Christmas 2021: Who Is Santa Claus, History And Unknown Facts In Telugu - Sakshi
Sakshi News home page

Santa Claus Real Story: ప్రపంచంలోనే అత్యంత బరువైన క్రిస్మస్‌ బహుమతి ఎంతో తెలుసా..?

Published Sat, Dec 25 2021 4:53 PM

Christmas 2021: Who Is Santa Claus, History, Legend and Facts In telugu - Sakshi

క్రిస్మస్‌.. ఈ పేరు వినగానే సంబరాలు గుర్తొస్తాయి. యేసుక్రీస్తు పుట్టిన రోజు సందర్భంగా పాటలు పాడుకుంటూ, సంతోషాన్ని పంచుకుంటూ, బహుమతులు ఇచ్చిపుచ్చుకునే సన్నివేశాలూ కనిపిస్తాయి. వీటన్నింటితో పాటు మరో వ్యక్తి కూడా తప్పక గుర్తొస్తారు. ప్రత్యేకించి చిన్నపిల్లలైతే ఆయన్ను గుర్తుతెచ్చుకోకుండా క్రిస్మస్‌ పండుగను జరుపుకోరని చెప్పడం అతిశయోక్తి కాదు. ఆయనే శాంటా క్లాస్‌.. ముద్దుగా క్రిస్మస్‌ తాత అని పిలుచుకుంటారు.

తెల్ల జుట్టు, పొడవాటి తెల్ల గడ్డం, ఎరుపు, తెలుపు కలిగిన టోపీని, దుస్తులను ధరించి వచ్చే క్రిస్మస్‌ తాతను మనం చూసే ఉంటాం. పిల్లలకు బహుమతులు ఇస్తూ, వారిని ఉత్సాహపరుస్తూ క్రిస్మస్‌ తాత (వేషం వేసిన వ్యక్తి) సందడి వాతావరణం సృష్టిస్తాడు. క్రిస్మస్‌ సందర్భంగా జరిగే కరోల్స్‌ లో పిన్నలూ, పెద్దలు సైతం శాంటా క్లాజ్‌ వేషంలో ఉన్న వ్యక్తి వెంట తిరుగుతూ ఉండటం చూస్తుంటాం. అయితే ఈ క్రిస్మస్‌ తాత ఎక్కడ నుంచి వచ్చాడో ఎప్పుడైనా ఆలోచించారా! పండుగ నుంచి ఆయన్ను వేరు చేయలేనంతగా ఆయన ఎందుకు మారారో తెలుసా !

ఆయనో బిషప్‌..
స్థానికంగా క్రైస్తవుల మతపెద్దగా వ్యవహరించే వ్యక్తిని బిషప్‌ అని పిలుస్తారు. క్రిస్మస్‌ తాతగా పేరొందిన వ్యక్తి కూడా ఓ బిషప్‌. ఆయన పేరు నికోలస్‌. ఆయన ప్రస్తుత టర్కీ లోని మైరా ప్రాంతానికి బిషప్‌ గా పని చేశారు. ఆయన క్రీ. శ. 280వ సంవత్సరానికి చెందినవారు. తండ్రి నుంచి తనకు వచ్చిన ఆస్తులను అవసరాల్లో ఉన్న వారికి దానం చేసిన గొప్ప వ్యక్తి నికోలస్‌. ప్రత్యేకించి క్రిస్మస్‌ పండుగ వచ్చినప్పుడు ఆయన పేదవారి ఇళ్లకు మారు వేషంలో వెళ్లేవారు. వెళ్తూ వెళ్తూ తనతో పాటు బహుమతులను, కొంత డబ్బును తీసుకొని వెళ్లి ఆ పేదలకు అందించేవారు. అనంతరం గుట్టుచప్పుడు కాకుండా అక్కడి నుంచి మాయం అయ్యేవారు. దీంతో ఆయన గురించి అనేక కథలు ప్రచారంలోకి వచ్చాయి. అమెరికాలో, యూరప్‌ దేశాల్లో ఆయన మంచి ప్రాచుర్యం పొందాడు.

సాయమే లక్ష్యం..
పండుగ అంటే మన దగ్గర ఉన్నదాంతో మనమే సుఖంగా బతకడం కాదు.. మన చుట్టూ ఉన్న నలుగురి ముఖాల్లో చిరునవ్వు కలిగించడం అని మనసా వాచా కర్మణా నమ్మిన వ్యక్తి సెయింట్‌ నికోలస్‌. పేదవారికి సాయం చేయడం కోసం ఆస్తి మొత్తాన్ని ధారాదత్తం చేసేవారు ఎవరుంటారు ? కానీ ఆయన ఆ పని చేశారు. అందుకే ప్రతి క్రిస్మస్‌ నాడు.. క్రిస్మస్‌ తాత వచ్చి బహుమతులు ఇస్తాడని పిల్లలంతా నమ్మేంతగా అతడు ఈ పండుగలో చొచ్చుకుపోయాడు. 

శాంటా క్లాస్‌ – క్రిస్మస్‌ ఫ్యాక్ట్స్‌..
క్రిస్మస్‌ తాత నిజానికి నీలి రంగు దుస్తులు ధరించేవారు. అయితే 1930లలో కోకాకోలా కంపెనీ వారు తమ ఉత్పత్తులను ప్రచారం చేసుకోవడానికి ఎరుపు రంగు వాడారు. అవి బాగా ప్రాచుర్యం పొందటంతో క్రిస్మస్‌ తాత కాస్ట్యూమ్స్‌ ఎరుపు, తెలుపు రంగులు సంతరించుకున్నాయి.

బరువైన క్రిస్మస్‌ గిఫ్ట్‌: సుప్రసిద్ధ స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీ విగ్రహాన్ని 1886లో ఫ్రాన్స్‌ దేశం అమెరికాకు బహుమతిగా ఇచ్చింది. దాని బరువు 225 టన్నులు. దీంతో ఈ విగ్రహం ప్రపంచంలోనే అత్యంత బరువైన క్రిస్మస్‌ బహుమతిగా పేరొందింది.
– సృజన్‌ సెగెవ్‌

Advertisement
Advertisement