
నేను ఇద్దరు పిల్లల తల్లిని. వయసు నలభై రెండు సంవత్సరాలు. ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్ తీసుకోవచ్చా?
– శాంత, విజయవాడ.
మీరు తప్పకుండా ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఎందుకంటే సర్వైకల్ క్యాన్సర్ హ్యూమన్ పాపిలోమా వైరస్ వలన వస్తుంది. ఇది లైంగిక చర్యల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపించే ఇన్ఫెఫెక్షన్. ఎక్కువసార్లు ఈ ఇన్ఫెక్షన్ కు ఎటువంటి లక్షణాలు ఉండవు. మన రోగనిరోధక వ్యవస్థ చాలాసార్లు దీన్ని తట్టుకోగలుగుతుంది. కాని, కొన్నిసార్లు హైరిస్క్ వైరస్‌లు పదహారు నుంచి పద్దెనిమిది రకాలు శరీరంలో ఉండిపోతే, గర్భాశయ కణాల్లో మార్పులు వస్తాయి. ఇవి కాలక్రమంలో క్యాన్సర్‌కి దారితీయవచ్చు.
ఇలా క్యాన్సర్‌గా మారటానికి మూడు నుంచి పదిహేను సంవత్సరాల వరకు పడుతుంది. ఇది కేవలం సర్వైకల్ క్యాన్సర్‌కే కాకుండా జననాంగ క్యాన్సర్, మలద్వారం, నోటి, గొంతు క్యాన్సర్లు, పురుషుల్లో పురుషాంగ క్యాన్సర్ వంటి ఇతర ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. ఈ టీకా ఎక్కువ ప్రయోజనం ఇచ్చేది పెళ్లికి ముందే తీసుకుంటే. ఎందుకంటే లైంగికంగా చురుకుగా ఉండే వారిలో ఈ ఇన్ఫెక్షన్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
మనకు తెలిసిన పదమూడు రకాల వైరస్‌ల వలన క్యాన్సర్ రావచ్చు. అయితే, ఈ టీకా వాటిలో కొన్ని ముఖ్యమైన రకాల నుంచే రక్షణ ఇస్తుంది. అందుకే టీకాతో పాటు కండోమ్ వాడటం, అవసరమైనప్పుడు స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం కూడా చాలా ముఖ్యం. ఇది నిర్ధారించాలంటే ప్యాప్ టెస్ట్, వైరస్ టెస్ట్ అనే రెండు పరీక్షలు చేయించాలి. ఇవి గర్భాశయ కణాల్లో అసాధారణ మార్పులను ముందే చూపిస్తాయి. అవసరమైతే వెంటనే చికిత్స తీసుకుని క్యాన్సర్ దశకు వెళ్లకుండా అడ్డుకోవచ్చు.
వైరస్ టెస్ట్ ద్వారా హైరిస్క్ వైరస్‌లు ఉన్నాయా లేదా అనే విషయం స్పష్టమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ టీకా వలన సర్వైకల్ క్యాన్సర్, మొటిమలు వచ్చిన వారి సంఖ్య చాలా తగ్గిపోయింది. అందుకే టీకా తీసుకోవడం ఎంతో అవసరం. టీకా తీసుకున్నాక కూడా ప్రతి మూడేళ్లకోసారి లేదా ఐదేళ్లకోసారి స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. తొమ్మిది నుంచి నలభై ఐదేళ్ల వయస్సు మధ్యలో ఉన్నవారికి ఈ టీకా ఇవ్వవచ్చు.
తొమ్మిది నుంచి పద్నాలుగేళ్ల లోపు వయస్సు కలిగినవారికి రెండు డోసులు వేస్తారు. మొదటి డోసు తర్వాత ఆరు నుంచి పన్నెండు నెలల్లో రెండవ డోసు వేయాలి. పదిహేను నుంచి నలభై ఐదేళ్లవారికి మూడు డోసులు అవసరం. మొదటి డోసు తర్వాత రెండు నెలల్లో రెండవ డోసు, ఆరు నెలల్లో మూడవ డోసు తీసుకోవాలి. ఈ టీకాతో పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇది సురక్షితమైంది. కాబట్టి డాక్టర్‌ను సంప్రదించి వారి పర్యవేక్షణలో తప్పకుండా తీసుకోండి.
డాక్టర్ ప్రమత శిరీష, గైనకాలజిస్ట్ – ఆబ్‌స్టెట్రీషియన్, హైదరాబాద్
(చదవండి: గుండె ఆరోగ్యం కోసం బ్రిస్క్ వాకింగ్..! ఎలా చేయాలంటే..)