
ఆధునిక వైద్య చరిత్రలో మరో అద్భుతం. కాలేయం సమస్యలతో బాధే పడే వారికి ఊరట నిచ్చే వార్త. విజయవంతంగా మనిషికి పంది కాలేయం (Pig Liver) అమర్చారు చైనా వైద్యులు. అంతేకాదు దాని పనితీరు కూడా బేషుగ్గా ఉందని ప్రకటించారు. లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ జరిగినతను 170 రోజులు పైగా బతికివున్నాడని, పంది కాలేయం అమర్చిన వారిలో ఎక్కువ రోజులు బతికిన వ్యక్తిగా గుర్తింపు పొందాడని సీఎన్ఎన్ వార్తా సంస్థ వెల్లడించింది.
చైనాలోని అన్హుయ్ ప్రావిన్స్‌కు చెందిన 71 ఏళ్ల వ్యక్తి సిరోసిస్, హెపటైటిస్ బితో బాధపడుతున్నాడు. కాలేయం పూర్తిగా పాడైపోవడంతో లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ (Liver transplantation) చేయాలని నిర్ణయించారు. జన్యుమార్పిడి చేసిన పంది కాలేయాన్ని అతడికి అమర్చారు. తర్వాత అతడిని అబ్జర్వేషన్‌లో ఉంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు. అన్హుయ్ మెడికల్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ బీచెంగ్ సన్ నాయకత్వంలో ఈ ప్రయోగం జరిగింది.
ట్రాన్స్‌ప్లాంటేషన్ తర్వాత కాలేయం పనితీరు బాగానే ఉందని, జీవక్రియలు సాఫీగా సాగాయని వైద్యులు తెలిపారు. అయితే 38వ రోజున చిన్న సమస్య తలెత్తినా పరిష్కరించామన్నారు. జెనోట్రాన్స్‌ప్లాంటేషన్- సంబంధిత థ్రోంబోటిక్ మైక్రోయాంజియోపతి కారణంగా ఏర్పడిన గ్రాఫ్ట్ తొలగించామన్నారు. కాలేయ మార్పిడిన జరిగిన వ్యక్తి 171 రోజులు జీవించిన తర్వాత అంతర్గత రక్తస్రావం కారణంగా మరణించాడని చెప్పారు. ఈ ప్రయోగం ద్వారా కాలేయ మార్పిడిలో ఎదురయ్యే సవాళ్లను చాలా వరకు అధిగమించామని అన్నారు.
భవిష్యత్ ఆశాకిరణం
"గుండె లేదా మూత్రపిండాలతో పోలిస్తే కాలేయ మార్పిడి చాలా క్లిష్టమైందని అందరూ భావిస్తుంటారు. కానీ మా ప్రయోగం తర్వాత ప్రజలు భిన్నంగా ఆలోచిస్తారని నేను భావిస్తున్నాను" అని డాక్టర్ బీచెంగ్ సన్ CNNతో అన్నారు. ఈ ప్రయోగాన్ని భవిష్యత్ ఆశాకిరణంగా వర్ణించారు జర్మనీలోని హన్నోవర్ మెడికల్ స్కూల్‌లో గ్యాస్ట్రోఎంటరాలజీ, హెపటాలజీ ప్రొఫెసర్ డాక్టర్ హీనర్ వెడెమెయర్. కాలేయ మార్పిడి ప్రయోగాల్లో ఇంకా ఎంత దూరం ప్రయాణించాలనే విషయాన్ని కూడా ఈ ప్రయోగం వెల్లడి చేసిందన్నారు.
అతడే ఫస్ట్!
రీడింగ్ క్రానికల్ ప్రకారం.. పరిమాణంలో మనిషి అవయవాలకు వరాహ అవయవాలు పోలి ఉండటం, పంది జన్యు- సవరణ సాంకేతికత లభ్యత కారణంగా వీటి నుంచే మనుషులకు అవయవ మార్పిడి చేస్తున్నారు. తొలిసారిగా అమెరికాకు చెందిన 57 ఏళ్ల డేవిడ్ బెన్నెట్ అనే వ్యక్తికి 2022లో జన్యుమార్పిడి చేసిన పంది గుండెను (Pig Heart) అమర్చారు. యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్ మెడికల్ సెంటర్‌లో ఈ ప్రయోగం జరిగింది. అవయవ మార్పిడి జరిగిన రెండు నెలల తర్వాత బెన్నెట్ మరణించాడు.
పంది కిడ్నీ కూడా..
అమెరికాకు చెందిన 62 ఏళ్ల రిచర్డ్ స్లేమాన్ గత సంవత్సరం మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్‌లో కిడ్నీ మార్పిడి చేయించుకున్నాడు. జన్యుమార్పిడి చేసిన పంది మూత్రపిండ్రాలను (Pig Kidney) ఆయనకు అమర్చారు. ఆ ప్రక్రియ తర్వాత రెండు నెలల్లో రిచర్డ్ మరణించాడు.
చదవండి: అప్పుడు దివాళా.. ఇప్పుడు రోజు 25 లక్షల సంపాదన!