
దీపావళి అనగానే టపాసులు, బాణ సంచాలతో సరదాగా సాగే పండుగ. పెద్దలు సైతం చిన్నపిల్లల్లా మారిపోయి ఎంజాయ్ చేసేలా చేసే వేడుక ఇది. ఈ పండుగ ఇంటే అందరికీ మహా ప్రీతి. అలాంటి పండుగ పేరుతోనే రెండు గ్రామాలు ఉన్నాయి. అది కూడా ఒకే జిల్లాలో రెండు గ్రామాల పేర్లు దీపావళి. అయితే ఒక చోట ఈ పండుగ ఐదు రోజులు పాటు ఘనంగా నిర్వహిస్తే..మరోచోట మాత్రం ఏ ఇంట్లో దీపమే వెలిగించరు. మరి ఆ పండుగ పేరుతో ఏర్పడిన ఆ రెండు గ్రామల వెనుక ఉన్న ఆసక్తికర కథేంటో తెలుసుకుందామా..!..
దీపాల కాంతితో కళకళలాడే ఈ దీపావళి పండుగ పేరుతో ఉన్న రెండు గ్రామాలు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాయి. ఒకటి శ్రీకాకుళం జిల్లాకి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న గారమండలంలో ఉండగా, మరొకటి టెక్కలి మండలం అయోధ్యాపురం పంచాయతీ పరిధిలో మరో గ్రామం ఉంది. ఈ రెండు గ్రామాల పేర్లు 'దీపావళి'. వాటికి ఈ పండుగ పేరు ఎలా వచ్చిందంటే..
గారమండలంలోని ఊరుకి ఆ పేరు ఎలా వచ్చిందంటే..
శ్రీకాకుళం ప్రాంతాన్ని పరిపాలించిన కళింగరాజు కూర్మనాథాలయానికి వచ్చే వారట. స్వామి దర్శనం చేసుకుని తిరిగి వెళుతుండగా.. స్ప్రుహ తప్పి పడిపోయారు. అప్పుడు అక్కడ ఉండే స్థానికులు ఆ రాజుకి సపర్యలు చేశారు. కొద్దిపేపటికి మెలుకువ వచ్చిన తర్వాత రాజు తనకు సపర్యలు చేసిన వారిని ఈ గ్రామం పేరెంటని అడగగా..తమ ఊరికి పేరు లేదని చెప్పారట గ్రామస్తులు.
దాంతో రాజుగారు తనకు దీపావళి నాడు ఇక్కడి ప్రజలు ప్రాణదానం చేసి సాయం చేశారు కాబట్టి ఈ ఊరు పేరు 'దీపావళి' అని నామకరణం చేశారని అక్కడ స్థానికులు చెబుతున్నారు. అధికారిక రికార్డుల్లో సైతం ఈ గ్రామానికి అదే పేరు స్థిరపడి ఉండటం విశేషం. ఆ పండుగ రాజుగారి రాజరికదర్పానికి తగ్గట్టుగా ..ఆ రేంజ్‌లోనే అక్కడి ప్రజలు ఈ పండుగను జరుపుకుంటారట.
మొత్తం ఐదు రోజుల పాటు ఘనంగా ఈ పండుగను నిర్వహిస్తారట. అంతేగాదు గ్రామం మొత్తం వేల దీపాలను వెలిగించి..నాటి చారిత్రక ఘటనకు గుర్తుగా తమ గ్రామం ప్రమిదల కాంతితో దేదీప్యమానంగా వెలిగిపోయాల వేడుకను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు.
ఈ ఊరికి మాత్రం గమ్మత్తుగా వచ్చిందా పేరు..
శ్రీకాకుళం జిల్లాలోనే టెక్కలి మండలం అయోధ్యాపురం పంచాయతిలో ఉన్న ఈ గ్రామం పేరు కూడా 'దీపావళినే'. అయితే దీన్ని మొదట్లో చుట్టుపక్కల గ్రామల ప్రజలు దీపాల పేటగా పిలిచేవారట. రానురాను వాడుకభాషలో దీపావళి ఊరుగా స్థిరపడిందట . అయితే ఇక్కడ ప్రజలెవ్వరూ దీపావళి పండుగను జరుపుకోరు. అక్కడ ఏ ఒక్క ఒక్క ఇంట్లో కూడా ప్రమిదలు వెలిగించరు. ఎందుకంటే..
ఎలుక కారణంగా దూరమైన పండుగ..
పూర్వం ఈ గ్రామంలో ప్రతి ఇల్లు తాటాకు గుడిసెలే. పైగా కరెంటు సదుపాయం కూడా ఉండేది కాదట. దీంతో ఇళ్లల్లో నూనె దీపాలు వెలిగించి ఉంచేవారట. దీపావళి పండుగ రోజు ఓ ఎలుక దీపాన్ని దొర్లించడంతో ఓ గుడిసెకు అంటుకున్న మంటలు ఊరంతో వ్యాపించి..మొత్తం గ్రామంలో విషాదం నెలకొందట.
దాంతో అప్పటి నుంచి ఈ గ్రామంలో దీపావళి పండుగనే జరుపుకోవడం లేదట. అంతేగాదు ఇక్కడ నాగుల చవితిని కూడా జరుపుకోరట. ఒకవేళ ఎవ్వరైన చేస్తే..ఆ ఇంట్లో ఎవ్వరో ఒకరు చనిపోవడం జరుగుతుందట. దాంతో అక్కడి స్థానిక ప్రజలు ఈ రెండు పండుగలను ఎట్టిపరిస్థితుల్లోనూ జరుపుకోరని చెబుతున్నారు. ఈ మూఢనమ్మకాలకు తిలోదాకాలు ఇచ్చి..ఎలాగైనా ఈ పండుగను మిగతా గ్రామాల మాదిరిగానే చేసుకోవాలని అక్కడి యువత గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు పలువురు పెద్దలు చెబుతుండటం విశేషం.
(చదవండి: చంద్రభాగ బీచ్..! సైకత శిల్ప వేదిక..)