Numbness and Tingling: కాళ్లు, పాదాలు తరచూ మొద్దుబారుతున్నాయా? ఇలా చేయండి..

Causes and Treatment Tips For Numbness And Tingling In Telugu - Sakshi

కాళ్లు, పాదాలు మొద్దుబారడం అనేది ప్రతి ఒక్కరికీ అనుభవంలోకి వస్తూనే ఉంటుంది. ఇది చాలా వరకు తాత్కాలిక నంబ్‌నెస్‌ అయి ఉంటుంది. చిన్నపాటి చికిత్సలతో ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.

తాత్కాలిక తిమ్మిర్లు...
కూర్చున్న భంగిమ ప్రధాన కారణమై ఉంటుంది. కాళ్లు మడత పెట్టి ఎక్కువ సేపు అదే భంగిమలో కూర్చున్నప్పుడు నరాలు, రక్తనాళాల మీద ఒత్తిడి కలిగి రక్తప్రసరణ వేగం మందగిస్తుంది. ఒత్తిడికి లోనైన ప్రదేశం నుంచి కింద భాగం తిమ్మిరి పట్టేస్తుంది. ఎక్కువ సేపు మోకాళ్ల మీద కూర్చోవడం, పాదాల మీద కూర్చోవడం వల్ల కూడా తాత్కాలిక తిమ్మిరి వస్తుంది. అలాగే సాక్స్, షూస్‌ మరీ బిగుతుగా ఉన్నప్పుడు కాళ్లు, పాదాలు తిమ్మిర్లకు లోనవుతాయి. కొన్నిసార్లు డ్రస్‌ కూడా కారణం కావచ్చు. స్కిన్‌టైట్‌ డ్రస్‌ వేసుకున్నప్పుడు తిమ్మిరి వస్తుంటే ఆ దుస్తులను మానేయడమే అసలైన ఔషధం.

చదవండి: Health Tips: చిగుళ్లనుంచి తరచూ రక్తం వస్తుందా? ఇవి తిన్నారంటే..

ఇంట్లోనే సాంత్వన...
►కాళ్లను చాచి విశ్రాంతి తీసుకుంటే రక్తప్రసరణ క్రమబద్ధమై కొద్ది నిమిషాల్లోనే ఉపశమనం కలుగుతుంది.
►మొద్దుబారిన చోట చల్లటి నీటిని ధారగా పోయడం వల్ల ఫలితం ఉంటుంది. తిమ్మిరితోపాటు కండరాలు పట్టేసినట్లనిపిస్తే గోరువెచ్చటి నీటిని ధారగా పోయాలి లేదా వేడి నీటిలో ముంచిన టవల్‌తో కాపడం పెట్టాలి.
►బయట ఉన్నప్పుడు పైవేవీ సాధ్యం కాదు. కాబట్టి కాలికి, పాదానికి మృదువుగా వేళ్లతో వలయాకారంగా రుద్దుతూ ఐదు నిమిషాల సేపు మసాజ్‌ చేయాలి.
►ఓ గ్లాసు నీళ్లు తాగి పది నిమిషాల సేపు నడవాలి. అలాగే కుర్చీలో కూర్చుని కాళ్లను సౌకర్యవంతంగా జారవేసి మడమ దగ్గర కీలు కదిలేటట్లు పాదాన్ని క్లాక్‌వైజ్‌గా పదిసార్లు, యాంటీ క్లాక్‌వైజ్‌గా పదిసార్లు తిప్పాలి.

ఇలాగైతే... డాక్టర్‌ను కలవాల్సిందే!
►వెన్ను, హిప్, కాళ్లు, మడమలకు గాయాలైనప్పుడు, డయాబెటిక్‌ న్యూరోపతి కండిషన్‌లో కాళ్లు మొద్దుబారడం, తిమ్మిర్లు పట్టడం జరుగుతుంటుంది
►సయాటిక్‌ నర్వ్‌ ఇరిటేషన్‌కు లోనయితే నడుము కింది నుంచి పాదం వరకు తిమ్మిరి, మొద్దుబారుతుంటుంది
►పీరియడ్స్‌ నిడివి పెరిగి రక్తహీనతకు లోనయినప్పుడు తరచు తిమ్మిర్లు రావచ్చు
►యాంటీడిప్రెసెంట్స్, కార్టికోస్టిరాయిడ్స్‌ వంటి మందులు రక్తప్రసరణ మీద ప్రభావం చూపిస్తాయి. కాబట్టి ఆ మందుల వాడకం తర్వాత తిమ్మిర్లకు లోనవుతుంటే మందుల మార్పు కోసం డాక్టర్‌ను సంప్రదించాలి.

చదవండి: పాదాలను బట్టి వారెలాంటివారో అంచనా వేయొచ్చట!!.. ఐతే..

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top