిస్ట్‌గా తిరిగి క్రియాశీలం కావడానికి ఎంతో సమయం పట్టదు. అలా తొందరగా ఆందోళన నుంచి బయటపడడమే వారి బలం. సమాజానికి వరం.

ఐడియాలు ఉండగా ఆందోళన ఏలనోయి!
‘పర్యావరణంపై మన ప్రేమ ఇంటి నుంచే మొదలు కావాలి’ అంటున్న నయన ప్రేమ్‌నాథ్‌ డే–టు–డే సస్టెయినబుల్‌ లైఫ్‌స్టైల్‌ ప్రాక్టీసెస్‌కు సంబంధించిన వీడియోలు, రీల్స్‌ను యువతరం ఇష్టపడుతోంది. ఆచరిస్తోంది. ‘ధరించకుండా మీరు మూలకు పడేసిన దుస్తులతో ఏంచేయాలి?’ ‘పీసీఆర్‌ ప్లాస్టిక్‌ గురించి తెలుసుకుందాం’ ‘జీరో–వేస్ట్‌ లైఫ్‌ స్టైల్‌’... మొదలైన వాటి గురించి బెంగళూరు చెందిన నయన ప్రేమ్‌నాథ్‌ చేసిన వీడియోలు సోషల్‌ మీడియాలో పాపులరయ్యాయి. ‘పర్యావరణ పరిరక్షణకు నా వంతుగా కొంత’ అనే భావనకు మద్దతును, బలాన్నీ ఇస్తున్నాయి.

పశ్చిమ కనుమల పరిమళం
నా మూలాలు పశ్చిమ కనుమలలలో ఉన్నాయి. ఇల్లు బెంగళూరులో ఉంది. ప్రకృతి అంటే ఇష్టం. ‘ఇండియన్‌ యూత్‌ క్లైమెట్‌ మూవ్‌మెంట్‌’లో కమ్యూనిటీ ఆర్గనైజర్‌ని. ‘ఫ్రైడేస్‌ ఫర్‌ ఫ్యూచర్‌తో నా ప్రయాణం మొదలైంది. ‘నేచర్‌ అండ్‌ ఫ్లూరివర్శిటీ’కి ఫౌండర్‌ని.  అధిక జీతం, పెద్ద సంస్థ అనే దృష్టితో కాకుండా విలువలతో కూడిన ఉద్యోగాలు చేయడం వల్ల ఎకో యాంగ్జయిటీ తగ్గుతుంది. 

ఎక్కువ జీతం వచ్చే సంస్థలో పనిచేయడం కంటే, పర్యావరణ సంరక్షణకు ఉపయోగపడే సంస్థలో పనిచేస్తున్నందుకు నాకు తృప్తిగా ఉంది. పర్యావరణ సంక్షోభాన్ని గురించి ఒక్క మాటలో చెప్పాలంటే... తుఫాను ఒక్కటే. అయితే మనం వేరు వేరు పడవల్లో ఉన్నాం. పర్యావరణ సంక్షోభాన్ని నివారించడానికి ప్రతి ఒక్కరూ తమవంతుగా చేయాల్సింది ఎంతో ఉంది.
– శ్రీరంజని రమణ్, క్లైమెట్‌ యాక్టివిస్ట్‌ 

(చదవండి: కేన్స్‌ ఫెస్టివల్‌లో నిదర్శన గోవాని నవరత్న హారం! ఏకంగా 200 మంది కళాకారులు,1800 గంటలు..)

Advertisement
 
Advertisement
 
Advertisement