సెప్టిక్‌ట్యాంక్‌ శ్యామ్‌.. ఇప్పటికీ అంతుచిక్కని డెత్‌ మిస్టరీ 

Canada Edwin Sanderson Death Mystery Story - Sakshi

ముగింపునకు నిర్వచనమైన మరణం కూడా కొన్నిసార్లు సరికొత్త కథ ఆరంభానికి కారణమవుతుంది. ఎన్నో చిక్కు ప్రశ్నలతో ముందుకు సాగుతుంది.  44 ఏళ్ల క్రితం కెనడాలోని టోఫిల్డ్‌ నగరంలో మొదలైన  సెప్టిక్‌ట్యాంక్‌ శ్యామ్‌ కథ అలాంటిదే.

అది 1977.. ఏప్రిల్‌ నెల. చార్లీ మెక్‌లియోడ్‌ అనే వ్యక్తి.. కెనడాకు పశ్చిమంగా ఉన్న అల్బెర్టాలోని టోఫిల్డ్‌లో.. తన కొత్త ఇంటి నిర్మాణపనుల్లో బిజీగా ఉన్నాడు. ఆ ఇంటికి కొద్ది దూరంలోనే తన ఫామ్‌హౌస్‌ ఉండటంతో.. కొత్త ఇంటికి ప్రత్యేకంగా సెప్టిక్‌ ట్యాంక్‌ ఎందుకు? ఫామ్‌హౌస్‌లోని పాత సెప్టిక్‌ ట్యాంక్‌ వాడితే సరిపోతుంది కదా? అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా పాత సెప్టిక్‌ ట్యాంక్‌ను రిపేర్‌ చేయించే పనిలో పడ్డాడు.

ఫామ్‌హౌస్‌లోని సెప్టిక్‌ ట్యాంక్‌ ఓపెన్‌ చేయించి.. క్లీనింగ్‌ కార్యక్రమాలు మొదలుపెట్టించాడు. అయితే తవ్వకాల్లో ఒక సాక్స్, ఒక షూ బయటికి వచ్చాయి. లోపల గమనిస్తే.. పసుపు రంగు బెడ్‌ షీట్‌లో ఏదో చుట్టి, నైలాన్‌ తాడుతో దాన్ని కట్టి ఉన్నట్లుగా కనిపించింది. దాంతో వెంటనే చార్లీ పోలీస్‌ స్టేషన్‌కు పరుగుతీశాడు. ప్రెస్‌ వాళ్లకూ సమాచారం ఇచ్చాడు.

రంగంలోకి దిగిన పోలీసులు.. 6.5 అడుగుల లోతులో ఉన్న ఆ పసుపు రంగు మూటను (1977 ఏప్రిల్‌ 13న) వెలికి తీయించారు. అందులో నీలిరంగు జీన్స్, నీలిరంగు వర్కర్స్‌ యూనిఫామ్‌ ధరించిన ఓ మృతదేహం ఉందని గుర్తించారు. సుమారు 50 కేజీల కాల్షియం ఆక్సైడ్‌ (బాడీని త్వరగా డీకంపోజ్‌ చేసే రసాయన మిశ్రమం) మధ్యలో ఉందా కాయం. 

మరునాడు ఉదయాన్నే.. ‘సెప్టిక్‌ ట్యాంక్‌లో గుర్తు తెలియని మృతదేహం..’ అనే హెడ్డింగ్‌తో పత్రికలు ఆ విషయాన్ని సంచలనం చేశాయి.  ఆ వ్యక్తికి 23 నుంచి 32 మధ్య వయసు ఉండొచ్చని.. యూరోపియన్‌ సంతతికి చెందినవాడని, వలస కూలీ అయి ఉంటాడని, 5.8 అడుగుల ఎత్తు, 82 కేజీల బరువు ఉండొచ్చని అంచనాకొచ్చారు అధికారులు.  

పోస్ట్‌మార్టమ్‌ రిపోర్ట్‌లో చాలా విషయాలు బయటపడ్డాయి. అతడు చనిపోయే ముందు చిత్రహింసలకు గురయ్యాడని.. ఒంటిపై చాలా చోట్ల కాలిన గాయాలు ఉన్నాయని.. జననాంగాలు కత్తిరించి, వికృతంగా, క్రూరంగా హింసించారని.. చివరికి తుపాకీతో రెండు సార్లు కాల్చి చంపేశారని, చంపిన తర్వాతే సెప్టిక్‌ ట్యాంక్‌లో పడేశారని.. అందులో పడేసి అప్పటికే.. ఏడాది కావస్తుందని నిర్ధారించారు.

అతడు ఎవరో తెలుసుకోవడానికి ఒకే ఒక్క ఆధారం దొరికింది. అదేంటంటే.. బాధితుడు చనిపోయే ముందు పంటికి ట్రీట్‌మెంట్‌ చేయించుకున్నాడు. దాంతో అల్బెర్టాలోని దాదాపు 800 మంది దంతవైద్యులను సంప్రదించారు పోలీసులు. ఓ వైద్యుడి దగ్గర బాధితుడితో సరిపోలిన రికార్డులున్నాయి. కానీ అక్కడ పేషెంట్‌ వివరాలు స్పష్టంగా లేవు. దాంతో కేసు నీరుగారింది. విచారణలో భాగంగా ఊహా చిత్రాలు వెలుగులోకి వచ్చాయి.

పోలీసులు, విలేఖర్లతో పాటు ప్రజలు కూడా.. ‘అసలు ఈ అజ్ఞాత వ్యక్తి ఎవరు?’ అనే దానిపై ఆసక్తి కనబరచడం మొదలుపెట్టారు. కాలక్రమేణా ఈ కేసు కెనడాలో మోస్ట్‌ పాపులర్‌ క్రైమ్‌ స్టోరీలో ఒకటిగా మారిపోయింది. దాంతో పోలీసులు 1988లో చనిపోయిన వ్యక్తికి ‘సెప్టిక్‌ ట్యాంక్‌ శ్యామ్‌’ అని నామకరణం కూడా చేశారు. చాలా మిస్సింగ్‌ కేసుల్ని ఈ కేసు అంశాలతో పోల్చి.. కాదని తేల్చారు.

అయినా అతడు ఎవరు? అతడ్ని చంపింది ఎవరు? ఎందుకు చంపారు? అనే ఎన్నో ప్రశ్నలకు ఒక్క ఆధారం కూడా చిక్కలేదు. అతడి వయసు, బరువులపై మాత్రం అంచనాలు మారుతూ వచ్చాయి. అధికారులు భావించినట్లు ‘సెప్టిక్‌ట్యాంక్‌ శ్యామ్‌’.. అంత బరువు ఉండడని, అంత ఎత్తు ఉండడని.. డాక్టర్‌ క్లైడ్‌ స్నో భావించాడు. ఎన్ని అంచనాలు వేసినా.. ఎన్ని ప్రయత్నాలు చేసినా అతడు ఎవరు అనేది తేలకపోవడంతో కేసు కోల్డ్‌ కేసుల సరసన చేరిపోయింది.

దాంతో ఊహాగానాలు ఊపందుకున్నాయి. ‘సెప్టిక్‌ట్యాంక్‌ శ్యామ్‌’.. ఎవరో అమ్మాయిని మోసం చేసి ఉంటాడని.. అందుకే అతడి జననాంగాలు కత్తించి, లైగికంగా హింసించి చంపేశారని, చేసిన తప్పుకి శిక్ష అనుభవించాడని..  నమ్మడం మొదలుపెట్టారు చాలామంది.

2017లో కెనడియన్‌ పోలీసులు.. మిస్‌ అయిన వారి కోసం జాతీయస్థాయిలో డీఎన్‌ఏ సేకరణ కార్యక్రమం ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. 2019 నాటికి ఆ ప్రయోగం చాలా విజయవంతం అయ్యింది. 2012తో పోల్చుకుంటే.. ఎన్నో మిస్సింగ్‌ కేసులను పరిష్కరించగలిగారు. కానీ సెప్టిక్‌ట్యాంక్‌ శ్యామ్‌ కేసులో ఏ కదలికా రాలేదు. చివరికి 2021, జూన్‌ 30న సెప్టిక్‌ట్యాంక్‌ శ్యామ్‌ కెనడా దేశస్థుడేనని, అసలు పేరు గోర్డాన్‌ ఎడ్విన్‌ శాండర్సన్‌ అని, 1950 అక్టోబర్‌ 22న మానిటోబాలో జన్మించాడని, అతడు చనిపోయేనాటికి 26 ఏళ్ల వివాహితుడని.. అతడికి ఒక కూతురు కూడా ఉందని తేలింది.

అతడ్ని గుర్తించడానికి అతడి సోదరి డీఎన్‌ఏ ఉపయోగపడింది. అతడు చివరిసారిగా.. కాల్గరీలో నివాసముంటున్న సోదరుడి దగ్గరకు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి వెళ్లాడు. ఆ తర్వాత కనిపించకుండా పోయాడు. ఇప్పటికే శాండర్సన్‌ కేసు నిమిత్తం పది లక్షల డాలర్లకు పైగా ఖర్చు అయ్యిందని అధికారులు లెక్కలేశారు. అయితే ఇంకా ఈ కేసు తేలలేదు. శాండర్సన్‌ను ఎవరు చంపారు? ఎందుకు చంపారు? అంత క్రూరంగా హింసించి చంపడానికి గల కారణం ఏంటీ? ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరకలేదు. -సంహిత నిమ్మన

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top